Ponnam Prabhakar Comments on BJP: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు దశలు పూర్తి అయ్యాయి. ఇంకా మరో మూడు ఫేజ్‌లు మాత్రమే మిగిలివున్నాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ-విపక్ష కాంగ్రెస్ మధ్య మాటలయద్ధం తారాస్థాయికి చేరింది.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేశారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ స్థాయిలో ఆరోపణలు గుప్పించిన సందర్భాలు కూడా లేవు. కాకపోతే ఈసారి కాస్త దూకుడు పెంచారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలోని కొన్ని వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చారు. దీనికి అదేస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బదులిచ్చింది కూడా.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రసంగాల్ని ముక్కలుముక్కలుగా చేసి వారికి అనుకూలంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. దేశంలో మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన స్థాయిని దిగజార్చుకున్నారని ధ్వజమెత్తారు.
Also Read: కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజల ఆస్తులు ముస్లింలకు ఇస్తారని, అర్బన్ టెర్రిరిజం వస్తుందని, చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి దేశాన్ని పదేళ్లు పాలించిన బీజేపీ, ఏం చేసిందో చెప్పుకోవాలన్నారు మంత్రి పొన్నం. అది చెప్పుకోలేక అబద్దాలకు శ్రీకారం చుట్టిందన్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. బీజేపీ ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడుతుందని తన మాటల్లో చెప్పేశారాయన.
అటు ప్రధాని మోదీ కామెంట్స్‌పై ప్రియాంకగాంధీ కూడా అదే రేంజ్‌లో కౌంటరిచ్చారు. మహిళ మంగళ సూత్రం విలువ మీకేం తెలుసని, యుద్ధం సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను కర్ణాటక సభల్లో గుర్తు చేశారు. అంతేకాదు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం మా ఫ్యామిలీ అని గుర్తు చేసిన విషయం తెల్సిందే. మరో మూడు దశల ఎన్నికల మాత్రమే ఉన్నాయి. అవన్నీ ఉత్తరాదిలో ఉండడంతో ఇరు పార్టీల మధ్య మాటలయుద్ధం ముదిరిపాకాన పడినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.