US-India Migration: అక్రమ వలసలపై.. అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. సరిహద్దుల గుండా అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లందరిపై నిఘా పెట్టింది. ఈ మధ్యకాలంలో పట్టుబడుతున్న వారిలో.. ఎక్కువగా భారతీయులే ఉంటున్నారు. అయితే.. వాళ్లు ఎలా దొరికిపోతున్నారు? అరెస్ట్ అవుతున్న వారిలో గుజరాతీలే ఎక్కువగా ఎందుకు ఉంటున్నారు? అనేది.. కొత్త ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. మరి.. అక్రమ వలసల్ని నియంత్రించేందుకు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.?
అగ్రరాజ్యంలోకి భారతీయుల అక్రమ చొరబాట్లు
గత రెండేళ్లుగా.. అమెరికా సరిహద్దుల్లో ఎక్కువ మంది అక్రమ వలసదారులు పట్టబడటానికి.. ప్రధానంగా రెండు కారణాలున్నాయి. గతంలో బోర్డర్ క్రాస్ చేసి అమెరికాలోకి వెళ్లాలనుకునే చొరబాటుదారులంతా.. మెక్సికో మీదుగా ఉన్న డాంకీ రూట్‌ని ఉపయోగించేవారు. ఇప్పుడు.. దాని గుండా ఎవరూ అగ్రరాజ్యంలోకి వెళ్లడం లేదు. ఇందుకు.. మెక్సికోకి తీసుకెళ్లే ముందు.. ఏజెంట్లు కొంతకాలం దుబాయ్‌లో గానీ, టర్కీలో గాని ఉంచుతారు. రెండోది.. కొన్నేళ్లుగా యూఎస్ ఏజెన్సీలు.. ఈ డాంకీ రూట్‌పై తీవ్ర స్థాయిలో నిఘా ఉంచాయ్. దాంతో.. దుబాయ్, టర్కీలో ఉంటున్న అక్రమ వలసదారులు, మానవ అక్రమ రవాణా చైన్ తెగిపోయింది. ఫలితంగా.. డాంకీ రూట్ గుండా అక్రమ చొరబాట్లు చాలా మేరకు తగ్గాయ్.
అక్రమ వలసదారుల్లో ఎక్కువగా గుజరాతీలు
మెక్సికో మీదుగా డాంకీ రూట్‌పై అమెరికా నిఘాతో.. అక్రమ వలసదారులు ఇతర మార్గాలు వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే.. అక్రమంగా అమెరికాకు వెళ్లే భారతీయుల్లో గుజరాతీలు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్లంతా మెక్సికో మీదుగా వెళ్లడం కంటే.. కెనడా మీదుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఓ కారణముంది. కెనడా మీదుగా అయితే.. ఓ టాక్సీని అద్దెకు తీసుకొని.. చాలా సులువుగా యూఎస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో.. కెనడా విజిటర్స్ వీసాతో.. ట్యాక్సీల్లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయని యూఎస్ అధికారులు గుర్తించారు. దాంతో.. కెనడా-యూఎస్ సరిహద్దుపైనా నిఘాను పెంచారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
అమెరికా సరిహద్దుల్లో అసలేం జరుగుతోంది?
సాధారణంగా.. బోర్డర్ నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్లాలనుకునే వలసదారుల్ని తిరిగి కెనడాకు పంపించేస్తారు. ఇలా వెళ్లే వాళ్లలో చాలా మంది దగ్గర కెనడా విజిటర్ వీసాలుంటాయ్. అయినా.. ఎలాగైనా అమెరికాకు వెళ్లాలనుకునే అక్రమ వలసదారులంతా.. కొన్నాళ్లు ఆగి.. మళ్లీ కెనడా బోర్డర్ గుండానే అగ్రరాజ్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో.. కెనడా సరిహద్దుల్లో యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ భారతీయ కుటుంబం.. మంచులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. అప్పట్నుంచి.. ఈ మార్గంలో అక్రమంగా వచ్చే వాళ్లపై అమెరికా నిఘా పెట్టింది.
Also Read: అగ్ర రాజ్యమే వాళ్ళ టార్గెట్! అమెరికా లో గెలిచినోళ్లకు గండం?
అమెరికాలోకి ఎందుకు ప్రవేశించాలనుకుంటున్నారు?
కొన్నేళ్లుగా.. అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్లేందుకు ప్రయత్నించే భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే.. సరైన అనుమతులు లేకుండా యూఎస్ సరిహద్దుల్ని దాటేందుకు ప్రయత్నిస్తున్న మన వాళ్లు.. వేల సంఖ్యలో పట్టుబడుతున్నారు. సౌత్, నార్త్ సరిహద్దుల్లో ప్రమాదకరమని తెలిసినా.. చాలా మంది అగ్రరాజ్యంలోకి ప్రవేశించేందుకు అత్యంత కఠినమైన, ప్రతికూలమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.
ఇలా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నవారిల ఎక్కువగా చెప్పాలంచే.. గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. మిగతా వాళ్లంతా అమెరికాలో స్థిరపడాలని బలంగా కోరుకుంటున్న వాళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. సరిహద్దుల్లో పట్టుబడుతున్న వాళ్లను అమెరికా అధికారులు 4 కేటగిరీలుగా విభజించారు. పిల్లలు లేకుండా వచ్చిన వాళ్లు, కుటుంబ సభ్యులతో పాటు పిల్లలు ఉన్నవాళ్లు, మొత్తం కుటుంబంతో వచ్చిన వాళ్లు, ఒంటరి వాళ్లు ఉన్నారు. ఇటీవలి కాలంలో.. ఎక్కువగా సింగిల్ అడల్ట్స్ పట్టుబడుతున్నారు. ఏటా చాలా మంది భారతీయులు అమెరికాలో పట్టుబడుతున్నారని.. మానవతా కారణాలతో కొందరిని మాత్రమే.. దేశం నుంచి వెనక్కి పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది 1.60 లక్షల మందిని వెనక్కి పంపిన యూఎస్
వాస్తవానికి.. అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారితో పోలిస్తే.. సరిహద్దు దగ్గర పట్టుబడిన వాళ్లు చాలా తక్కువని లెక్కలు చెబుతున్నాయ్. సరిహద్దు దగ్గర ఒక్కరు పట్టుబడితే.. అందుకు బదులుగా దాదాపు 10 మంది వ్యక్తులు యూఎస్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే.. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్లందరినీ.. తిరిగి వాళ్ల సొంత దేశాలకు పంపించేందుకు.. యూఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుమతి లేకుండా ఉన్న ఎంతోమంది భారతీయుల్లో.. కొందరిని వెనక్కి పంపించారు అధికారులు. ఈ ఏడాది.. దాదాపు లక్షా 60 వేల మంది అక్రమ వలసదారుల్ని అమెరికా వెనక్కి పంపింది. 495కు పైగా ప్రత్యేక విమానాల్లో 145 దేశాలకు చెందిన పౌరులను తమ దేశం నుంచి బయటకు పంపేసింది. వీరిలో.. భారతీయులు కూడా ఉన్నారు. అక్రమంగా తమ దేశంలో ఉంటున్న వారు.. స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.