Big Stories

Ayodhya Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన.. కోట్లాది హిందువుల కల త్వరలోనే నిజం

Share this post with your friends

Ayodhya Ram Mandir Inauguration

Ayodhya Ram Mandir Inauguration(Latest today news in India):

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా కొలిక్కివచ్చాయి. ఈ నెల చివరివరకు ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తికానున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.

అయోధ్య..శ్రీరాముడు నడయాడిన నేల.. హిందూవుల కల సాకారమవుతున్న వేళ.. బాలరాముడి ప్రతిష్టాపనకు ఆసన్నమైన సమయం.

తండ్రి మాటను జవదాటని జగదాభిరాముడు నడయాడిన నేల మళ్లీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామమందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. 10 రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను వచ్చే ఏడాదిలోనే నిర్వహించనున్నారు. జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట జరుగనుంది. లక్ష్మీకాంత్‌ మథురనాథ్‌ దీక్షిత్‌ అనే 86 ఏండ్ల పండితుని చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది.

నాలుగు దశల్లో వేడుకలను నిర్వహించనున్నారు. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 7వేల మందిని ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా మొత్తం 7వేల మంది అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పూజారులు, సాధువులే కాదు, ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో సహా రాజకీయ నాయకులు జనవరి 22న జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ, వ్యాపారవేత్తలు ముఖేష్‌ అంబానీ, అదానీ, రతన్‌ టాటాకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కంగనా రనౌత్‌, అక్షయ్‌కుమార్‌, దీపిక పడుకొనేకు ఇన్విటేషన్‌ లెటర్స్‌ వెళ్లాయి. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా.. రామోత్సవ పేరుతో వారోత్సవాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. జనవరి 15 నుంచి 22 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అయోధ్య పులకించిపోనుంది. భజనాలు, కీర్తనలుతో ఆ ప్రాంతమంతా మార్మోగనుంది. ఈ వేడుకల్లో.. ప్రముఖ గాయకులు అనుప్‌, ఏఆర్‌ రెహమాన్‌, హరిహరణ్‌, కైలాష్‌ ఖేర్‌, శంకర్‌ మహదేవన్‌ లాంటి పాల్గొంటారు.

దాదాపు రెండున్నరేళ్లుగా జరుగుతున్న ఆలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌ చివరి నాటికి ఫస్ట్‌ ఫేజ్‌ పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు వర్క్స్‌ కొనసాగుతున్నాయి. నగరా స్టైల్‌లో ఆలయ నిర్మాణం జరుగుతోంది. ప్రధానంగా పింక్‌స్టోన్‌ మార్బుల్‌తో నిర్మిస్తున్నారు. ఆ రాయిని రాజస్థాన్‌లో మిర్జాపూర్‌, బన్సీ పహర్‌పూర్‌ నుంచి తెప్పించారు. 2 టన్నుల బరువుండే ఒక్కో రాయిని కట్‌ చేసి వినియోగిస్తున్నారు. 21లక్షల క్యూబిక్‌ ఫీట్ల రాయి కోసం.. దాదాపుగా 17వేల గ్రానైట్‌ బండలను ఉపయోగించారు. ఆలయ ఆర్కిటెక్ట్‌ చంద్రకాంత్‌ భాయ్‌ సోంపుర నేతృత్వంలో పనులు జెట్‌ స్పీడ్‌లో జరుగుతున్నాయి. మొత్తంగా 71 ఎకరాల్లో టెంపుల్ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. ప్రధాన ఆలయం మాత్రం 3 ఎకరాల్లో నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా 1800 కోట్ల అంచనా వ్యయంతో పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం పొడవు 380 ఫీట్లు, వెడల్పు 250ఫీట్లు ఉండనుంది. ఇక గర్భాలయ గోపురం పొడవు 161 ఫీట్లుగా ఉంటుంది.

కేంద్ర సహకారంతో యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతోంది. శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని కలిపే ప్రధాన మార్గాలన్నింటిలో రామాయణ కాలం నాటి కీలకమైన ఘట్టాలను అందంగా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం యోగి ఆదేశాలతో అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ రామజన్మభూమి ఆలయానికి వెళ్లే అన్ని ప్రధాన రహదారుల గోడలపై కళాఖండాలను అలంకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రామాయణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలతో అయోధ్య నగరాన్ని సుందరీకరిస్తున్నారు. టెర్రకోట కళాకండాలు తొమ్మిది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో 50కిపైగా శిల్పాలు, మ్యూరల్ పెయింటింగ్స్ ఉండనున్నాయి. వీటిని రామాయణ ఘట్టాల ఆధారంగా తీర్చిదిద్దుతున్నారు.

ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు. ఈ నిర్మాణంలో స్టీల్‌ కానీ సాధారణ సిమెంట్‌ను వినియోగించలేదు. శంకుస్థాపన తర్వాత ఆలయ కమిటీ చెన్నై ఐఐటీ ప్రతినిధులను సంప్రదించి పునాదులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చింది. అందులోభాగంగానే పునాదిలో వాడిన మట్టి బండగా మారే టెక్నాలజీని వినియోగించారు. అలా దాదాపుగా 47 లేయర్ల వరకు ఫౌండేషన్‌ వర్క్స్‌ జరిగినట్టు తెలుస్తోంది. దీని వల్ల ఆలయానికి మరో 1000 ఏండ్ల వరకు ఎలాంటి రిపేర్లు రావని చెబుతున్నారు. పైగా 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా ఇంచు కూడా చెక్కుచెదరదని స్పష్టం చేస్తున్నారు. తొలిదశలో రామ్‌లల్లా ఆలయం కొలువయ్యే గ్రౌండ్‌ ఫ్లోర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మిగతా రెండు మూడు దశల్లో జరిగే పనులను వచ్చే రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. రెండోదశలో.. ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ ఫ్లోర్లను కన్‌స్ట్రక్ట్‌ చేస్తారు. ఆ పనులను 2024 డిసెంబర్‌ కల్లా పినిష్‌ చేసేలా టార్గెట్‌ పెట్టుకున్నారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లోనే రామ్‌ దర్బార్‌కూడా ఉండనుంది. అందులోని ప్రతి పిల్లర్‌ పై 30 చిత్రాలను చెక్కారు. రెండోదశలోనే టెంపుల్‌ సిటీలోని మిగతా ఆలయాను కూడా నిర్మించనున్నారు. ఇక థర్డ్‌ ఫేజ్‌లో అంటే ఆడిటోరియం, సైడ్‌ వాల్స్‌ నిర్మాణం లాంటి పనులను పూర్తిచేయనున్నారు. ఈ పనులను.. 2025 డిసెంబర్‌ కల్లా కంప్లీట్‌ చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.

మొత్తంగా ఐదేళ్ల బాలుని రూపంలో ఉండే మూడు రాముడి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. వేర్వేరు శిల్పులు.. రహాస్య ప్రదేశాల్లో వీటిని చెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు విగ్రహాల్లో అత్యంత సుందరంగా కనిపించే దాన్ని ఎంపిక చేసి రామ మందిరం గర్భ గుడిలో ప్రతిష్ఠాపన చేస్తారు. జనవరి 27 తర్వాత భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారని తెలుస్తోంది. అయితే భక్తులు కనీసం 20 నుంచి 30 ఫీట్ల దూరం నుంచే రాముడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మూడు విగ్రహాల్లో ఒకదాన్ని తెల్లటి మక్‌రానా మార్బుల్‌తో తీర్చిదిద్దుతున్నారు. మిగతా రెండు కర్ణాటకలో మాత్రమే లభించే కృష్ణ శిల రాయిపై చెక్కుతున్నారు. వీటిని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ చెక్‌ చేసిన తర్వాతే శిల్పులు పని మొదలెట్టారు. మూడు విగ్రహాలు కూడా 51 ఇంచుల పొడవు ఉండనున్నాయి. రామునిలో చేతిలో బాణం.. వెనకబాగాన అమ్ములపొది ఉంటాయి. ఇక ఆలయానికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. అదే రామ్‌లల్లా నుదుటిపై సూర్యకిరణాలు పడటం. ప్రతి శ్రీరామనవమికి శ్రీరాముని నుదిటిపై ఆ కిరణాలు వచ్చేలా నిర్మాణం చేస్తున్నారు. దీన్ని పుణెలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డిజైన్‌ చేసినట్టు తెలుస్తోంది.

శతాబ్ధాల నిరీక్షణకు, దశాబ్దాల పోరాటానికి ఫలితంగా రామజన్మభూమిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రాముడు జన్మించిన అయోధ్యలో తిరిగి రామనామం ప్రతిధ్వనించబోతోంది. యుగ పురుషుడు తిరుగాడిన నేల హిందువులకు పవిత్ర క్షేత్రంగా విరాజిల్లనుంది. రామయ్య బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచిందని, 14ఏండ్ల వనవాసం తర్వాత అయోధ్యరాజధానిగా రాజ్యాన్ని పాలించాడని రామాయణం చెప్తోంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News