Big Stories

India Politics North Vs South | 2024 లోక్ సభ ఎన్నికల్లో ‘నార్త్ వర్సెస్ సౌత్’ పోరు

Share this post with your friends

India Politics North Vs South

India Politics North Vs South(Political news telugu):

ఇండియాలో లోక్‌సభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఉత్తర, దక్షిణ రాజకీయాల విభజన వివాదం ముందుకొస్తుంది. తాజగా డిఎంపకె ఎంపీ డిఎన్‌వి సెంథిల్ కుమార్ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం రాజుకుంది. ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ, వివాదం మాత్రం సద్దుమణగలేదు. అయితే, ఇలాంటి కామెంట్లు గతంలో కూడా చాలా సార్లు వచ్చాయి. కానీ, ఇంతగా రభస జరగలేదు. అప్పట్లో అంతగా లేని గోల ఇప్పుడెందుకు ఎక్కువగా ఉంది…? సెంథిల్ కామెంట్‌ను రచ్చ రచ్చ చేస్తే ఏ పార్టీకి లబ్ధీ చేకూరుతుంది..? ఏ పార్టీకి నష్టం వాటిల్లుతుంది..?

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ అనే మాట ఇప్పటికే నానిపోయింది. అయితే, సెమీఫైనల్స్‌లో గెలిచిన టీమ్ ఫైనల్స్‌లో గెలుస్తుందా లేదా అనేది ఓటర్ల చేతిలో ఉంటుంది. అయినా, సెమీస్‌లో పర్ఫాఫెన్స్ సూపర్‌గా ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. అలాగని, ఫైనల్స్‌లో ప్రత్యర్థిని లైట్ తీసుకుంటే ఫైట్ చాలా కష్టమవుతుంది. అందుకే, ఏదో ఒక విధంగా ప్రత్యర్థిని ఓడించే ప్రయత్నాలు చేయాలి. క్రీడారంగంలో అయితే ఆట మొదలైన తర్వాత మైదానంలోనే గెలుపోటములు డిసైడ్ అవుతాయి. కానీ, రాజకీయ రణరంగంలో అలా ఉండదు. ఒక ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి తర్వాత ఎన్నికలు వచ్చే వరకూ ఈ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఎన్నికలకు ఏడాది ముందు నుండి మరింత పీక్ స్టేజ్‌లో పాలిటిక్స్ నడుస్తాయి. ఐదేళ్ల పర్ఫామెన్స్ బట్టి ఫైనల్ రిజల్ట్స్ ఉంటాయనది ఒకప్పటి ఎన్నికల్లో నిజమేమో గానీ ఈ స్మార్ట్ యుగంలో అందులో కాస్త సవరణ వచ్చింది. ఎన్నికలకు ముందు ఆరు నెలలే అత్యంత కీలకం. ఈ టైమ్‌లో ప్రజల్లో ఎవరు పాపులర్ అవుతారో వారిదే పైచేయిగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే, పర్ఫామెన్స్ కంటే పాపులారిటీకే నేటి రాజకీయాల్లో పెద్ద పీట. పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌లు కూడా ఈ అంశంలోనే కాన్సన్‌ట్రేట్ చేయడం పెరిగిపోయింది. అందుకే, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా పాపులరిటీ పెద్ద ప్రభావం చూపుతుందనే ఆలోచన బలంగా ఉంది. ఇది నేతలకు మాత్రమే పరిమితం కాదు… మాటలకు కూడా… అందుకే, నేతల మాటలు ఎంత పాపులర్ అయితే అంతగా ప్రజల్లోకి వెళ్లొచ్చు. సరిగ్గా ఈ స్ట్రాటజీతో ఎన్ని వివాదాలను సృష్టిస్తే ఫ్రీ పబ్లిసిటీ పక్కాగా వస్తుంది. అందులోనూ, భారతదేశంలో మనోభావాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే, ప్రజల మనోభావాలను తాకే ఏ అంశమైనా పొలిటికల్ గేమ్‌లో పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.

ప్రస్తుతం దేశంలో రాజకీయాలన్నీ అభివృద్ధి కంటే ఎక్కువగా మనోభావాలు, ఆత్మ గౌరవాలతోనే ముడిపడి ఉంది. ఇలాంటి మనోభావాలకు ఉత్ప్రేరకమైన మాట ఇటీవల డిఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ జారిన ‘గోమూత్ర రాష్ట్రాలు’ అనే మాట. తాజాగా మూడు ఉత్తర భారత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో బిజెపి విజయం సాధించడం. దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ఎప్పటి నుండో ఉన్న ఉత్తరాది, దక్షిణాది వివాదం ఇప్పుడు మరింత ముదురింది. డిసెంబర్ 5న లోక్‌సభలో డిఎంకె ఎంపి డిఎన్‌వి సెంథిల్ కుమార్ హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాలపై చేసిన ఈ వ్యాఖ్యతో రాజకీయ చర్చ మరింత ఊపందుకుంది. అయితే, ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంటు రికార్డుల నుండి తొలగించబడ్డాయి. కానీ, దేశవ్యాప్తంగా వాటిపై గందరగోళం మాత్రం సద్దుమణగలేదు. సరికదా… పార్లమెంట్ పోలింగ్‌లో దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుంది కాబట్టి ఇది అప్పటి వరకూ సజీవంగానే ఉండకపోదు. నిజానికి, డిసెంబర్ 3, కౌంటింగ్ రోజున కాంగ్రెస్ నేతలు ప్రవీణ్ చక్రవర్తి, కార్తీ చిదంబరం చేసిన కొన్ని ట్వీట్లతో సోషల్ మీడియాలో వివాదం మొదలైందనది కొందరు చెబుతున్న మాట. ఈ రెండు పోస్ట్‌ల్లో చక్రవర్తి పోస్ట్.. ‘దక్షిణ-ఉత్తర సరిహద్దు రేఖ మందంగా, స్పష్టంగా పెరుగుతోంది!’ అని చెబితే…, కార్తీ చిదంబరం పోస్ట్‌లో రెండే రెండు పదాలు ‘ది సౌత్’ అని కామెంట్ చేశారు. దీనితో, ‘ఉత్తర భారతీయులు బీజేపీకి ఓటు వేసినా, ఆ తర్వాత వాళ్లు ఉద్యోగాల కోసం దక్షిణాది రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు’ అంటూ కొన్ని పోస్టులు హల్‌చల్ చేశాయి. ఇక, పలువురు ప్రముఖ విమర్శకులు “దక్షిణాదిలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉందని.. బిజెపి విధానాలు, సిద్ధాంతాలు దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ఓటర్లను మాత్రమే ప్రభావితం చేస్తాయని” అన్నారు. మరికొందరు 2024 ఎన్నికల పోరు ‘నార్త్ వర్సెస్ సౌత్’ మధ్య పోరు అని కామెంట్ చేశారు. అయితే, ఈ పోస్టులకు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడమే ఇక్కడ అసలు విషయం. ప్రధాని నరేంద్ర మోడీ ఎమోజీలతో నిండిపోయిన ఓ పోస్ట్‌లో ప్రతిపక్ష పార్టీలను, వారి మద్దతుదారులను తీవ్రంగా విమర్శించారు.

తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక… “కొంతమంది వ్యక్తులు, ఉత్తర, దక్షిణ భారతాల మధ్య విభజన చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు” అంటూ ఓ జర్నలిస్టు పోస్టు చేసిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ కూడా రీపోస్టు చేశారు. “ఈ విభజన అజెండా పట్ల జాగ్రత్తగా ఉండాలి. 70 ఏళ్ళ ఈ అలవాటు అంత తొందరగా పోదు” అని నర్మగర్భంగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ పోస్ట్‌లో రాశారు. అయితే, చక్రవర్తి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించడంతో ఈ పోస్ట్‌లు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత చక్రవర్తి సదరు పోస్ట్‌ను తొలగించినప్పటికీ… చర్చ మాత్రం తగ్గలేదు. ఇక, కార్తీ చిదంబరం దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నించారు. మరో పోస్ట్‌‌లో… “నేను అలాంటి భావన వచ్చే విధంగా ఏమీ అనలేదు. ఆ మాటను వారు కోరుకున్న విధంగా అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరి ఊహకు సంబంధించిన విషయం. అన్నిటికంటే ఎక్కువ నేను భారతీయుడిని, నేను చెప్పిందంతా ‘దక్షిణం’ అని మాత్రమే. దీని పైన కొందరు ఎందుకంత ఉత్సాహంగా ఉన్నారో నాకు అర్థంకావట్లేదు” అని రాశారు. ‘నార్త్ వర్సెస్ సౌత్’ అనే మాటలపై బిజెపి అగ్ర నాయకులు నిందలు వేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. “రెండు కార్డులను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకుంటారని.. ఇప్పుడు రెండో కార్డు తీసారు” అని అన్నారు. “హిందూ పార్టీ, కుల రాజకీయాలు, ఈవీఎంలు, ఉచితాలు..” వంటి విమర్శల్లో కాంగ్రెస్ విఫలం కావడం వల్లనే “వేర్పాటువాద” వ్యవహారం వెలుగులోకి తీసుకొచ్చిందని కేరళ బీజేపీ అధ్యక్షుడు కే.సురేంద్రన్ అన్నారు. దీని తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎమోజీలతో విరుచుకుపడ్డారు. ఇంటర్నెట్‌లో తుఫాను రేపిన మోడీ X పోస్ట్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధాన చర్చలోకి ఎంటర్ అయ్యారు. “వారి అహంకారం, అబద్ధాలు, నిరాశావాదం, అజ్ఞానంతో వారు సంతోషంగా ఉండవచ్చు. కానీ, వారి విభజన ఎజెండా పట్ల జాగ్రత్త వహించండి. 70 ఏళ్ల పాత అలవాటు అంత తేలికగా పోదు. అలాగే, మున్ముందు మరెన్నో విధ్వంసాలకు సిద్ధంగా ఉండాలనేది ప్రజల విజ్ఞత” అంటూ ఓటర్లకు విజ్ఞతా వాక్యాలు వెల్లడించారు.

సరిగ్గా ఈ పరిణామం తర్వాత డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ పార్లమెంటులో హిందీ బెల్ట్ రాష్ట్రాలలో బీజేపీ గెలుపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో సెంథిల్‌ కుమార్ మాట్లాడుతూ “గోమూత్ర రాష్ట్రాలుగా పిలిచే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ బలంగా ఉందని ఈ దేశ ప్రజలు నమ్ముతున్నారు. అక్కడ మాత్రమే ఆ పార్టీ గెలవగలదు” అన్నారు. అలాగే “మీరు దక్షిణ భారతంలో అడుగుపెట్టలేరు. మేం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలలో బలంగా ఉన్నాం. అందుకే మీరు ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి, మీరు పరోక్షంగా అధికారం చెలాయించినా మేమేమీ ఆశ్చర్యపోము. ఎందుకంటే కలలలో కూడా మీరు దక్షిణాది రాష్ట్రాలలో అధికారంలోకి రాలేరు” అన్నారు. నిజానికి, జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) చట్టం, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా సెంథిల్ కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే అధికార బిజెపి వాటిని పూర్తి భారతదేశాని ఆపాదించి అల్లరి చేశాయి. అయినప్పటికీ, బిజెపితో పాటు జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా సెంథిల్ వ్యాఖ్యలను ఖండించాయి. సెంథిల్ సొంత పార్టీ డీఎంకే కూడా సెంథిల్ వ్యాఖ్యల వ్యవహారంలో దూరంగా ఉంది. అయితే సెంథిల్ కుమార్ పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. అయినా, దొరక్క దొరకిన అవకాశం, అందులోనూ లోక్‌సభ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్న నేపథ్యంలో బీజేపీ ఈ వ్యాఖ్యలపై మరింత కోపం ప్రదర్శిస్తూనే ఉంది. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘ఇవి సనాతన సంప్రదాయాన్ని, సనాతన వాదులను’ అవమానించడమే అన్నారు.

వాస్తవానికి, ఉత్తర దక్షిణ భారతాలనే విభజన వ్యవహారం ఒక ఆత్మగౌరవ సమస్యగా చూపే ప్రయత్నం చేస్తూ రాజకీయాల్లో విచ్చలివిడిగా వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఉత్తర, దక్షిణ భారతం గొడవకు చాలా చరిత్ర ఉంది. ఇటు ఉత్తర భారతంలోనూ, అటు దక్షిణాన ప్రభావం చూపే రాజకీయ పార్టీలు ఈ విషయంలో చాలా దూకుడుగా ఉంటాయి. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం… ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే విభేదాలను ఎక్కువచేసి చూపుతున్నారని, వాస్తవం మరోలా ఉంటుందని అంటారు. ఉత్తరాది వర్సెస్ సౌత్ బైనరీ ఘర్షణ రాజకీయాలు భారతదేశంలోని రాష్ట్రాల రాజకీయాల్లో ప్రభావం కూడా చూపకపోలేదు. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ, తమిళనాడులో ఎంజీఆర్ తీసుకొచ్చిన డీఎంకె పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక, దక్షిణాది, ఉత్తరాది వివాదాలు కూడా ఇదే తొలిసారి కాదు. 1977లో ఉత్తరాది మొత్తం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మారగా… దక్షిణాది ఓటర్లు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశారు. అప్పుడు పెద్దగా ఈ బైనరీ కనిపించలేదు. ఈ ఫలితాలకు విరుద్ధంగా, 1980లలో దక్షిణాదిలో కాంగ్రెసేతర ప్రాంతీయ ప్రభుత్వాలు ఎర్పడగా, ఉత్తరాది మొత్తం కాంగ్రెస్‌కు పట్టం కట్టింది. అప్పుడు కూడా ఎవరూ ఈ తేడా రాలేదు. అయితే, దేశంలోని 12 రాష్ట్రాల్లో బిజెపి ఆధిపత్యం నడుస్తున్న తరుణంలో ఇప్పుడు ఉత్తర దక్షిణ వివాదం మరింతగా రాజుకుంటుంది. మొదటి నుండి ఉన్న అభిప్రాయ విభేదం ఎక్కడంటే… ఉత్తరాది హిందూ సంప్రదాయవాదులు, నిరక్షరాస్యులు, వెనుకబడినవారనీ… దక్షిణాది ప్రగతిశీల, లౌకికవాదం ప్రభావం ఎక్కువగా ఉందనే భావన ప్రచారంలో ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ వివాదంతో బిజెపి దక్షిణాదిలోనూ తన ఉనికిని పెంచుకోవాలనా… లేదంటే, కాంగ్రెస్ ఉత్తరాదిలో తన పూర్వ స్థానాన్ని పొందుడానికా… అన్నది తేలాల్సి ఉంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News