Big Stories

Mahua Moitra : మహువా మెయిత్రా ఎవరు? అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్.. ఒక బహిష్కృత ఎంపీ..

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టిఎంసీ)​ పార్టీ నాయకురాలు, లోక్ సభ ఎంపీ మహువా మొయిత్రా. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలపై ఆమెను లోక్ సభను బహిష్కరించారు. ఈ వార్త దేశమంతా సంచలనంగా మారింది. దీంతో అందరూ ఈ మహువా మొయిత్రా ఎవరు? ఆమెను ఎందుకు బహిష్కరించారు అని తెలుసుకునేందుకు కుతూహలంగా ఉన్నారు.

- Advertisement -

1974 అక్టోబర్ 12 న మ‌హువా మొయిత్రా అస్సాంలోని కచార్ జిల్లా లాబాక్‌లో జన్మించారు. 1998 లో ఆమెరికాలోని మసాచుసెట్స్ మౌంట్ హోలియోక్ కాలేజీలో మ్యాథ్స్, ఎకనామిక్స్‌‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన JP మోర్గాన్‌లో ఉద్యోగం చేశారు. తక్కువకాలంలోనే ఆమె ఆ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. కానీ ఆ ఉద్యోగం ఆమెకు సంతృప్తినివ్వలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో భారత రాజకీయాల్లో అడుగుపెట్టారు.

- Advertisement -

2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ నమ్మకస్తులలో ఒకరిగా మారారు. కానీ త్వరలోనే ఆమెకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బేనర్జీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆమె కాంగ్రెస్ వదిలి 2010 సంవత్సరంలో టిఎంసీ పార్టీలో చేరారు. ఆ తరువాత మహువా మొయిత్రా 2016లో పశ్చిమ బెంగాల్ కరీంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. మూడేళ్ల తరువాత 2019లోనే కృష్ణానగర్ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు.

మహువా మొయిత్రా ఒక ఫైర్ బ్రాండ్. ఆమె పదునైన మాటలతో ప్రసంగాలు చేస్తారు. ఆమె లోక్ సభలో పలుమార్లు మోదీ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపారు. ప్రజా సమస్యలపై తన గొంతుకతో గట్టిగా ప్రశ్నిస్తారు. ఈ క్రమంలో పలు టివి డిబేట్లలో కూడా ఆమె బిజేపీ నాయకులపై విరచుకు పడ్డారు. పలుమార్లు ఆమెపై బిజేపీ నాయకులు పరువు నష్టం దావా వేశారు. కానీ కోర్టులో అవేమీ నిలబడలేదు.

ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం పార్లమెంటులో అదానీ అవినీతి, ఆయన కంపెనీ కుంభకోణాలపై పార్లమెంటులో చర్చ జరపాలని విపక్షలాన్నీ పట్టుబట్టాయి. కానీ మోదీ ప్రభుత్వం ఈ అంశంపై మౌనం దాల్చింది. ఎవరు మౌనంగా ఉన్నా.. మహువా మొయిత్రా మాత్రం తగ్గలేదు. అదానీ కంపెనీలకు అధికార పార్టీ దేశ సంపదను కట్టబెడుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది జరుగుతుండగా.. బిజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆమె లంచం తీసుకుందంటూ ఎదురు ఆరోపణలు చేశారు.

పార్లమెంటులో అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నించేందుకు మరో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ వద్ద నగదు, ఖరీదైన కానుకలు తీసుకున్నదని ఆమె చర్యలపై విచారణ జరపాలని బిజేపీ లోక్ సభలో డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంటు ఎథిక్స్ కమిటీ(నైతిక విలువల కమిటీ) దీనిపై విచారణ చేసి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో మహువా మొయిత్రా నిజంగానే డబ్బులు తీసుకుందని.. అందుకు ఆధారాలు ఉన్నాయని తేలింది. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు.

అయితే ఇక్కడ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఎవరు అనేది ప్రశ్న. ఆయనకు అదానీ అవినీతి, కంపెనీ స్కామ్‌లకు సంబంధం మేమిటి అనేది మరో ప్రశ్న. హీరానందానీ గ్రూపు కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద దిగ్గజం. దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కంపెనీ బిల్డింగ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్స్ ఎన్నో నిర్మించిన కంపెనీ హీరానందానీ. ముంబై, బెంగుళూరు, చెన్నై లో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టింది. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్స్ తయారీ, డేటా సెంటర్, కన్జ్యూమర్ సర్వీసెస్‌లో కూడా వేగంగా విస్తిరిస్తోంది.

ఈ క్రమంలో హీరానందానీ కంపెనీకి అదానీ కంపెనీకి మధ్య వ్యాపారపరంగా పోటీ నెలకొంది. దీంతో కంపెనీ ఓనర్ దర్శన్ హీరానందానీ అదానీ కంపెనీ కుంభకోణాలపై సమాచారం సేకరించి.. మహువా మెయిత్రాకు చెప్పారని.. ఆమెను పార్లమెంటులో దీనిపై ప్రశ్నించేందుకు కానుకలు ఇచ్చారని అధికార బిజేపీ ఆరోపణలు చేసింది. బిజేపీ ఆరోపణలు బలం చేకూర్చే విధంగా.. హీరానందానీ వద్ద మహువా మెయిత్రా లోక్ సభ వెబ్ సైట్ పాస్ వర్డ్ ఉందని ఎథిక్స్ కమిటీ తెలిపింది.

అయితే ఒక లోక్ సభ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎథిక్స్ కమిటీ చెప్పడంతోనే అప్పుడే ఆ ఎంపీని లోక్ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. ఇలా దేశ చరిత్రలోనే మొదటిసారి జరిగింది. ఇంతకు ముందు 2011లో ఆరుగరు ఎంపీలపై వేటు వేయాలని ఎథిక్స్ కమిటీ లోక్ సభ, రాజ్య సభలో నివేదిక సమర్పించినా.. చాలా రోజులపాటు చర్చలు చేసి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఇప్పడు మహువా మొయిత్రాకు ఒకటే దారి. ఆమె న్యాయపరంగా కోర్టుకెళ్లి తన సభ్యత్వాన్ని రద్దుచేయడం చట్టవిరుద్ధమని.. తాను తప్పుచేయలేదని నిరూపించుకోవాలి. మరో మూడు నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉండగా.. ఆమె ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News