Plant Disease:– ఈరోజుల్లో కేవలం మనుషులకు మాత్రమే కాదు.. చెట్లు, జంతువులకు కూడా హాని కలిగించేలాగా మారింది పర్యావరణం. వాతావరణ మార్పులు, కాలుష్యం, ప్లాస్టిక్, అంతుచిక్కని వ్యాధులు.. ఇలాంటివి ఎన్నో మనుషులతో పాటు మొక్కలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మొక్కల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవి అనారోగ్యం బారినపడక తప్పడం లేదు. అందుకే శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిలో మొక్కలకు నయం చేయడానికి ప్రయత్నించనున్నారు.
మొక్కలకు వచ్చే వ్యాధులు కేవలం మొక్కలపైనే కాదు మానవాళిపై కూడా ప్రభావం చూపిస్తాయి. మొక్కల వ్యాధులు అనేవి ప్రభుత్వానికి ఆర్థిక బారాన్ని తెచ్చిపెట్టడంతో పాటు దేశవ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. పంటలు ఆరోగ్యంగా ఉంటేనే అవి తినే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకే ముందుగా మొక్కలకు వచ్చే వ్యాధులను మెరుగ్గా కనిపెట్టగలిగితే.. దానికి పరిష్కారం కూడా అంతే మెరుగ్గా అందించవచ్చని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.
మొక్కలను వ్యాధుల బారినుండి కాపాడడానికి ఇప్పటివరకు రెండే మార్గాలు ఉండేవి. ఒకటి నిపుణులతో విత్తనాలను స్టడీ చేయించడం, ఇంకొకటి న్యూరల్ నెట్‌వర్క్స్‌తో, ఇమేజ్ ప్రాసెసింగ్‌తో సమస్య ఏంటో తెలుసుకోవడం. నిపుణులు విత్తనాలను స్టడీ చేసే పద్ధతి చాలా సమయాన్ని తీసుకుంటుంది దాంతో పాటు వచ్చే రిజల్ట్స్ కూడా పూర్తిగా నిజమా కాదా అని తెలుసుకునే అవకాశం ఉండదు. ఇమేజ్ ప్రాసెసింగ్‌లో కూడా రిజల్ట్స్‌ను పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. అందుకే ఈ రెండు పద్ధతులు కొంతవరకే మొక్కల సమస్యలు తెలుసుకోవడానికి ఉపయోగపడేవి.
అందుకే మొక్కల సమస్యలను కనిపెట్టడం కోసం శాస్త్రవేత్తలు తాజాగా ఎమ్మెస్‌యూఎన్ అనే కొత్త టెక్నిక్‌తో ముందుకొచ్చారు. ప్రకృతి సిద్ధంగా ఇది మొక్కల సమస్య గురించి బయటపెడుతుంది. ముందుగా ఎమ్మెస్‌యూఎన్ మొక్క ఏ జాతికి చెందింది అని కనిపెట్టి ఆ తర్వాత దాని సమస్యపై దృష్టిపెడుతుంది. అది ఏ వాతావరణంలో పెరిగింది అనే విషయాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే సమస్య గురించి నిర్ధారణకు వస్తుంది.