Big Stories

Ambedkar Jayanti 2024: మరణం లేని మహానేత.. అంబేద్కర్..!

Dr. B. R. Ambedkar Jayanti 2024: మన భారతీయ సమాజాన్ని అన్ని కోణాల్లో అత్యంత సమగ్రంగా, బహుముఖంగా సమీక్షించి, ప్రజాస్వామీకరించిన గొప్ప మేధావుల్లో డా. బీ.ఆర్. అంబేద్కర్ ముందువరుసలో నిలుస్తారు. సంఘ సంస్కర్తగా, మేధావిగా, విద్యావేత్తగా, రాజ్యాంగ రూపకర్తగా తన జీవితకాలంలో అనేక పాత్రలను ఆయన పోషించారు. ఆయన పూర్తి పేరు భీమ్‌‌రావ్‌ రాంజీ అంబేద్కర్‌.

- Advertisement -

14 ఏప్రిల్‌ 1891న మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌ ప్రాంతంలో ఉన్న ‘మౌ’ గ్రామంలో జన్మించారు. తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్‌ మిలిటరీ ఉద్యోగి. తల్లి భీమాబాయ్. వీరి స్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబావాడే గ్రామం. ఈ దంపతులకు కలిగిన 14 మంది సంతానంలో అంబేద్కర్ చివరివాడు.

- Advertisement -

పేరుకు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినా.. పెద్ద కుటుంబం కావటంతో అంబేద్కర్ బాల్యమంతా కడు దారిద్ర్యంలోనే గడిచింది. దీపం వెలుతురులో చదువుకున్నారు. 17 ఏళ్లకే రమాబాయితో వివాహం జరిగింది. బరోడా రాజు అందించిన 25 రూపాయల స్కాలర్‌షిప్‌తో పెళ్లి తర్వాత కూడా చదువుకొనసాగించి 1912లో బీఏ మొదటి ర్యాంకుతో పాసయ్యారు.

Also Read: డౌట్స్ అనంతం.. అభ్యర్థి ప్రసాదా? ప్రభాకర్ చౌదరా?

తర్వాత ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, బరోడా సంస్థానంలోనే రక్షణ శాఖలో కొలువు చేశాడు. ఆ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే తండ్రి కూడా కన్నుమూయటంతో కుటుంబ బాధ్యతలన్నీ అంబేద్కర్ భుజానే పడ్డాయి. అంత బాధల్లోనూ చదువుపై మమకారం చావని అంబేద్కర్.. బరోడా మహారాజును కలిసి సాయం కోరాడు. ‘ఖర్చునంతా నేనే భరిస్తాను గానీ.. చదువు పూర్తయ్యాక వచ్చి నా వద్ద పదేళ్లు ఉద్యోగం చేయాలి’ అనే మహారాజు షరతుకు సరేనని, అంబేద్కర్ న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో ఎంఎ పొలిటికల్ సైన్స్‌లో చేరారు.

అక్కడి నుంచే ‘ఇండియన్ నేషనల్ ఇన్‌కమ్.. హిస్టారిక్ ఎనాలసిస్’ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీని అందుకున్నారు. అనంతరం ‘ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’ అనే అంశంపై పరిశోధన చేసి 1923 లో డాక్టరేట్ పొందారు. తర్వాత లండన్ చేరి లా పూర్తిచేసి అదే ఏడాది బొంబాయి తిరిగొచ్చి లాయరుగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. స్వాతంత్ర్య ఉద్యమకారుల తరపున, అంటరానివారి తరపున, జమీందారీల రద్దు కోసం, భూ సంస్కరణలకు అనుకూలంగా పలు కేసులను వాదించి గెలిచి మంచి పేరు సంపాదించారు.

బ్రిటిషర్లు నడిపే కోర్టు్ల్లో వాదిస్తూ.. వారి పాలనలోని దమననీతిని ఎండగట్టారు. దళితలకు పాఠశాలలు, కాలేజీలు, లైబ్రరీలు స్థాపించటమే గాక వారికోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఉపాధి శిక్షణా కేంద్రాల ఏర్పాటులో చురుగ్గా పాల్గొన్నారు. 1920లో ‘అఖిల భారత నిమ్న జాతుల సభ’ను నిర్వహించారు. నాటి సభలో ఆయన ప్రసంగం విన్న కొల్హాపూర్ రాజు ‘నిమ్న జాతుల బానిస సంకెళ్లు బద్దలు కొట్టే అపూర్వ శక్తి’గా అంబేద్కర్‌ను అభివర్ణించారు.

Also Read: స్వ(వి)పక్షం.. వైసీపీలో రగులుతున్న మంటలు

లాయరుగా పనిచేసే రోజుల్లో.. మరోవైపు అంబేద్కర్ ట్యుటోరియల్‌లో బిజినెస్ పాఠాలను బోధించేవారు. సైమన్ కమిషన్ భారత పర్యటనకు వచ్చినప్పడు.. దళితుల 18 సమస్యలను కమిషన్ ముందుంచారు. భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ దళిత ప్రతినిధిగా పాల్గొన్నారు.

ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ప్రారంభించి, 1937 ఎన్నికలలో 17 స్థానాలకు గాను 15 స్థానాలను గెలుచుకున్నారు. 1947 నాటి నెహ్రూ జాతీయ ప్రభుత్వంలో లా మినిష్టర్‌గా పనిచేశారు. ఆ కాలంలోనే మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు పలు చట్టాలను రచించారు. రాజ్యాంగ సభ సభ్యుడిగా ఎన్నికై..1947 ఆగస్టు 27న రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్‌గా నేటి మన రాజ్యాంగ రచనను అతి తక్కువ సమయంలో పూర్తి చేశారు.

కానీ.. నాటి నెహ్రూ ప్రభుత్వం తెచ్చిన హిందూ కోడ్ బిల్‌ను పలువురు నేతలు అంగీకరించకపోవటంతో అసంతృప్తి చెంది న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 సెప్టెంబర్ 3న బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నట్టు ప్రకటించి, అక్టోబర్‌ 14( దసరా పండుగ నాడు) 6 లక్షల మంది అనుచరులతో అంబేద్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించారు.

Also Read: ఒకటి.. ఇద్దరికి హ్యాండే!

వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలను అనుభవిస్తూనే.. తన జీవితాంతం వెనకబడిన వర్గాల ఉన్నతికై విరామం లేకుండా పనిచేసిన ఆ దార్శనికుడు.. 1956 డిసెంబర్ 6 న తుదిశ్వాస విడిచారు. అంబేద్కర్ విశేష సేవలకు గుర్తుగా 1990లో ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని (మరణానంతరం) ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయనను మార్టిన్ లూథర్ కింగ్‌తో పోల్చారు. ఆ విగ్రహపు శిలాఫలకంపై రాసిన ‘A Symbol of knowledge‘ (అంబేద్కర్ ఒక విజ్ఞాన ప్రతీక) అని ముద్రించిన మాటలు అక్షర సత్యాలని కొనియాడారు.

డా. బీ.ఆర్. అంబేద్కర్ అస్తమించి.. 67 ఏళ్లైన తర్వాత కూడా ‘సమీకరించు.. బోధించు.. పోరాడు‘ అనే ఆయన నినాదం.. నేటికీ ఈ దేశంలో దగాపడిన ప్రతి మనిషి, వర్గం రెట్టించిన ఉత్సాహంతో పోరాడేందుకు అవసరమైన స్ఫూర్తిని ఇస్తూనే ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News