Big Stories

BIG Shock To Gorle Kiran Kumar: స్వ(వి)పక్షం.. వైసీపీలో రగులుతున్న మంటలు

BIG Shock To Gorle Kiran Kumar(Andhra Pradesh political news today) : మొన్నటివరకూ సీట్ వస్తుందో.. రాదో అనే టెన్షన్. సీట్‌ వచ్చాక సొంత పార్టీ నుంచే అసమ్మతి రాగం. ఒక చోట అయితే భరించవచ్చు. కానీ.. నియోజకవర్గంలోని నలువైపులా నుంచి మూకుమ్మడిగా దాడికి దిగితే పరిస్థితి ఏంటి? గెలుపు సంగతి దేవుడెరుగు. సొంత పార్టీ నుంచే తిరుగుబాటు ఏంటని తల పట్టుకుంటున్నారు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్నచోట ఇలాంటి పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఎవరా నేత.. అసమ్మతికి కారణాలేంటి? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వైసీపీలో అసమ్మతి నెలకొంది. MLA అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్‌కు సొంత పార్టీ నుంచే అసమ్మతి ఎదురుకావటంతో.. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందట. తాజా పరిస్థితులు ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట.

- Advertisement -

మొదటి నాలుగు జాబితాల వరకూ కిరణ్‌కుమార్‌కు అధిష్టానం టికెట్ ప్రకటించిలేదు. ఓ సందర్భంలో అసలు టికెట్ వస్తుందో.. రాదోనని.. కిరణ్‌ చాలా టెన్షన్ పడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుకి.. ఎచ్చెర్ల టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా నాలుగో జాబితా వరకూ కిరణ్‌కు అధిష్టానం టికెట్ కేటాయించలేదు. దీంతో ఈసారి అధిష్టానం తనకు హ్యాండ్‌ ఇచ్చే అవకాశం ఉందంటూ MLA… తన అనుచరుల దగ్గర గోడు వెల్లబోసుకున్నారనే వార్తలు వినిపించాయి. అధిష్టానం కూడా కిరణ్ స్థానంలో వేరే వారిని మారిస్తే బెటర్ అనే ఆలోచనకు వచ్చిందట. చివరకి నాలుగో జాబితా తరువాత ఎచ్చెర్ల టికెట్‌ను జగన్‌… కిరణ్‌కుమార్‌కు కేటాయించారు. అక్కడవరకూ బాగానే ఉన్నా…అసలు విషయం అక్కడ నుంచే ప్రారంభమైంది.

- Advertisement -

Also Read: బాబా.. బ్లాక్‌షీప్! పతంజలి వెనుక కథ!

అధిష్టానం టికెట్ కేటాయించిన సంతోషం.. ఎంతోకాలం నిలవలేని పరిస్థితి నెలకొందట. నియోజకవర్గంలో కిరణ్‌కు వ్యతిరేకంగా అనేక వర్గాలు ఏకమయ్యాయట. కిరణ్ వద్దు..జగన్ ముద్దు అంటూ అసమ్మతి నేతలు, కొందరు కార్యకర్తలు ఆందోళనలు కూడా చేశారు. కిరణ్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తానమని అసమ్మతి నేతలు బాహాటంగానే హెచ్చరించారు. దీంతో కిరణ్‌కుమార్‌ అయోమయ స్థితిలో పడ్డారట. అసలు.. కిరణ్‌పై అంతటి విమర్శలు రావడానికి కారణాలు లేకపోలేదని సొంతపార్టీ నేతలే చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో విజయం సాధించాక.. ఆయన బావమరిది పిన్నింటి సాయికి.. తన వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే బాధ్యతలను అప్పగించారట.అలా… సాయి నియోజకవర్గంలో పరపతి, పలుకుబడి పెంచుకోవటం సహా నియోజకవర్గంలోని MPTC, ZPTC, సర్పంచ్‌లతోపాటు గ్రామస్థాయిలోని కార్యకర్తలతో పరిచయాలు పెంచుకున్నారట. MLA కిరణ్ స్థానంలో.. తానే అన్నీ అనేట్లుగా వ్యవహరించారనే వార్తలు వినిపించాయి. ఒకదశలో.. సాయి అంటే షాడో MLA అనే పేరు కూడా తెచ్చుకున్నాడట. అక్కడ నుంచే కిరణ్‌కు ఎదురుదెబ్బ తగిలిందని స్థానిక నేతలు చెబుతున్నారు.

చివరకు కిరణ్‌… అధిష్టానం దృష్టిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేక పోయారనే వార్తలు వినిపించాయి. ఒక దశంలో 2024 ఎన్నికల్లో ఎచ్చెర్ల YCP అభ్యర్థిగా పిన్నింటి సాయి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగిందట. అదే సమయంలో సాయి.. తనకంటూ ఒక వర్గాన్ని తయారుచేసుకోవటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో కిరణ్‌ పడ్డారట. నియోజకవర్గంలో బలమైన నేతలను సాయి. తెరపైకి తేవటంతో వారంతా కిరణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళన చేశారు. దీంతో సాయి పంచాయితీ.. కిరణ్ దగ్గరకి చేరిందట. రంగంలోకి దిగిన కిరణ్‌ సతీమణి సోదరుడిని మందలించడంతో సాయి వెనక్కి తగ్గారట. తర్వాత కాలంలో బావకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడాన్ని సాయి మానేశారని తెలుస్తోంది. MLA కిరణ్ కుమార్ తన భార్య ద్వారా.. బావమరిది సాయిని దారికి తెచ్చుకోగలిగారు కానీ… ఎచ్చెర్ల నియోజకవర్గంలో మిగిలిన అసమ్మతి నాయకులని దారికి తీసుకురాలేకపోయారనే వాదన కూడా బలంగా ఉంది.

2019 ఎన్నికల్లో కిరణ్ విజయం సాధించేందుకు తాము అన్ని విధాలా సహకరించినా… తర్వాత కాలంలో తమను పట్టించుకోలేదనేది నియోజకవర్గంలోని నేతల మాటగా తెలుస్తోంది. అంతే కాకుండా..నాడు ఆయనకు సహకరించని వారిని ప్రోత్సహించటంతో ఈ కోసం మరింత పెరిగిందనే వార్తలు వినిపించాయి. దీంతో రోజురోజుకూ అసమ్మతి నేతల సంఖ్య పెరుగుతూ వచ్చిందని సొంతపార్టీ నేతలే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్‌ను ఓడిస్తామని బాహాటంగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొంతమంది అయితే కిరణ్ వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతామని ప్రెస్‌మీట్‌లు కూడా పెట్టి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎచ్చెర్లలో మరోనేత శంకరరావుపై.. MPP చిరంజీవులు వర్గం దాడికి దిగింది. ఈ ఘటనలో శంకరరావు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారట. శంకరరావుపై దాడి చేయించింది MLA కిరణ్‌ వర్గీయులేనంటూ శంకరరావు సతీమణితో పాటు కొందరు నేతలు ఆరోపించారు. ఇలా కిరణ్‌పై నియోజకవర్గంలో అసమ్మతి చాపకింద నీరులా తారాస్థాయికి చేరుకుందట.

Also Read: డేంజరస్ జాంబీ డ్రగ్! మన వరకు వస్తుందా?

ఇదిలా ఉంటే…అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు MLA కిరణ్ ప్రయత్నం చేయకుండా సమస్యను పీకల వరకూ తెచ్చుకున్నారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన అధిష్టానం.. ఎచ్చెర్ల నియోజకవర్గ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు పార్టీ అగ్రనేతలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ కోఆర్డినేటర్ చిన్న శ్రీను రంగంలోకి దిగి.. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలో కిరణ్ వ్యతిరేక వర్గమైన ఎచ్చెర్ల మండల నేత శంకరరావుని దారిలోకి తెచ్చినట్లు తెలుస్తుంది. కానీ… లావేరు, రణస్థలం మండలాల నేతల కిరణ్‌కుమార్ విషయంలో మాత్రం ససేమిరా అంటున్నారట. బొత్సతో పాటు చిన్న శ్రీనుచెప్పినా తగ్గేది లేదని భీష్మించుకున్నారట. ఐదేళ్లు తమను పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టిన కిరణ్‌ను.. ఈసారి ఎన్నికల్లో ఓడించి తీరుతామని తేల్చి చెప్పారట.

మొన్నటి వరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని టీడీపీ అసమ్మతి.. తనకు అనుకూలంగా మారుతుందని భావించిన కిరణ్ ఆనందం… ఎంతోసేపు నిలవలేదని సొంత పార్టీ వాళ్లే పెదవి విరుస్తున్నారు. ఓ వైపు కళావెంకట్రావుకి… మరోవైపు… కలిశెట్టి అప్పలనాయుడు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేది. కళాకు టికెట్ ఇస్తే కలిశెట్టి ఎంతవరకూ సహకరిస్తారనే అయోమయం ఎచ్చెర్ల TDP వర్గాల్లో ఉండేదట. మరోవైపు… ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్… పొత్తులో భాగంగా BJPకి కేటాయించటంతో అక్కడ TDPలో వర్గపోరుకి శుభం కార్డు పడింది. ఇరువర్గాల నేతలూ.. NDA అభ్యర్థి నరసింగరావుకి సహకరించేందుకు సిద్ధమయ్యారు. తాజా పరిణామాలతో వైసీపీ ఎచ్చెర్ల అభ్యర్థి కిరణ్ నోట్లో వెలక్కాయ పడినట్లు అయిందని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజవర్గంలో TDP బలంగానే ఉంది. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎచ్చెర్ల వైసీపీలో అసమ్మతితో కిరణ్ కష్టాలు తప్పవని సొంత పార్టీ నేతలో చర్చించుకుంటున్నారట. ఇలాంటి సమయంలో కిరణ్… తన ముందు ఉన్న గడ్డు పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News