Big Stories

Russia-Ukraine War: ఈ మారణహోమం ఆగేదెప్పుడో..! నేటితో ఉక్రెయిన్ వార్ మొదలై రెండేళ్లు..

Russia-Ukraine War
Russia-Ukraine War

Two years For Russia-Ukraine War: ధిక్కార స్వరాన్ని వినిపించిన చిట్టెలుక ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగిన రష్యా దాష్టాకానికి రెండేళ్లు నిండాయి. నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరాలని నిర్ణయించుకోవటంతో ఈ మొత్తం వివాదం మొదలైంది. ఆ దేశాన్ని తమ కూటమిలో చేర్చుకోకుండా నిషేధించాలని రష్యా అధినేత పుతిన్ 2021 డిసెంబరు 17న నాటోను బెదరించారు. కానీ.. ఉక్రెయిన్ అధినేత జెలెనెస్కీ దానిని ధిక్కరించారు. దీంతో 2022 జనవరి 17న ఉక్రెయిన్ పొరుగును ఉన్న తన మిత్రదేశమైన బెలారస్‌తో కలసి రష్యా 6 వేలమంది సైనికులు, 60 జెట్ విమానాలతో భారీ సైనిక విన్యాసాలకు దిగటం, అటు నాటో కూటమి రష్యా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ తన దళాలను సిద్ధం చేయటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఉక్రెయిన్ బోర్డర్‌లోని, 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియా వద్ద ఫిబ్రవరి 10న రష్యా మిలిటరీ విన్యాసాలు మొదలై 10 రోజుల పాటు సాగాయి.

- Advertisement -

దీంతో తమ దేశంలోని అంతర్భాగాలుగా ఉంటూ, రష్యా మద్దతుతో స్వాతంత్య్రం ప్రకటించుకున్న తూర్పు ప్రాంతాల తిరుగుబాటు సంస్థల మీద ఫిబ్రవరి 17న ఉక్రెయిన్‌ మిలిటరీ విరుచుకుపడింది. సరిగ్గా 4 రోజుల తర్వాత (ఫిబ్రవరి 21) ఉక్రెయిన్‌లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్న డాటెస్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా రష్యా అధినేత పుతిన్ ప్రకటించటంతో బాటు ఉక్రెయిన్ మీద సైనిక చర్యకు ఆదేశాలిచ్చారు. దీంతో ఫిబ్రవరి 24న దాడులు మొదలయ్యాయి. ఈ దాడులను ముందుగా గమనించిన అమెరికా.. రష్యా దుర్మార్గాన్ని ప్రపంచానికి బహిరంగపరచింది. దాడులను ఆపకపోతే.. ఆర్థిక ఆంక్షలు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరిను రష్యా పెడచెవిన పెట్టింది. ఇలా రెండేళ్ల నాడు ఈ యుద్ధం మొదలైంది.

- Advertisement -

మొత్తంగా చూసినప్పుడు ఈ రెండేళ్లలో ఉక్రెయిన్ మీద రష్యా పై చేయి సాధించింది. పలు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలిచి, ఆయుధాలు ఇచ్చినా ఆ వ్యూహం పెద్దగా ఫలితాలు ఇవ్వలేకపోయింది. ఇరువైపులా లక్షల్లో ప్రాణనష్టం జరిగినా.. వాటికి ఎలాంటి ఆధారాలూ బయటపడకుండా రెండు పక్షాలూ జాగ్రత్త పడ్డాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా మీద ప్రకటించిన ఆంక్షలు ఆ దేశాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. అంతర్జాతీయంగా రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ దేశాన్ని అభద్రతా భావంలోకి నెట్టాలని ప్రచారం మొదలు పెట్టిన ఆ దేశాలకు రష్యా కూడా అదే రీతిలో జవాబిచ్చింది.

Read More: Houthi missile attack on US: అమెరికా చమురు నౌకపై హౌతీల క్షిపణి దాడి

దీంతో ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన పశ్చిమ దేశాల్లోని ప్రజల్లో.. ‘ ఈ దారిన పోయే దరిద్రాన్ని మనమెందుకు తలకు రుద్దుకోవాలి’ అనే చర్చ ఆరంభమైంది. ఈ చర్చ వేడి పెరగటంతో ఇది తమ పదవులకు ఎసరు పెడుతుందేమోమోననే భయం ఆ దేశాల పాలకుల్లో మొదలై, ఒక్కొక్కరూ నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్నారు. అటు అమెరికా, రష్యా ఎన్నికల్లోనూ ఇది ఒక ప్రధాన అంశమై కూర్చోవటంతో ఈ పీటముడిని నేర్పుగా విప్పుకుని, జనంలో కనిపిస్తు్న్న అసంతృప్తిని చల్లార్చి, ఎన్నికల్లో విజయం సాధించాలని ఈ అగ్రదేశాల పాలకులు ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష్య ఎన్నికలు ముంగిట్లో ఉన్న అమెరికా.. తన నాయకత్వంలోని నాటో కూటమికి ఆయుధసాయమే తప్ప నేరుగా తన సేనలను యుద్ధంలోకి దించే పరిస్థితి కనిపించటం లేదు.

ఇక ప్రస్తుత యుద్ధ పరిస్థితులను గమనిస్తే.. తూర్పు ఉక్రెయిన్‌లోని అడీవికా ప్రాంతం రష్యా చేతిలోకి వచ్చింది. వెంటనే ఉక్రెయిన్‌కు మద్దతుగా డెన్మార్క్ ‘ మా వద్ద ఉన్న శతఘ్నలన్నీ మీకు ఇచ్చేస్తాం’ అని ప్రకటించినా ‘ మీరు ఇచ్చినా.. మేం వాటిని వాడే శక్తి లేదు’ అని ఉక్రెయిన్ తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. 2023 మే నెల తర్వాత రష్యా యుద్ధంలో సాధించిన అతి పెద్ద విజయమిది. అయితే.. ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు తానే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశానని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించుకుంది. గత నాలుగైదు రోజులుగా రష్యా రెట్టించిన ఉత్సాహంతో దాడులకు దిగింది.

యుద్ధం మీద ఆయా దేశాల స్పందనలు విచిత్రంగా ఉన్నాయి. ‘యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మమ్మల్ని అడగొద్దని తాజాగా జెలెన్ స్కీ మీడియాతో వ్యాఖ్యానించారు. మరోవైపు చైనా ఈ సంక్షోభంలో తటస్థంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే.. దీనికి భిన్నంగా ‘అన్ని స్థాయిల్లో చైనాతో మా సంబంధాలు కొనసాగుతున్నాయి’ అని ఉక్రెయిన్‌ ప్రకటించటం చైనాకు కాస్త తలనొప్పిగా మారింది. ‘ఐరోపాకు రాబోయే తరం వరకు వదలని పెద్ద ముప్పు.. రష్యా’ అంటూ బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేత డేవిడ్‌ లామీ విసుక్కున్నాడు. ఉక్రెయిన్‌ జీవన్మరణ స్థితిలో ఉందని, దాని భవిష్యత్తు తమ చేతిలోనే ఉందని పుతిన్ అంటున్నాడు.

Read More: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు..

దాష్టాకానికి గురైన ఉక్రెయిన్‌కు తాము మద్దతునిస్తున్నా.. ఆ దేశంతో తమకు ఆహార ధాన్యాలు, ట్రక్కుల రవాణా సమస్యలు ఉన్నట్లు పోలాండ్‌ మంత్రి సికోరిస్కీ సన్నాయి నొక్కులు నొక్కాడు. ఉక్రెయిన్‌ భద్రంగా ఉండాలంటే.. ఐరోపా యూనియన్‌ సభ్యత్వమే మార్గమని ఆ సంస్థ ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ చెప్పుకొచ్చాడు. మరో ఏడాదిన్నర పాటు ఉక్రెయిన్‌ పౌరులకు వీసాలను పొడిగిస్తున్నట్లు బ్రిటన్‌ తెలిపింది. ఇలాంటి పొడి పొడి స్పందనలను బట్టి పశ్చిమ దేశాలేవీ ఉక్రెయిన్‌ను కాపాడేందుకు గానీ, ఈ సమస్యకు పరిష్కారం సూచించగల కెపాసిటీ, పలుకుబడి ఆ దేశాలకు లేదని తెలుస్తోంది.

రెండేళ్లు సర్వశక్తులూ కూడగట్టి ఆయుధ, ఆర్థిక, మానవతా సాయాలను అందించటంతో బాటు అంతర్జాతీయంగా రష్యామీద మాటల యుద్ధం చేసిన దేశాలు ఇప్పుడు ఆయాసపడటాన్ని రష్యా కొంటెగా గమనిస్తోంది. అయితే.. అదే సమయంలో నాటో కూటమి మాత్రం ఇంకా ఐక్యంగానే ఉంది. ఫిన్లాండ్‌ కొత్తగా ఈ కూటమిలో చేరగా, డెన్మార్క్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. బాల్టిక్‌ దేశాలు (ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా) ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తుండగా, నాటోలోని హంగరీ, స్లోవేకియా మాత్రం ‘ఆ.. ఎంత చేసినా రష్యాను ఆపటం మన వల్ల కాదు’ అనే ధోరణిలో ఉన్నాయి. 2023 ఎన్నికల్లో స్లొవేకియాలో రష్యాకు అనుకూలంగా ఉండాలని నినదించిన స్లోవాక్‌ సోషల్‌ డెమోక్రసీ పార్టీ 22.9శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. అలాగే.. నెదర్లాండ్‌లో ‘జెలెనెస్కీకి మిలిటరీ సాయం తగ్గించాలి’ అని ప్రచారం చేసిన ఫ్రీడమ్‌ పార్టీ నెదర్లాండ్స్‌లో గెలిచింది.

ఉక్రెయిన్‌కు 54 బిలియన్‌ డాలర్ల అదనపు సాయం అందించాలన్న నాటో ప్రతిపాదనకు హంగరీ అభ్యంతరం తెలిపింది. మొత్తంగా.. ఈ నాటో దేశాలన్నీ.. ఉక్రెయిన్ సేనలకు తాము పంపిన ఆయుధాల శిక్షణనివ్వటానికి పరిమితం అవుతూనే.. ప్రపంచ వేదికల మీద పెద్దగొంతుతో రష్యా ఒంటెత్తుపోకడను నిరసిస్తున్నాయి గానీ, ‘ అనవసరంగా రెచ్చిపోయి ఈ రొంపిలో దిగాం.. ఎలా బయట పడాలో ఏమో’ అని ఆ దేశాలు లోలోన మథనపడుతున్నాయి. ‘ప్రిస్టేజ్‌కి పోతే రష్యా చేతిలో ఓటమి తప్పదు.. వెనక్కి తగ్గి రష్యాతో ఒప్పందం కుదుర్చుకుందామంటే ఆ దేశం ఓకే చెప్పేలా లేదు’ అనే భయమూ వాటిని వేధిస్తోంది.

అటు.. అమెరికాలోనూ ఇది అధ్యక్ష ఎన్నికల ప్రధానాంశంగా మారుతోంది. ‘ప్రపంచంలో ఎవడెవడో తన్నుకు చస్తుంటే.. మనం ఎందుకు సైనికులను పంపాలి? ఆ ఖర్చంతా మనమెందుకు భరించాలి? అమెరికా తన సమస్యలను పరిష్కరించుకోవటానికే పరిమితం కావాలి’ అని గొంతు చించుకున్న ట్రంప్
ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటున్నాడు. ఈ అంశంలో బైడెన్‌ మాత్రం ‘ పెద్దన్న దేశంగా మనం మరీ మడికట్టుకుని చూస్తూ ఊరుకోకూడదు’ అన్నట్లు మాట్లాడుతున్నాడు. మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక.. చైనా తటస్థంగా ఉన్నా అది రష్యాకు దగ్గరైంది. రష్యా నుంచి తన దిగుమతులనూ బాగా పెంచుకుంటూ వస్తోంది. దీంతో కోల్డ్ వార్ సమయంలో మాదిరిగా రష్యా, చైనాల మధ్య విభేదాలను వినియోగించుకునే అవకాశమూ అమెరికాకు లేకుండా పోయింది.

Read More: ఎట్టకేలకు నావల్ని మృతదేహం కుటుంబానికి అప్పగింత..

అయతే.. ఈ యుద్ధానికి ఒక కొరియా యుద్ధ విరమణ నమూనాలో ఒక ముగింపునివ్వవచ్చని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. 1950వ దశకంలో ఉత్తర, దక్షిణ కొరియాలు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుని, రెండు దేశాలుగా విడిపోయాయి. ఆ సమయంలో దక్షిణ కొరియా రక్షణకు నాటో కూటమి హామీ ఇచ్చింది. అయితే.. ఆ రోజు నుంచి నేటివరకు ఉభయ కొరియాల మధ్య ఏ అధికారిక యుద్ధ విరమణ ఒప్పందం లేదు. అయితే.. ఇది ఆచరణ సాధ్యం కాదని, దక్షిణ కొరియాకు నాటో అభయం ఇచ్చినట్లుగా ఉక్రెయిన్‌కూ ఇచ్చేందుకు నాటో ముందుకొస్తే.. అందుకు రష్యా ఒప్పుకోదని, కనుక కొరియా నమూనా ఇక్కడ వర్కవుట్ కాదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. ఈ వివాదంలో ఎవరూ గెలించిదీ లేదు. అలాగే పూర్తిగా ఓడిందీ లేదు. కానీ..చిన్న దేశమైన ఉక్రెయిన్‌కు ఇది పూడ్చుకోలేని నష్టంగా మారుతోంది. రానున్న రోజుల్లో రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ఎన్నికలు రానుండటంతో కొత్తగా సైనికుల భర్తీ జరిగే పరిస్థితి లేదు. అటు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న చిన్నచిన్న పశ్చిమ దేశాల్లోనూ ప్రభుత్వాల మీద వ్యతిరేకత పెరుగుతూ పోతోంది. ఈ దేశాలేవీ ఊహించని రీతిలో పుతిన్.. ఇరాన్, ఉత్తర కొరియా నుంచి యుద్ధ సామాగ్రిని సాయంగా పొందగలగటం వాటికి ఊహించని పరిణామంగా మారింది. ‘తక్షణం బేషరతుగా లొంగిపోతే క్షమిస్తా’ అంటూ ఉక్రెయిన్‌కు పుతిన్ సూచిస్తున్నాడు. కానీ.. పదేళ్ల నాడు మీరు ఆక్రమించిన క్రిమియాతో సహా అన్ని ప్రాంతాలనూ తిరిగిస్తేనే తప్ప రాజీ మాటే లేదని ఉక్రెయిన్ భీష్మించుకుని కూర్చోవటం, మరోవైపు నవంబరులో అమెరికాలో ఎన్నికలు వంటి పలు కారణాలతో ఈ యుద్ధం కొత్త ఏడాది వస్తే తప్ప ఆగేలా కనిపించటం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News