Big Stories

Modi successor in BJP Politics: బిజేపీలో మోదీ వారసుడెవరు..? 2024 ఎన్నికల తరువాత బిజేపీ 3.0 ఎలా ఉండబోతోంది..?

- Advertisement -

Modi Successor in BJP Politics: ఇండియాలో గత దశాబ్దకాలంగా భారతీయ జనత పార్టీ హవా కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే.. బిజేపీ జోరు పెరుగుతూనే పోతోంది. 2024 ఎన్నికల్లో కూడా బిజేపీని ఢీ కొని విజయం సాధించగలిగే పార్టీ ఇదే అని చెప్పలేని పరిస్థితి. బిజేపీ ఒకవేళ 2024 ఎన్నికలు గెలిస్తే.. మోదీ చివరిసారి ప్రధాని అవుతారని చర్చ జరుగుతోంది. ఈ చర్చలోనే మోదీ తరువాత బిజేపీని నడిపించే నాయకుడెవరు ? మోదీ పాలిటిక్స్‌కు వారసుడెవరు? అనేది ఇప్పుడొక మిలియన్ డాలర్ ప్రశ్న? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందు బిజేపీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

- Advertisement -

మనదేశంలో ఎన్నికలంటే.. ఒక విధంగా రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు పరీక్షలు లాంటివి. ఈ పరీక్షలు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అంశం ఒక్కో సమస్య ప్రాధాన్యంగా జరుగుతాయి. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లు అన్ని అంశాలపై పోరాడాల్సిన అవసరం ఉండదు. కేవలం ఆ సమయానికి ఆ ప్రత్యేక అంశాన్ని పరిష్కరిస్తామని ప్రజలను నమ్మించగలిగితే చాలు. ఇలా చేయగలిగిన నాయకుడికి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ.

ఈ విధానాన్ని గట్టిగా నమ్మిన పార్టీ.. భారతీయ జనతా పార్టీ. అందుకే 1980లో పుట్టిన ఈ పార్టీ దేశంలో అత్యంత పురాతన పార్టీ అయిన కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలను ఇవాళ్ల మట్టికరిపిస్తోంది. బిజేపీ ఆవిర్భవించినప్పుడు దీని గురించి ఒక పత్రికలో ఒక హెడ్‌లైన్ వచ్చింది. ‘Vegetarian But Tasty Party’ అని. కానీ అప్పటి బిజేపీకి ఇప్పుడున్న నయా బిజేపీకి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. అప్పట్లో బిజేపీ అంటే అగ్రకులాల పార్టీ అని అందరూ భావించారు.

అలా 1996లో బిజేపీ అభ్యర్థి అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి మొట్టమొదటిసారి భారత ప్రధాన మంత్రి అయ్యారు. భారత రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్‌పేయికి చాలా గౌరవం ఉంది. ఆయన రాజకీయ శత్రువులు కూడా ఆయనపై నమ్మకం చూపించేవారు.

నైతిక విలువలకు అత్యధిక importance ఇచ్చే వాజ్ పేయి ఆ విలువల కోసం ప్రధాని పదవిని వదులుకున్నారు. ఆయన 1998లో.. అలాగే 1999లో ప్రధానిగా ఎన్నికయ్యారు. RSS, హిందుత్వ భావజాలం ఉన్న నాయకుడే అయినా వాజ్ పేయి మాత్రం ఎప్పుడూ మానవతా విలువలను పక్కన బెట్టలేదు. బిజేపీ నాయకులలో వాజ్ పేయి సమకాలీనులైన.. లాల్ కృష్ణ అడ్వాణీ, మురళి మనోహర్ జోషి లాంటి వారు హిందుత్వ రాజకీయాలు చేసినా వాజో పేయి అందుకు దూరంగానే ఉండేవారు. ఆయన గురించి ఆయన ప్రత్యర్థులు ఎప్పుడూ ఒక మాట అనే వారు ‘Right Man in the Wrong Party’ అని.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాజ్ పేయి.. ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేస్తే.. వాటిని ప్రశంసించేవారు. ఇలా చేసే ప్రతిపక్ష నేతలు నేటి రాజకీయాలలో ఎంత వెతికినా మనకు కనపడరు.

కానీ కాల క్రమంలో బిజేపీ సిద్ధాంతాలు మారిపోయాయి. అప్పట్లో నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు బిజేపీ అగ్రనేతలు. కానీ ఇప్పుడు గెలుపే పరమావధిగా దూసుకుపోతోంది నయా బిజేపీ. ఉదాహరణకు 1999లో వాజ్ పేయి ప్రధానమంత్రిగా 13 నెలల పాటు ప్రభుత్వం నడిపారు. కానీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆయన కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయారు. ప్రధాన మంత్రి పదవి కాపాడుకోవడాని కోసం ఆయన ఎదుటి పార్టీ ఎంపీలకు తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించలేదు. ఆయన తలచుకొని ఉంటే ఆ ఒక్క సీటు కోసం ప్రతిపక్ష నేతలను డబ్బులతో కొనేసి.. తన ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగేవారు. కానీ అది అనైతికం.. అందుకే ఆయన తన పదవిని వదులుకున్నారు. అలాంటి నాయకులు ఇప్పుడు ఏ పార్టీలో కూడా మనకు కనిపించరు.

నిజం చెప్పాలంటే బిజేపీ గతంలో కంటే బలహీనపడింది. ఇదేంటీ? అని ఆశ్చర్యపోతున్నారా?. అవును ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఇదే నిజం. బిజేపీ దేశ రాజకీయాల్లో బలపడినా.. నైతికంగా బలహీనపడిందనే చెప్పాలి. ఈ పతనం 2002 గుజరాత్ గోధ్రా హింసాకాండతో మొదలైంది. ఈ కారణంగానే వాజ్ పేయి 2004లో ఎన్నికలు ఓడిపోయారు.

కానీ దశాబ్దకాలం తరువాత బిజేపీ మళ్లీ పుంజుకుంది. దీనికి కారణం ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రాండ్ ఇమేజ్. మోదీ బ్రాండ్.. బిజేపీ బ్రాండ్ కంటే చాలా రెట్లు పెద్దది. మోదీ ఒక అసాధారణ లీడర్. భారత దేశంలో కనివినీ ఎరుగని దూకుడు రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు.

గత సంవత్సరం ‘The Architect of New BJP’- How Narendra Modi transformed the Party అనే పుస్తకం రిలీజ్ అయింది. దీని రచయిత అజయ్ సింగ్. అందులో మోదీ ఒక సాధారణ బిజేపీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి.. ఎలా దేశ ప్రధాని అయ్యారో వివరంగా ఉంది. ఆయన ప్రధాన మంత్రి కావడంతో భారతీయ జనతా పార్టీకి రాజయోగం పట్టుకుంది. పార్టీ దశ దిశనే ఆయన మార్చేశారు.

వరుసగా రెండుసార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికైనా.. మోదీపై ముస్లింల వ్యతిరేకి.. పక్కా హిందుత్వ వాది అని ముద్రపడింది. ఆయన ఆ విమర్శలను పట్టించుకోలేదు. నోట్ల రద్దు, జీఎస్‌టీ, పాకిస్తాన్‌పై SURGICAL STRIKE, కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, తక్షన ట్రిపుల్ తలాక్ రద్దు, CAA, NRC, కొత్త వ్యవసాయ చట్టాలు, లాంటి దూకుడు నిర్ణయాలు తీసుకున్నారు.

Read More: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు.. నెలరోజుల్లో కోట్ల విరాళాలు

ఇందులో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు 2024 లోక్ సభ ఎన్నికల ముందు కొత్త పార్లమెంటు భవనం, అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో మోదీనే Front face. అందుకే అంటారు Publicityకి మారుపేరు మోదీ అని. 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా మోదీ నాయకత్వంలోని బిజేపీనే గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కానీ ప్రధానిగా మోదీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడంలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను విమర్శించే మీడియాకు, జర్నలిస్టులకు మోదీ ఇంటర్‌వ్యూలు ఇవ్వరు. జాతీయ మీడియాలో బిజేపీకి వ్యతిరేక వార్తలు అస్సలు కనపడవు. ప్రజా సమస్యలపై పెద్దగా చర్చ ఉండదు.

మరోవైపు అటల్ బిహారి వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలోని NDA ప్రభుత్వంపై భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్, RSS అనుబంధ సంస్థలు సైతం విమర్శలు చేసేవి. కానీ ఇలాంటి విమర్శలు మోదీ హయాంలో కనపడవు. మోదీ పాలన అంటే హిందుత్వ మత రాజకీయాలు. బిజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్నా రాష్ట్రాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని.. ఆ ప్రభుత్వాలను కూలగొట్టడం మోదీ చేస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి.

నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చి కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయిన వాజ్ పేయి నాయకత్వంలోని బిజేపీతో పోల్చితే.. మోదీ నాయకత్వంలోని బిజేపీ నైతికంగా పతనమైంది. దీనంతటికీ కారణం బిజేపీలో ఎన్నడూ లేనివిధంగా వ్యక్తి పూజ జరగడం. ఈ విధానం వాజ్ పేయి, ఎల్ కె అడ్వాణీ సమయంలో లేదు. అప్పుడు వ్యక్తి కంటే పార్టీకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇదే RSS విధానం కూడా.

కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. బిజేపీలో నరేంద్ర మోదీ నెంబర్ వన్. ఆయన పేరుతోనే అన్నీ చెల్లుబాటు అవుతున్నాయి. ఈ విధంగానే బిజేపీ ఎన్నికల్లో దూసుకుపోతోందని రాజకీయ పండితులు చెబుతున్నారు.

ఇప్పుడు 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా బిజేపీ విజయం ఖాయమని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం మోదీ మరోసారి గెలిస్తే.. దేశంలో అసలు ఎన్నికలే ఉండవని.. ప్రజాస్వామ్యం అంతమవుతుందని ప్రచారం చేస్తున్నాయి.

ఒకవేళ 2024 ఎన్నికల్లో బిజేపీ మళ్లీ గెలిస్తే.. మోదీ మూడో సారి ప్రధాని కావడం ఖాయమని చెప్పొచ్చు. కానీ బిజేపీ రూల్స్ ప్రకారం.. 75 సంవత్సరాల వయసు దాటిన వారు రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే.. మోదీకి ఇవే చివరి ఎన్నికలు.

అందుకే మోదీ తరువాత బిజేపీని ముందుకు నడిపించే జాతీయ నాయకుడు ఎవరు? రాజకీయాలలో మోదీ వారుసడెవరు? అనే అంశంపై బిజేపీలో తప్పకుండా అంతర్గత ఫైట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ అంశంపై ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. మోదీ మూడోసారి ప్రధాన మంత్రి కచ్చితంగా అవుతారని.. అయితే ఆయన తరువాత బిజేపీని నడిపించే నాయకుడు తప్పకుండా ఒక హిందుత్వ అతివాది మాత్రమే ఉంటారని అభిప్రాయపడ్డారు.

ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యాలను గమనిస్తే.. ఒక విధంగా నిజమనే అనిపిస్తోంది. వాజ్ పేయి కూడా హిందుత్వవాది అయినా.. ఆయన ఉదారస్వభావం కలవాడు. కానీ మోదీ అలాంటి ఉదారస్వభావి కాదు.. తీవ్ర హిందుత్వవాది. అందుకే దేశంలోని హిందువులంతా మోదీనే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ క్రమంలో ఆయన లాంటి నాయకుడు.. లేదా ఆయనకంటే ఎక్కువ హిందుత్వ భావాలు కలవాడే మోదీకి రాజకీయ వారసుడు.

అందుకే మోదీ వారుసుడెవరనే చర్చ బిజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనికి సమాధానంగా ఇద్దరు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు మోదీ సేనాపతిగా పిలవబడే అమిత్ షా అయితే.. మరొకరు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.


అమిత్ షా

ముందుగా అమిత్ షా గురించి మాట్లాడుదాం. అమిత్ షా ఒక రాజకీయ నిపుణుడు అనే చెప్పాలి. మోదీ వెనుక ఉండి నడిపించే శక్తి ఆయన. అమిత్ షాకు చదరంగం ఆట అంటే ఇష్టం.. అందుకే తన రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. పార్టీకి మంచి విజయాలు సాధించి పెడుతుంటారు. పార్టీ కోసం ఎంతో కష్టపడతారని ఆయనకు పేరుంది. దీనికి సంబంధించిన ఒక ఘటన గురించి ‘Amit Shah and the March of BJP’ అనే పుస్తకంలో ఉంది.

ఈ ఘటన గురించి పుస్తక రచయిత అనిర్బాన్ గాంగూలీ ప్రస్తావిస్తూ.. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ఉత్తర్ ప్రదేశ్‌లోని జగదీశ్ పుర గ్రామంలో బిజేపీ కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఇది ఒక అత్యవసర మీటింగ్. సాయంత్రం 4 గంటలకు సమావేశాన్ని గ్రామంలోని ఒక ఫ్యాక్టరీలో బిజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో అమిత్ షా ప్రారంభించారు. సమావేశం.. మరుసటి రోజు ఉదయం 2 గంటల వరకు జరిగింది. అమిత్ షా అక్కడ రాత్రి గడిపేందుకు ఎటువంటి సౌకర్యం లేదు. దీంతో ఆయన ఫ్యాక్టరీలో ఒక మూలన పడుకున్నారు. ఇది చూసి కార్యకర్తలంతా ఆశ్చర్యపోయారు. బిజేపీ లాంటి పెద్ద పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక ఫ్యాక్టరీలో నేలపై నిద్రపోవడం చూసి పార్టీ నాయకులు కూడా మారు మాట్లాడకుండా అక్కడే కింద పడుకున్నారు.

2019 ఎన్నికలు గెలిచిన తరువాత బిజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం ఏర్పడింది. నరేంద్ర మోదీని పార్టీ ఆఫీసులో అమిత్ షా గ్రాండ్ Welcome చెప్పారు. ఆ తరువాతే బిజేపీలో పెద్ద మార్పు జరిగింది. అమిత్ షాని ఏకంగా కేంద్ర హోం మంత్రి పదవి ఇచ్చారు నరేంద్ర మోదీ. దీని వెనుక పెద్ద మతలబే ఉంది. అమిత్ షాని హోం మంత్రి చేయడమంటే.. RSS ఎజెండాని బిజేపీ మేనిఫెస్టోగా అమలు చేయడమే. ఈ క్రమంలోనే భారతదేశ చట్టాలలో అమిత్ షా పలు కీలక మార్పులు చేయగలిగారు.

ఉదాహరణకు కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, పొరుగు దేశాలలు ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి చొరబాటదారులను అడ్డుకోవడం. అందుకోసం NRC అంటే National Register of Citizens రూపొందించడం, అలాగే పొరుగుదేశాలలో వేధింపులకు గురవుతున్న హిందువులకు భారత పౌరసత్వం కల్పించడం వంటి చట్టాలు. వీటిలో మొదటి రెండు చట్టాలను అమిత్ షా అమలు చేసి చూపించారు. త్వరలోనే మిగతా రెండు చట్టాలను కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే NRC CAA చట్టాలపై దేశమంతా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా ముస్లింలకు భారత పౌరసత్వం లేకుండా చేసేందుకే ఈ చట్టం తీసుకొచ్చారని బిజేపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ CAA చట్టం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో మత అల్లర్లు చెలరేగి వందల సంఖ్యలో అమాయక పౌరులు చనిపోయారు. ఈ కారణంగా మోదీ, అమిత్ షా మధ్య విభేదాలు వచ్చాయని కూడా ప్రచారం జరిగింది.

అలాగే కొవిడ్ లాక్ డౌన్ సమయంలో వలస కూలీల కష్టాలను పరిష్కరించడంలో అమిత్ షా విఫలమయ్యారని అపవాదలు కూడా ఉన్నాయి. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం లాక్ డౌన్ విధించే ముందు దేశ ప్రజలకు కేవలం 4 గంటల గడువు ఇచ్చారు.. దీనివల్ల ప్రజలు సరైన జీవన సదుపాయం లేక తల్లడిల్లారు.

ఇక అమిత్ షా గురించి చివరగా చెప్పాలంటే ఆయన, మోదీ ఇద్దరూ ప్రజలను మాటలతో గారడి చేస్తారు. ఒకవైపు మోదీ విజనరీ నేత అని బిజేపీ ప్రచారం చేస్తే.. మరోవైపు అమిత్ షా హిందుత్వ అతివాది అని ప్రచారం చేస్తారు. సరే ఎవరేమనుకున్నా.. అమిత్ షా ఒక Dedicated politician అని చెప్పడంలో ఏ సందేహం లేదు. అందుకే మోదీ తరువాత ఆయన వారసుడిగా బిజేపీ తరపున ప్రధాన మంత్రి అవకాశాలు అమిత్ షాకు ఉన్నాయి.

అయితే అమిత్ షా ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్.

యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడూ ఒక సాధువు వేషంలో కనిపించే బలమైన హిందుత్వ వాది. పైగా ఆయన పెళ్లి చేసుకోలేదు. సంసారిక సుఖాలను త్యాగం చేసి.. రాజకీయలకే జీవితాన్ని అంకితం చేశారు. కుటుంబంతో తన సంబంధాలను తెంచుకున్నారు. అందుకే కరోనా సమయంలో ఆయన తండ్రి చనిపోతే.. అంతక్రియలకు యోగి ఆదిత్యనాథ్ వెళ్లలేదు.

యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలలో ఒక రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అయిదేళ్ల పదవికాలం పూర్తి చేసి.. వరుసగా మరోసారి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ ఒకరే ఈ అరుదైన రికార్డు సాధించారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టినా కూడా ఆయన ఒక సాధువుగా, ఒక సన్యాసిగా తనను ప్రజలకు పరిచయం చేసుకుంటారు. తాను హిందుత్వ వాది అని ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించారు. నెలలో రెండుసార్లు గోరక్ నాథ్ మఠం వెళ్లి అక్కడ మత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన పరిపాలనపై కూడా హిందుత్వ ప్రభావం ఉంటుంది. యోగి ప్రభుత్వంలో యాంటి రోమియా స్క్వాడ్ ఉంది. ఎవరైనా పెళ్లి కాని యువతీయువకులు.. పార్కులు, ఏకాంత ప్రదేశాల్లో జంటగా కనిపిస్తే వారిని కఠినంగా శిక్షిస్తుంది.

వివాహం చేసుకునేందుకు ఎవరు కూడా మతం మారకూడదు అని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే.. వారు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అది అంత ఈజీగా దొరకదు. ఈ చట్టాలన్నీ హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుతాయని.. అందుకే తీసుకువచ్చామని ఆయన చెబుతూ ఉంటారు. నరేంద్ర మోదీ, అమిత్ షా తరువాత బిజేపీ నేతల్లో కేవలం యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే దేశమంతా ఎన్నికల వేళ ప్రచారానికి వెళతారు.

1994లో సన్యాసం స్వీకరించిన యోగి.. 1996లో గోరక్‌పూర్ మఠం పీఠాధిపతి అయ్యారు. 1999లో కేవలం 26 ఏళ్ల వయసులో ఆయన గోరక్‌పూర్ ఎంపీగా ఎన్నికల్లో గెలిచారు. ఆయన భారతీయ జనతా పార్టీలో ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసుకున్నారు.. దాని పేరే హిందూ యువ వాహిని. యూపిలో 2007 సంవత్సరంలో జరిగిన మత అల్లర్లలో ఈ హిందూ యువ వాహిని హింసకు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ మత ఘర్షణ కేసుల్లో ఆయన ఒకసారి అరెస్టు కూడా అయ్యారు. కానీ పది రోజుల్లోనే జైలు నుంచి బయటికొచ్చారు. ఈ కేసులో ఆయనపై పదేళ్ల వరకు ఎటువంటి విచారణ జరుగలేదు. 2017లో ఆయన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత.. మత అల్లర్ల కేసులో ఆయన ప్రభుత్వం ఈ కేసు విచారణను నిలిపివేసింది.

మరోవైపు ఆదిత్యనాథ్ దూకుడు వైఖరిని మోదీ, అమిత్ షా ద్వయం ఇష్టపడడంలేదు. యోగి ఆదిత్యనాథ్ యూపిలో అంతా తన ఇష్టానుసారం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన పార్టీకి అనుగుణంగా నడుచుకోవడంలేదని బిజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఆయన స్థానంలో మరో వ్యక్తి.. మాజీ IAS అధికారి అరవింద్ శర్మని ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నించారు. ఇలా చేయడం వల్ల యోగి ఆదిత్యనాథ్ ప్రభావం తగ్గించవచ్చు అని బిజేపీ అధిష్ఠానం భావించింది.

కానీ యోగి ప్రభావంతోనే రెండో సారి యూపీ ఎన్నికలు గెలిచిన తరువాత ఈ ఆలోచన విరమించుకున్నారు. అయితే అరవింద్ శర్మకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అమిత్ షా చెప్పినా.. అందుకు యోగి ఆదిత్యనాథ్ అంగీకరించలేదు. కేవలం పేరుకు ఒక కేబినెట్ మంత్రిగా నియమించారు. దీంతో తెలుస్తోంది.. యోగి ఆదిత్యనాథ్ అమిత్ షాకు తలవంచరని.

ఇక యోగి ఆదిత్యనాథ్ బలం గురించి చెప్పుకుంటే.. ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బిజేపీ వరుసగా రెండోసారి ఎన్నికలు గెలిచింది. మొత్తం 402 అసెంబ్లీ సీట్లలో 273 సీట్లపై విజయం సాధించింది. ఎన్నికల ముందు యోగి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా.. ఇంతటి భారీ మెజారిటీ రావడం.. అందరినీ ఆశ్చర్యపరిచింది. యోగి ప్రభుత్వం.. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. దీనికితోడు రైతుల ఉద్యమం, నిరుద్యోగం లాంటి సమస్యలున్నా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో పెద్ద విజయం సాధించి చూపించారు.

ఇంతటి ఘనవిజయం తరువాత ఆయన పరోక్షంగా తనను తాను మోదీ వారసునిగా ప్రకటించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆయన తన అనుచరుల చేత ఇలాంటి పోస్టులు పెట్టిస్తున్నారు. చాలా సార్లు ఆయన చేసిన రాజకీయ ర్యాలీల్లో ‘యోగినే మా ప్రధాన మంత్రి’ అనే నినాదాలు వినపడుతున్నాయి. చాలా మంది బిజేపీ నేతలు కూడా యోగి ఆదిత్యనాథ్‌ను NEXT PMగా చెబుతున్నారు. పైగా యోగి ఆదిత్యనాథ్‌కు RSS, సంఘ్ పరివార్ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. దేశంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక లోక్ సభ సీట్లున్నాయి. దీంతో యోగి తన సత్తా ఏంటో బిజేపీ అధిష్ఠానానికి తెలియజేస్తున్నారు.

ఇలా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌.. ఇద్దరి బలాబలాలను పోల్చితే.. యోగి ఆదిత్యనాథ్‌కే మోదీ వారుసుడు అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అమిత్ షా లాంటి చాణక్యుడిని తక్కువ అంచనా వేయలేం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News