Big Stories

Indian Presidents : మన రాష్ట్రపతులు.. వారి ప్రత్యేకతలు..!

Indian Presidents

Indian Presidents : ఏటా జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారత రిపబ్లిక్ అధ్యక్షుడి హోదాలో భారత రాష్ట్రపతి నేతృత్వంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఇప్పటివరకు 14 మంది రాష్ట్రపతులు ఈ వేడుకలకు అధ్యక్షత వహించగా.. ప్రస్తుతం 15వ రాష్ట్రపతి అయిన ద్రౌపదీ ముర్ము ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు దేశానికి సేవలందించిన భారత రాష్ట్రపతుల జీవితాల్లోని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం.

- Advertisement -

బాబూ రాజేంద్రప్రసాద్‌ : గొప్ప విద్యావేత్త, న్యాయశాస్త్ర నిపుణులుగా ఈయన పేరు సంపాదించారు. ఇంటర్‌లో ఉండగా ఈయన రాసిన పరీక్ష పేపర్ దిద్దిన లెక్చరర్‌ ‘ ఈ పేపర్ దిద్దిన నాకంటే ఈ పరీక్ష రాసిన విద్యార్థి మేధావి’ అని రాశారట. విద్యార్థిగా ఉంటూనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న బాబూజీ.. తొలుత ఆంగ్లం, ఆర్థిక శాస్త్రాల్లో ఉపన్యాసకునిగా పనిచేసి, తర్వాత లా చదివి గోల్డ్ మెడల్ అందుకుని పాట్నా హైకోర్టులో పనిచేశారు. గాంధీ పిలుపుతో అన్నీ వదిలి దేశసేవకు అంకితమైన బాబూజీ.. రాజ్యాంగ సభకి అధ్యక్షుడిగా, తొలి రాష్ట్రపతిగానే గాక.. రెండో దఫాకూడా రాష్ట్రపతిగా గెలిచి సేవలందించారు.

- Advertisement -

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ : హిందూమతాన్ని, భారతీయులను పశ్చిమ ప్రపంచం సరిగా అర్థం చేసుకునేలా చేసిన గొప్ప తత్వవేత్త రాధాకృష్ణన్. నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన స్కాలర్‌షిప్ సాయంతో చదువుకున్నారు. బీఏ తర్వాత కొత్త పుస్తకాలు కొనలేక.. ఎవరో ఇచ్చిన ఫిలాసఫీ బుక్స్ తీసుకుని, ఆ సబ్జక్టులోనే ఎంఏ చేశారు. 20 ఏళ్ల వయసులోనే భారతీయ వేదాంతాలపై అద్భుతమైన సిద్ధాంత పత్రం ప్రచురించి.. అబ్బురపరిచారు. యునెస్కోకి భారత ప్రతినిధిగా, రాజ్యాంగ సభ సభ్యుడిగా, ఉపరాష్ట్రపతిగా సేవలందించి, రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

జాకీర్‌ హుస్సేన్‌ : మూడవ రాష్ట్రపతిగా పనిచేసిన జాకీర్‌ హుస్సేన్‌ ఆ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం. ఆధునిక విద్యావేత్త, మేధావి. విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఆయన ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్‌ పొందారు. దిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన ఆ సంస్థలకు గొప్ప గుర్తింపు తెచ్చారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, బిహార్‌ గవర్నర్‌గా, ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. రాష్ట్రపతిగా రెండేళ్లు మాత్రమే పదవిలో ఉన్నారు. పదవిలో ఉండగా కన్నుమూసిన తొలి రాష్ట్రపతి.

వరాహగిరి వెంకటగిరి : ఇండిపెండెంట్‌గా గెలిచిన తొలి రాష్ట్రపతి ఈయనే. ఐర్లాండ్‌లో లా చదివిన గిరి.. విద్యార్థి ఉద్యమాల్లో పొల్గొన్నారు. మద్రాస్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తూ కాంగ్రెస్‌‌లో చేరి, పార్టీ కార్యక్రమాల్లో, కార్మిక పోరాటాల్లో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. కేంద్ర మంత్రిగా, యూపీ, కేరళ, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి నీలం సంజీవరెడ్డి, విపక్షం నుంచి సి.డి.దేశ్‌ముఖ్‌ బరిలో నిలవగా, ఇందిరా గాంధీ ప్రోత్సాహంతో గిరి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఇందిర ఇచ్చిన ‘ఆత్మ ప్రభోధం’ పిలుపుతో ఎవరూ ఊహించని విధంగా గెలిచారు. ఆ ఎన్నికపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు కాగా.. రాష్ట్రపతిగా గెలిచినా.. కోర్టుకు హాజరయ్యారు. తర్వాత ఆ కేసు వీగిపోయింది.

ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ : ఈయన ఢిల్లీలో పుట్టి పెరిగిన అస్మామీ ముస్లిం. లాయరుగా, కాంగ్రెస్ వాదిగా, స్వాతంత్ర్య పోరాటనేతగా, కేంద్ర మంత్రిగా మంచి పేరు పొందారు. ఈయన అయిదవ రాష్ట్రపతిగా ఉండగా, ఎమర్జెన్సీ ఆదేశాల మీద అర్ధరాత్రి పూట సంతకం చేసిన రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్రపతిగా ఉండగానే కన్నుమూసిన రెండో రాష్ట్రపతి.
నీలం సంజీవరెడ్డి : ఏకగ్రీవంగా గెలిచిన ఏకైక రాష్ట్రపతి. ఆ పదవిని అధిష్టించిన తొలి తెలుగునేత. చదువు వదిలేసి క్విట్‌ ఇండియా ఉద్యమంలో దూకిన నీలం.. సీఎంగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా, లోక్‌సభ స్పీకరుగా సేవలందించారు. ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ఆకస్మిక మృతితో వచ్చిన రాష్ట్రపతి పదవి ఎన్నికల్లో దాఖలైన 37 నామినేషన్లలో ఈయన దరఖాస్తు ఒక్కటే చెల్లటంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 67 ఏళ్లకే రాష్ట్రపతిగా, ఆ పదవికై రెండుసార్లు తీవ్రంగా పోటీ పడిన అభ్యర్థిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ తర్వాత జనతా పార్టీలో చేరారు. ‘వితౌట్‌ ఫియర్‌ ఆర్‌ ఫేవర్‌: రెమినిసెన్సెస్‌ అండ్‌ రిఫ్లెక్షన్స్‌ ఆఫ్‌ ఎ ప్రెసిడెంట్‌’ పేరుతో తన అనుభవాలను పుస్తకంగా రాశారు.

జ్ఞానీ జైల్‌ సింగ్‌ : ఇందిరా గాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడైన సీనియర్ కాంగ్రెస్ నేత. దేశానికి ఏడో రాష్ట్రపతిగా కాకముందు సీఎం, కేంద్ర హోం మంత్రిగా సేవలందించారు. రాష్ట్రపతిగా నియమితులవగానే ‘మా నేత ఇందిరమ్మ చీపురు పట్టుకుని ఊడవమంటే ఊడుస్తాను కూడా’ అని తన విధేయతను ప్రకటించి, విమర్శలపాలయ్యారు. పంజాబ్‌కు చెందిన ఈ నేత రాష్ట్రపతి భవన్‌లో ఉండగానే అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌ జరిగినా.. ఈయనకు కనీసం సమాచారం లేకపోయింది. ఆపరేషన్‌ బ్లూస్టార్‌, ఇందిర హత్య, ఢిల్లీ అల్లర్లు, రాజీవ్ ప్రధానిగా బాధ్యతలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి.

ఆర్‌. వెంకట్రామన్‌ : సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యాంగ సభ సభ్యుడు, పేరున్న వకీలుగా పేరొందిన వెంకట్రామన్.. స్వాతంత్ర పోరాటంలోనూ పాల్గొన్నారు. నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికై ఆర్థిక, రక్షణ మంత్రిగా సేవలందించారు. పలుమార్లు దేశ ప్రతినిధిగా ఐరాస సభలకు వెళ్లారు. నలుగురు ప్రధానులతో కలిసి పనిచేసిన రాష్ట్రపతిగా, సంకీర్ణ రాజకీయాలకు సాక్షిగా నిలిచారు. మంచి రచయితగానూ పేరుపొందారు.

శంకర్‌ దయాళ్‌ శర్మ : గొప్ప దైవభక్తుడైన రాష్ట్రపతిగా పేరుపొందిన శర్మ.. లా చదివి కేంబ్రిడ్జిలో లా అధ్యాపకుడిగా పనిచేశారు. 1940వ దశకంలో కాంగ్రెస్‌లో చేరి.. చివరి వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా, పలు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారు. రాష్ట్రపతిగా రెండోసారి పోటీ చేయనని ప్రకటించారు. ఈయన పేరుమీద ఏటా కేంద్ర ప్రభుత్వం పలు వర్సిటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వర్ణపతకం ఇస్తోంది.

కె.ఆర్‌.నారాయణన్‌ : తొలి దళిత రాష్ట్రపతిగా గుర్తింపు పొందిన నారాయణన్ నెహ్రూ హయాంలో రాయబారిగా జీవితాన్ని ప్రారంభించారు. ఉత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ ప్రశంసలందుకున్న ఆయన ఇందిర ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి తర్వాతి రోజుల్లో పదవ రాష్ట్రపతి అయ్యారు. ‘నేను పనిచేసే రాష్ట్రపతిని’ అని చెప్పుకున్న ఈయన పలు మంచి సంప్రదాయాలకు తెరతీశారు. పదవిలో ఉండగా ఓటు వేసిన తొలి రాష్ట్రపతి ఆయనే.

డా. ఏపీజే అబ్దుల్‌ కలాం : 40 ఏళ్లకు పైగా సైంటిస్టుగా సేవలందించిన ఈ ‘మిస్సైల్‌ మ్యాన్‌’ ప్రజల రాష్ట్రపతిగా జనం ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రపతి అయ్యాక కూడా అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపిన కలాం.. చిన్నారులకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేశారు. పదవి నుంచి దిగిపోయిన రోజు రెండు సూట్‌కేసుల్లో తన సామాన్లు సర్దుకుని స్వయంగా చేతబుచ్చుకుని వెళ్లిన కర్మయోగి.

ప్రతిభా దేవీ సింగ్ పాటిల్‌: రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి మహిళ. లాయరుగా జీవితాన్ని ఆరంభించి, 27వ ఏటనే ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘకాలంలో మరాఠా రాజకీయాల్లో కొనసాగారు. విపక్షం నుంచి భైరాన్ సింగ్ షెకావత్ రాష్ట్రపతిగా పోటీ చేసేందుకు సిద్ధపడగా, కాంగ్రెస్ తరపున అదే వర్గానికి చెందిన నేత కోసం సాగిన అన్వేషణతో అంతిమంగా ఈమె పేరు వచ్చింది. అలా.. ఈమె ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కాలంలోనే అనూహ్యంగా రాష్ట్రపతి పదవి వరించింది.

ప్రణబ్‌ ముఖర్జీ : జర్నలిస్టుగా, ప్రొఫెసరుగా, గొప్ప మేధావిగా పేరున్న సీనియర్ కాంగ్రెస్ నేతగా ప్రణబ్ పేరుపొందారు. 13వ రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్.. 1969లో ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో రాజ్యసభ ఎంపీగా గెలిచి సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో క్రైసిస్ మేనేజర్ పాత్రలో కొనసాగారు. మధ్యలో పార్టీని ధిక్కరించి సొంతపార్టీ పెట్టుకున్నా తిరిగి కాంగ్రెస్‌లో చేరి, 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆర్థిక సంస్కరణలకు ముందూ, తర్వాత కూడా దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా, రక్షణ, ఆర్థిక, వాణిజ్య, విదేశీ వ్యవహారాల మంత్రిగా చరిత్ర సృష్టించారు. ఏడు బడ్జెట్లు పెట్టిన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందిన ప్రణబ్.. రాష్ట్రపతిగా టీచర్స్ డే రోజు బడి పిల్లలకు పాఠాలు చెప్పి వార్తల్లో నిలిచారు. 40 ఏళ్లపాటు తాను రాసిన డైరీలను తన మరణానంతరం పుస్తకంగా తేవాలని కుటుంబసభ్యులకు సూచించారు.

రామ్‌నాథ్‌ కోవింద్‌ : ఐఏఎస్ కావాలనుకుని వీలుకాకపోవటంతో లా చదివి ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. 1980 నుంచి 1993 వరకు సుప్రీంకోర్టులో స్టాండింగ్‌ కౌన్సెల్‌గా ఉన్నారు. కొంతకాలం ఆయన మొరార్జీ దేశాయ్‌కి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఆయన.. బీజేపీలో చేరి యూపీలో కల్యాణ్‌సింగ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రభుత్వాలకు అనధికార న్యాయసలహాదారుగానూ వ్యవహరించారు. పెద్దగా ప్రచారం కోరుకోకుండా బీజేపీకి తెరవెనక సేవలందించిన ఈ దళిత నేత 1994 నుంచి 2006 వరకూ యూపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి, 2015లో బిహార్‌ గవర్నర్‌‌గా పనిచేస్తూ.. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి రాష్ట్రపతి అయ్యారు.

ద్రౌపదీ ముర్ము : రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీ మహిళగా, 64 ఏళ్లకే రాష్ట్రపతి అయిన వ్యక్తిగా పేరొందారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైదపోసిలో నిరుపేద కుటుంబంలో జన్మించి, అనేక కష్టాలు పడి బీఏ చదివి, రాష్ట్రప్రభుత్వంలో చిరుద్యోగిగా, అనంతరం టీచరుగా పనిచేశారు. 1997లో బీజేపీలో చేరి, మునిసిపల్ కౌన్సిలర్‌గా, వైస్‌ఛైర్మన్‌గా పనిచేశారు. ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2002 నుంచి 2015 వరకు మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా, ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె 2015లో జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News