Nepal Bans Everest & MDH Spices: భారత్ లో తయారైన రెండు బ్రాండ్ మసాలా దినుసుల పొడుపుల విక్రయాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ బ్రాండ్ లు తయారు చేస్తున్న మసాలా దినుసుల పొడులను నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్ మెంట్ పరీక్షించింది. వాటిలో క్యాన్సర్ కారక పురుగుమందు అయిన ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్ని ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ దేశాలు నిషేధించగా.. తాజాగా నేపాల్ కూడా వాటి విక్రయాలను నిషేధించింది.
నేపాల్ ఫుడ్ టెక్నాలజీ ప్రతినిధి మోహన్ కృష్ణ మహర్జన్ మాట్లాడుతూ.. ఎవరెస్ట్, ఎండీహెచ్ బ్రాండ్ మసాలా పొడుల తయారీలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. వీటిపై ఇంకా ల్యాబ్ లలో పరీక్షలు జరుగుతున్నాయని, తుది నివేదిక వచ్చేంత వరకూ నిషేధం అమలులో ఉంటుందని మహర్జన్ వెల్లడించారు.
కాగా.. భారత్ లో ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ మసాలాలు ఎంతోకాలంగా ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి ప్రజలు కూడా రెడీమేడ్ సుగంధ ద్రవ్యాల పొడులు, మసాలా పొడుల వాడకానికి అలవాటు పడటంతో.. మార్కెట్లలో వీటి విక్రయాలు పెరిగాయి. క్రమంగా విదేశీ ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయి. న్యూజిల్యాండ్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాలోనూ ఈ మసాలా పొడులపై పరీక్షలు జరుగుతున్నాయి.
Also Read: చిన్న పిల్లలకు పెద్దలు వాడే సబ్బులు వాడొచ్చా..?
వీటిలో గుర్తించబడిన ఇథిలీన్ ఆక్సైడ్ మనుషులలో క్యాన్సర్ కణజాలం పెరగడానికి కారణమయ్యే ప్రమాదకరమైన రసాయనం. అందుకే వీటిపై కొన్ని దేశాలు తాత్కాలికంగా నిషేధం విధించాయి. పూర్తిగా టెస్టులు చేశాక.. వాటి వాడకంపై ఒక నిర్ణయానికి వస్తామని ఆయా దేశాల ఫుడ్ సేఫ్టీ ప్రతినిధులు పేర్కొన్నారు.