Savitri Death Anniversary: సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. వెయ్యి ఏళ్ళు అయినా ఆమెను మర్చిపోవడం ఎవరితరం కాదు. ఇండస్ట్రీకి మరో సావిత్రి దొరకడం కూడా సాధ్యం కాదు. కొన్ని దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన మహానటి ఆమె.
అప్పట్లో హీరోలకు ధీటుగా ఒక హీరోయిన్ కోసం థియేటర్లు తెరుచుకునేవి అంటే అది కేవలం సావిత్రి కోసమే అని చెప్పాలి. సావిత్రి సినీ జీవితం ఎంతోమందికి ఆదర్శం.. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎంతోమందికి గుణపాఠం. ఒక ఆడది ప్రేమిస్తే ఎంతవరకు వెళ్తుందో ఆమె చూపించింది.
గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో 1936, డిసెంబర్ 6 న నిస్శంకర సావిత్రి జన్మించింది. సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు.
మహానటి సినిమాలో చూపించిన విధంగానే సావిత్రి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇష్టం లేకున్నా ఎవరైనా ఏదైనా అంటే మాత్రం దాన్ని శ్రద్దగా నేర్చుకొని చేసి చూపిస్తుంది. అలానే ఆమె మద్రాసుకు చేరుకొని చిన్న చిన్న పాత్రలతో సినీ ప్రస్థానం ప్రారంభమించింది.
ఇక పెళ్లి చేసి చూడు సినిమా ఆమె సినీ జీవితంలో ఒక మలుపుగా చెప్పవచ్చు. అయితే సావిత్రిలోని అసామాన్య నటిని తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు అనే చెప్పాలి.
మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి 250 కన్నా ఎక్కువ సినిమాలలో నటించింది. 1950, 60, 70 లలో ఎక్కువ పారితోషికం, ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు.
తెలుగులో కాకుండా అన్ని భాషల్లో ఆమె నటించి మెప్పించింది. సావిత్రి తమిళ్ సినిమా చేసే సమయంలోనే నటుడు జెమిని గణేశన్ తో ఆమె పరిచయం పెళ్లికి దారితీసింది.
1956లో ఇంట్లోవారికి అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన జెమినీ గణేశన్ ను ఆమె పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె విజయ చాముండేశ్వరి, ఒక కుమారుడు సతీష్ కుమార్ ఉన్నారు.
పెళ్లి తరువాత కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సావిత్రి.. భర్త చేసిన మోసాన్ని భరించలేకపోయింది. తనను కాదని మరొకరితో ఉండడానికి సిద్ధపడ్డ భర్తను వదిలి.. ఆయన జ్ఞాపకాలను మరువలేక ముందుకు బానిసగా మారింది.
ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై.. ఆమెను పట్టించుకొనే దిక్కు కూడా లేక దుర్భరమైన జీవితాన్ని గడిపింది. స్టార్ గా మారి.. ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన సావిత్రి.. దిక్కుమొక్కు లేక.. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎవరికి తెలియకుండా చికిత్స కోసం చేరింది.
అలా చివరి రోజుల్లో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడిపి 1981 డిసెంబర్ 26 న సావిత్రి మరణించింది. ఆమె వ్యక్తిగత జీవితం ఆమె ఇష్టం. కానీ, సావిత్రిలా బతకవచ్చు.. కానీ, ఆమెలా మాత్రం చావకూడదు. ఇలాంటి చావు పగవాడికి కూడా రాకూడదు అని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ ఫొటో సావిత్రి చనిపోయినప్పటిది అని చెప్తారు. అది నిజమో కాదో ఎవరికి తెలియదు.