Big Stories

Capital Issue : సీఎం రాజధాని ప్రకటనతో దుమారం.. బీజేపీ, టీడీపీ ఫైర్..

Capital Issue : విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని సీఎం జగన్ చేసిన ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. సీఎం వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు టీడీపీ మండిపడుతున్నాయి. అమరావతే ఏపీ రాజధాని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కుండబద్దలు కొట్టారు. అమరావతి నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. 4 వేల కోట్లు అప్పు కూడా ఇప్పించామన్నారు. 3 రాజధానులతో అభివృద్ధి సాధ్యంకాదని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలి.. విశాఖను అభివృద్ధి చేయాలి.. ఇదే బీజేపీ అభిమతమని తేల్చి చెప్పారు. ఆసియాకి విశాఖ స్ట్రాటజికల్ పాయింట్. ఇక్కడ పోర్టు నుంచే అనేక ప్రాంతాలకు రవాణా సాగుతోందని తెలిపారు.

- Advertisement -

సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ భగ్గుమంది. సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచడంతోనే సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు. హత్య జరిగిన రోజు ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి సెల్ ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడారనే అంశం కీలకంగా మారిందన్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు విశాఖ రాజధాని పేరుతో డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఆ కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం వైఎస్‌ జగన్‌.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసిందని కేశవ్ గుర్తుచేశారు. ఆ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ పెండింగ్‌లోనే ఉందన్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్‌ ప్రకటన కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు పయ్యావుల కేశవ్‌.

- Advertisement -

అటు వైసీపీ ప్రభుత్వం రాజధానిపై వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకుని ఏప్రిల్‌ లోపే విశాఖ నుంచి పాలన చేపడతామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ నుంచి పాలన కొనసాగించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. నగరంలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని.. అవసరమైతే ప్రైవేట్ భవనాలను కూడా తీసుకోవచ్చన్నారు. భీమిలి రోడ్డులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలనూ కొంతమేర వాడుకోవచ్చని చెప్పారు. సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం ప్రస్తుతానికి ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసి ఆ తర్వాత నిదానంగా మారొచ్చని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News