Big Stories

Undi Assembly constituency: కూటమి అభ్యర్థులకు రెబల్స్ టెన్షన్..

Rebels Tension For TDP Party: ఏపీలో ఒకవైపు జనసేన పార్టీ గుర్తుతో టెన్షన్ పడుతున్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్ధులు దాదాపు పదుల సంఖ్యలో సెగ్మెంట్లో స్వతంత్ర అభ్యర్ధులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంతో ఆ ప్రభావం ఎలా ఉంటుందో అని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు కీలక స్థానాల్లో రెబల్స్ పోటీలో నిలిచి అభ్యర్ధులను టెన్షన్ పెడుతున్నారు. దాదాపుగా 8 నియోజకవర్గాల్లో రెబల్స్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

టీడీపీతో పాటు వైసీపీకి కూడా ఈ సారి ఆ తలనొప్పి తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల విత్ డ్రా గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్ధుల విషయంలో క్లారిటీ వచ్చింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4 వేల 210 నామినేషన్ల దాఖలు అవ్వగా ఇప్పుడు 2 వేల 705 మంది బరిలో నిలిచారు. అలానే 25 పార్లమెంట్‌ స్థానాలకు 731 మంది మొదట నామినేషన్‌ వేయగా, ఇప్పుడు 503 మంది పోటీలో నిలిచారు. ఆ క్రమంలో 8 నియోజకవర్గాల్లో రెబల్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

- Advertisement -

ఎన్డీఏ కూటమి తరపున 5 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో కూటమి నేతలను కలవరపెడుతుంది. విజయనగరం, ఉండి, పోలవరం, గన్నవరం, కావలి సెగ్మెంట్లలో రెబల్ అభ్యర్ధులు కూటమి అభ్యర్ధులకు సవాళ్లు విసురుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టిడిపి కంచుకోటల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఆఖరి నిమిషంలో ఉండి టీడీపీ టికెట్ దక్కించుకున్న నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైకిల్ గుర్తుపై పోటీకి సిద్దమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రచారం చేసుకుని ఆఖరి నిమిషంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు సింహం గుర్తుతో పోటీకి సిద్దమయ్యారు.

Also Read: ప్రేమతో పంచ్ లు వేసుకుంటున్న అన్నా చెల్లెల్లు..

ఉండి నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు శివరామరాజు పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం టిడిపిలో ఉన్న ముఖ్య నేతలు కార్యకర్తలు తనకు మద్దతు తెలుపుతారన్న నమ్మకంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే శివ బరిలో నిలవడంతో టీడీపీ ఓటుబ్యాంకుకు చిల్లుపడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రఘురామకృష్ణంరాజు ఆయన్ని బుజ్జగించడానికి అటు టీడీపీ పెద్దలతో పాటు క్షత్రియ సామాజికవర్గ పెద్దలతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంట.

విజయనగరం టీడీపీ అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కుమార్తె ఆదితి విజయలక్ష్మి రెండో సారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమె ఈ సారి ఎలాగైన వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామికి చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయితే ఇప్పుడు మీసాల గీత రూపంలో ఆదితికి తలనొప్పి ఎదురైంది. 2009లో పీఆర్పీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మీసాల గీత ఆ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2014 నాటికి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న అశోక్‌గజపతిరాజు ఎంపీగా వెళ్లండంతో విజయనగరం ఎమ్మెల్యే టీడీపీ టికెట్ దక్కించుకున్న మీసాల గీత విజయం సాధించారు.

అయితే గత ఎన్నికల సమయానికి గజపతి ఫ్యామిలీ నుంచి ఆదితి టీడీపీ అభ్యర్ధిగా విజయనగరం బరిలో దిగడంతో మీసాల గీతకు అవకాశం దక్కలేదు.. ఈ సారి కూడా టీడీపీ అధిష్టానం గజపతి ఫ్యామిలీకే అవకాశం ఇవ్వడంతో అసంతృప్తికి గురైన మీసాల గీత రెబల్ అవతారం ఎత్తారు. టీడీపీ పెద్దలు ఎంత నచ్చజెప్పినా నామినేషన్ ఉపసంహరించుకోకుండా ఆమె బరిలో నిలిచారు. మరి ఈ తలనొప్పిని అశోక్‌గజపతి ఎలా అధిగమిస్తారో చూడాలి.

Also Read: పగిలిన గ్లాస్.. గుచ్చుకునేది ఎవరికి?

పోలవరం జనసేన అభ్యర్ధిగా చిర్రి బాలరాజు పోటీలో ఉన్నారు. ఆ సీటు జనసేనకు దక్కడంపై టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది .. అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు పార్టీ పెద్దల పెద్దలతో మెత్త పడి.. బాలరాజుకు సహకరిస్తున్నారు. అయితే మరో టీడీపీ టికెట్ ఆశావహుడు ముడియం సూర్యచంద్రరావు మాత్రం రెబల్‌గా నామినేషన్ వేసి పోటీకి సై అంటున్నారు. గన్నవరంలో బీజేపీకి అన్యాయం జరిగిపోతుందంటూ ఆ పార్టీ నేత కొర్రపోలు శ్రీనివాసరావు రెబల్ అవతారమెత్తారు. టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావుని ఓడిస్తానంటూ ప్రచారంలో హడావుడి చేస్తున్నార. గన్నవరంలో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో వంశీ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన యర్లగడ్డ టికెట్ దక్కించుకున్నారు.

ఇక నెల్లూరు జిల్లా కావలిలో పసుపులేటి సుధాకర్ రెబల్‌గా బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్ధి కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఇక వైసీపీలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు రెబల్ బెడద తప్పలేదు ఆముదాలవలసలో తమ్మినేనిపై టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ పోటీలో ఉన్నారు. 2014లో తమ్మినేని పై గెలిచిన కూన రవి ఆయనకు స్వయానా మేనల్లుడే.. అయితే ఈ సారి వైసీపీకి చెందిన కీలక నేత సువ్వారి గాంధీ నామినేషన్ వేసి బరిలో నిలిడి ఆ మామకి గండంగా తయారయ్యారు.

ఆ క్రమంలో పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పలువురు నాయకుల్ని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరానికి చెందిన మీసాల గీత, అమలాపురానికి చెందిన పరమట శ్యాంకుమార్‌, పోలవరానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండికి చెందిన వేటూకూరి వెంకటశివరామరాజు, సత్యవేడుకు చెందిన జడ్డా రాజశేఖర్‌లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News