BigTV English

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Balineni Srinivasa Reddy warning to YV Subbareddy: బావమరిది బతుకు కోరతాడంటారు. రాజకీయాల్లో మాత్రం ఆ సూత్రం వర్తించదని మాజీ మంత్రి బాలినేని, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిరూపిస్తున్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్‌కి బాబాయి అయిన వైవీకి బాలినేని శ్రీనివాసరెడ్డి బావమరిది అవుతారు.  వారిద్దరు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. వైసీపీలో బాలినేనిని వైవీ చాలా ఇబ్బంది పెట్టారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు జనసేనలో చేరాక కూడా వైవీ విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో ఓర్పు నశించిన బాలినేని తన జోలికి వస్తే నీ బండారం బయటపెడతానని వైవీకి వార్నింగ్ ఇచ్చారంట. అసలింతకీ బాలినేని బయట పెడతానన్న ఆ బండారం ఏంటి?


ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి , ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరూ వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువులు వారిద్దరి మధ్య కూడా దగ్గర చుట్టరికం ఉంది. వైవీ సోదరిని బాలినేని శ్రీనివాసరెడ్డి భార్య. అటు చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రడ్డికి , వైవీ సుబ్బారెడ్డి తోడల్లుడు. అంటే మాజీ సీఎం జగన్‌కు బాబాయ్ వరుస అవుతారు. అలాగే బాలినేని కూడా జగన్‌కి మామయ్య అవుతారు.

చాలా కాలంగా బావబామ్మరుదులైన వైవీ, బాలినేనిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుందంట. 1999లో కాంగ్రెస్ యువ నాయకుడిగా వున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర రికమండ్ చేసి వైవీ సుబ్బారెడ్డి మొదటి సారి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారట. మొదటి చాన్స్‌లోనే విజయం సాధించిన బాలినేని ఒంగోలులో పాతుకుపోయారు. 1999 నుంచి 2012 బైపోల్స్ వరకు వరుస విజయాలు సాధించి జిల్లాస్థాయి నేతగా ఎదిగారు.


బాలినేని 2009లో గెలిచినప్పుడు ఆయనకు మంత్రి పదవి దక్కింది. అది కూడా వైఎస్‌కు వైవీ రికమండ్ చేయడం వల్లే దక్కిందంటారు. వైఎస్ అకాల మరణంతో మారిన రాజకీయ పరిణామాలతో.. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీని స్థాపించారు. అప్పటికి మంత్రిగా ఉన్న బాలినేని అది కొత్త పార్టీ అని కూడా ఆలోచించకుండా మంత్రిపదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. అప్పటికే ఒంగోలు నుంచి మూడు సార్లు గెలుపొంది జిల్లా పై పట్టు సాధించిన బాలినేని తనకు రాజకీయాల కన్నా బంధుత్వమే ముఖ్యం అని వ్యాఖ్యానించి మరీ వైసీపీలో చేరి 2012 బైపోల్స్‌లో వైసీపీ ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించారు.

ఆ తర్వాత రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో వైసీపీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ ఖాతా తెరిచినప్పటికీ..గెలిచిన నలుగురూ విలీనం పేరుతో టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో ఆ రాష్ట్రంలో వైసీపీ దుకాణం సర్దేసింది. ఇటు ఏపీలో కూడా ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది .. అప్పటి వరకు హైదారాబాద్ లోనే వుంటూ వైఎస్‌కు రాజకీయ సహాయకుడిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి .. జగన్ పక్కన చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.

Also Read: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

వైవీది కూడా ప్రకాశం జిల్లానే అవ్వడంతో జగన్ 2014లో ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి లక్కీ కాంబీనేషన్‌గా వెలుగొందారు. వారి కాంబినేషన్‌ను విడదీసిన జగన్.. వైవీకి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైనప్పటికీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యేగా బాలినేని మొదటి సారి ఓడిపోయారు.

అప్పటి వరకు జిల్లాలో తిరుగులేని నేతగా వున్న బాలినేని శ్రీనివాసరెడ్డి అసలే ఓటమి బాధలో ఉంటే ఎంపీగా గెలిచినప్పటి నుంచి వైవీ ఆయనకు తలనొప్పిగా తయారయ్యారంట. జిల్లాపై పట్టు కోసం వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టడం బాలినేనికి మింగుడు పడలేదంట. ఆ క్రమంలో బావబామ్మరుదులు ఒకరిపై ఒకరు జగన్‌కు ఫిర్యాదులు చేసుకుంటూ పంచాయతీలు పెట్టేవారంట. 2019 ఎన్నికలలో వైవీ సుబ్బారెడ్డిని జిల్లాకి దూరంగా ఉంచాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించటంతో జగన్ ఆయని టికెట్ ఇవ్వకుండా ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్చార్జ్‌గా పంపారంటారు.

2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడంతో .. బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి దక్కింది. అయితే అది మూణ్ణాళ్ల ముచ్చటగా మారి మూడేళ్ల తర్వాత జగన్ ఆయన్ని కేబినెట్ నుంచి తప్పించారు. దానికి కారణం వైవీనే అని బాలినేని సన్నిహితుల దగ్గర అక్కసు వెళ్లగక్కే వారంట. అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా ముందుకొచ్చి జగన్, వైవీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. పార్టీ నిర్ణయాలపై అలకపాన్పు ఎక్కడం మొదలుపెట్టారు. దాన్ని ఆసరా చేసుకుని వైవీ తిరిగి జగన్‌కు కంప్లైంట్స్ చేశారంటారు.

చివరకు జిల్లాలో సీనియర్ నేత, ఐదు సార్లు విజయం సాధించిన బాలినేనికి 2024లో టికెట్ లేదన్న ప్రచారం కూడా జరిగింది. జిల్లా రాజకీయాల్లో బాలినేనికి పట్టు లేకుండా చేసేందుకు వైవీ సుబ్బారెడ్డి పావులు కదపడంతో.. అప్పటి వరకు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని ప్రమేయం లేకుండానే జగన్ ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించారు. జిల్లాకు సంబంధంలేని చెవిరెడ్డి వంటి వారిని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు. అలా వైసీపీలో బావబామ్మరుదుల పంచాయతీ నడుస్తుండగానే వైసీపీ ఘోర పరాజయం పాలైంది.

ఒంగోలులో ఓడిపోయిన బాలినేని తనకు విలువ లేని చోట, తనకు గౌరవం ఇవ్వని పార్టీలో వుండనంటూ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిపోయారు. దాంతో వైవీ సుబ్బారెడ్డి తన బామ్మరిదిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో మరోసారి తన గురించి మాట్లాడితే నీ బండారం బయటపెడతానని వైవీకి బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట. ఆ విషయం బయటకు పొక్కడంతో బాలినేనికి తెలిసిన వైవీ బండారం ఏంటా అన్న చర్చ జరుగుతోంది.

టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి లడ్డు వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విజిలెన్స్ అధికారులు ఆయనకు విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. దానిపై సుప్రీం కోర్టుని ఆశ్రయించిన వైవీ తనను విజిలెన్స్ ఎంక్వయిరీ జరగకుండా చూడాలని కోరారు. దాంతో వైవీపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి … ఆ క్రమంలో వైవీ కొండపై చేసిన అక్రమాలకు సంబంధించి లోగుట్లు బాలినేని తెలిసి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి బాలినేనికి తన బావ గురించి తెలిసిన గుట్టు ఏంటో? దాన్ని ఎప్పుడు బయట పెడతారో చూడాలి.

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×