SIM Swap Fraud: నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ మన పనులను ఎంత సులభతరం చేసిందో.. సైబర్ నేరగాళ్లకు కూడా అంతే సులభంగా దోచుకునే దారులను చూపిస్తోంది. ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న అతిపెద్ద మోసం ‘సిమ్ స్వాప్ ఫ్రాడ్’. మనకు ఏమాత్రం తెలియకుండానే.. కేవలం నిమిషాల వ్యవధిలో మన బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బు మొత్తాన్ని మాయం చేసే ప్రమాదకరమైన టెక్నిక్ ఇది. అసలు ఈ సిమ్ స్వాప్ మోసం ఎలా జరుగుతుంది? మన కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సిమ్ స్వాప్ అంటే మన మొబైల్ నంబర్‌తోనే సైబర్ నేరగాళ్లు మరో కొత్త డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకోవడం. ఇలా కొత్త సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే, మీ ఫోన్‌లో ఉన్న ఒరిజినల్ సిమ్ పనిచేయడం ఆగిపోతుంది. దీనివల్ల మీ ఫోన్‌కు రావాల్సిన కాల్స్, ముఖ్యంగా బ్యాంక్ ఓటీపీలు అన్నీ నేరగాళ్ల దగ్గర ఉన్న కొత్త సిమ్‌కు వెళ్లిపోతాయి.
ముందుగా స్కామర్లు ఫిషింగ్ లింక్స్ లేదా ఇతర మార్గాల ద్వారా మన పేరు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలను దొంగిలిస్తారు. ఆ వివరాలతో మన పేరు మీద నకిలీ ఐడీ కార్డులు సృష్టిస్తారు. ఆ తర్వాత టెలికాం స్టోర్‌కు వెళ్లి, ఫోన్ పోయిందని అబద్ధం చెప్పి మన నంబర్‌తో కొత్త సిమ్ తీసుకుంటారు. మన ఫోన్‌లో సిగ్నల్ పోగానే.. వారు మన బ్యాంక్ పాస్‌వర్డ్ మార్చేసి, ఓటీపీల సాయంతో అకౌంట్ ఖాళీ చేస్తారు.
Also Read:
మీ ఫోన్‌లో సిగ్నల్ అకస్మాత్తుగా పూర్తిగా పోయి, ఎంతసేపటికీ రాకపోతే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వేరే నంబర్ నుండి మీ టెలికాం ఆపరేటర్‌కు కాల్ చేసి వివరాలు కనుక్కోండి. అలాగే సోషల్ మీడియాలో మీ ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలను పబ్లిక్‌గా పెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ ఓటీపీలు, యూపీఐ పిన్ లేదా పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోకండి.
ఒకవేళ మీ సిమ్ హ్యాక్ అయ్యిందని లేదా మీ ప్రమేయం లేకుండా సిమ్ బ్లాక్ అయ్యిందని అనుమానం వస్తే.. తక్షణమే మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించి సిమ్ బ్లాక్ చేయించండి. ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. దీనివల్ల మీ డబ్బు నేరగాళ్ల చేతికి చిక్కకుండా బ్యాంకులు ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది.
Also Read: