Brahmangari Gutta Ghat Road: తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా నల్లగొండ పట్టణంలో ఉన్న బ్రహ్మంగారి గుట్టకు కొత్త రూపును తీసుకురాబోతోంది. కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు ప్రధాన పనులు పూర్తయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కాలినడకన, ఇబ్బందులు పడుతూ కొండపైకి వెళ్లే భక్తులు, పర్యాటకులకు ప్రయాణం మరింత ఈజీగా మారింది. కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతం మరో పర్యాటక ప్రాంతంగా మారుతోంది.
బ్రహ్మంగారి గుట్టపైకి వెళ్లేందుకు సుమారు 1.40 కిలోమీటర్ల పొడవున ఈ ఘాట్ రోడ్డును నిర్మించారు. ఇందుకోసం దాదాపు రూ.36 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. రోడ్డు నిర్మాణంలో ప్రధాన పనులు పూర్తవడంతో బైక్‌లు, కార్లపై నేరుగా కొండపైకి చేరుకునే అవకాశం ఏర్పడింది. అయితే, రహదారి పనులు పూర్తయినప్పటికీ మరికొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, రోడ్డు పెయింటింగ్, సైన్ బోర్డుల ఏర్పాటు లాంటి పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ 2026 డిసెంబర్ చివరి నాటికి పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
బ్రహ్మంగారి గుట్ట ఆధ్యాత్మికంగానూ ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతం. ఇక్కడ ఉన్న పురాతన బ్రహ్మంగారి ఆలయంతో పాటు శివాలయం, కనకదుర్గ అమ్మవారి ఆలయాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో వృద్ధులు, చిన్నపిల్లలు కూడా వాహనాల్లో సులభంగా ఆలయాలకు చేరుకుని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ వందల ఏళ్ల చరిత్ర కలిగిన బూరుగు చెట్టు. స్థానికంగా దీనిని బ్రహ్మంగారి చెట్టుగా పిలుస్తారు. అరుదైన ఈ భారీ వృక్షాన్ని చూసేందుకు కూడా సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
నల్లగొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా సమీపంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై కూడా ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, భవిష్యత్తులో లతీఫ్ సాహెబ్ గుట్ట నుంచి కాపురాలగుట్ట వరకు రోప్‌వే ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
బ్రహ్మంగారి గుట్టపైకి చేరుకున్న తర్వాత నల్లగొండ పట్టణాన్ని ఎత్తు నుంచి చూడవచ్చు. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడి ప్రకృతి అందాలు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం, కొండపై నుంచి కనిపించే పట్టణ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో బ్రహ్మంగారి గుట్టకు సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక దర్శనంతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి మంచి టూరిజం డెస్టినేషన్ గా మారనుంది.
Read Also: సముద్రం కాదు.. కానీ, సముద్రంలా కనిపిస్తుంది.. నల్లగొండలో ఈ అద్భుతం చూశారా?