Big Stories

Message for Failed Students : ప్రియమైన విద్యార్థులారా.. ఒక్క క్షణం ఆలోచించండి !

Message for Failed Students : తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈ సమయంలో నా మనసులో ఉన్న నాలుగు మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో పరీక్షలు చాలా చిన్న అంశం. నిజానికి మీకు నిజజీవితంలో ఎదురయ్యే పరిస్థితులను, ఒత్తిళ్లను జయిస్తేనే విజేతలుగా నిలవగలుగుతారు. నేటి ప్రపంచంలో మీ చుట్టు ఉన్నవాళ్లతో విద్యార్థులుగా మీకు పోటీ ఉంది. కానీ, ఆ పోటీ మాత్రమే మీ కెరీర్‌ను డిసైడ్ చేయదు. సరైన దారిని ఎంచుకోవటంలోనే మీ సక్సెస్ ఆధారపడి ఉందని విద్యార్థులంతా గుర్తించాలి. పరీక్ష ఫలితాల కంటే జీవితంలో మరెన్నో పెద్ద నిర్ణయాలు చేయబోతున్నారని తెలుసుకోండి.

- Advertisement -

పరీక్షల్లో ఫెయిలయ్యాననే ఉద్దేశంతో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఈ రోజు మనం చూసే ఎందరో లెజెండ్స్ వారు టెన్త్ పరీక్ష కూడా పాస్ కాలేదని గుర్తుపెట్టుకోండి. ఏ పోటీలోనైనా మీరు గెలిస్తే చప్పట్లు మాత్రమే వినిపిస్తాయి.. అదే ఓడిపోతే అనుభవాలు కనిపిస్తాయి. అందుకే ఏ పరీక్షలోనైనా మీరు ఫెయిల్ అయితే దానిని ‘ఇట్స్ ఓకే’ అని స్వీకరించి, మరింత కష్టపడేందుకు మరునిమిషం నుంచే కష్టపడండి తప్ప బాధపడకండి. ఇవాళ కాకుంటే.. రేపైనా ఆ పరీక్షల్లో మీరు పాస్ అవుతారు. కానీ మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని ప్రేమించే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులంతా బాధపడాల్సి ఉంటుంది.

- Advertisement -

జీవితంలో చదువు అవసరమే. క్రికెట్ మ్యాచ్‌లో గెలుపు, ఓటమి ఉన్నట్లు, పరీక్షలోనూ పాస్, ఫెయిల్ అనేవి ఉంటాయి. అయితే, రేపటి నీ జీవితాన్ని నిర్ణయించేవి ఈ పరీక్షలు కాదు.. మీ ఆలోచనలే. జీవితంలో ఎదగాలంటే గొప్ప నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉండాలి. రిస్క్ తీసుకోగలగాలి. అప్పుడు మీరే మరో పదిమందికి ఉద్యోగం ఇవ్వగలిగే స్థాయికి ఎదుగుతారు. పరీక్షలో ఫెయిలైతే సిగ్గుగా ఫీలవటం, డిప్రెషన్‌లోకి వెళ్లటం వంటివి వద్దు. హాయిగా సప్లీ రాయండి. పరీక్షలో ఫెయిలైతే జీవితం అక్కడితో ఆగిపోదు.

పరీక్షల్లో ఫెయిలయ్యామనో, లవ్ ఫెయిల్యూర్ అని ఆత్మహత్య ఆలోచనలు చేయొద్దు.
పరీక్షలు మళ్లీ వస్తాయి.. ప్రేమ మళ్లీ పుడుతుంది..
కానీ నిన్ను మళ్లీ.. నీ తల్లిదండ్రులకు ఎవరూ తెచ్చి ఇవ్వలేరు..
నీ జీవితాన్ని నిర్ణయించేవి పరీక్షలు కాదు.. సవాళ్లే.
ఈ మార్కులు నీ టాలెంట్‌ను డిసైడ్ చేసేవేం కాదు.
నీ ఆలోచన, నీ క్యారెక్టర్ మాత్రమే నువ్వేంటో డిసైడ్ చేస్తాయి.
ఓడిపోవడం అంటే గెలుపునకు దగ్గరగా వెళ్లి రావడమే.

మార్కులు తక్కువ వస్తేనో, లేక ఫెయిలైతే.. పిల్లలు దిగులు పడటం, డిప్రెషన్లోకి పోవటం ఈ రోజుల్లో సహజమే. ఈ సమయంలో తల్లిదండ్రులుగా మీరందరూ ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి..

– రిజల్ట్ వచ్చాక, మీ అబ్బాయి/ అమ్మాయి డల్‌గా ఉంటే, వారితో సమయం గడపండి. వారిలో ధైర్యాన్ని నింపండి. ఒక వారం రోజులు ఇలా చేస్తే, వారు దిగులు మరచి, మళ్లీ చదువుకు సిద్ధమైపోతారు. అంతే తప్ప, కటువుగా మాట్లాడకండి. కోపాన్ని ప్రదర్శించకండి.

– ఇంటికి వచ్చిన మీ బంధువులతో మీవాడి రిజల్ట్ గురించి చర్చ చేయకండి. ఒకవేళ వాళ్లు అడిగినా.. ‘ వాడి స్థాయికి బాగానే కష్టపడ్డాడు. ఫర్వాలేదు’ అని చెప్పి సరిపెట్టండి తప్ప వాళ్లముందు మీ పిల్లలను చిన్నబుచ్చటం చేయకండి.

– ఎవరైనా వేరే విద్యార్థులతో మీ పిల్లల మార్కులు పోల్చితే, ‘వాళ్లు వేరు.. మా అబ్బాయి/ అమ్మాయి వేరు. చాలా విషయాల్లో మావాడికి ఉన్న టాలెంట్ వారికి లేదు. వాళ్లతో మనకు పోలిక ఎందుకు? ’అని మొహమాటం లేకుండా చెప్పేయండి.

– పరీక్ష ఫెయిల్ ఎందుకు అయ్యావు? దానికి కారణాలేంటిని తల్లిదండ్రులే పిల్లలతో ప్రేమగా అడగాలి. ఇల్లు, కాలేజీ, ఫ్రెండ్స్, హెల్త్ వంటి విషయాల్లో ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించాలి.

– ఒక వేళ మీ పిల్లవాడు ఫెయిలైతే, తనను తీసుకుని మంచి సినిమాకి తీసుకెళ్లి, బయటే భోజనం చేయండి. ‘ఏం కంగారొద్దు.. మళ్లీ కష్టపడుదువుగానీ’ అని చెప్పండి.

– ప్రపంచంలో ప్రతి విద్యార్థీ ప్రత్యేకమైన వాడే. నోబెల్ ప్రైజ్ పొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. నాలుగేళ్ల వయసులో ఉండగా, తన బడిలోని టీచర్లంతా ‘మీ మొద్ద పిల్లాడికి చదువు చెప్పటం మా వల్ల కాదు’ అని తెగేసి చెప్పారు. కానీ, తర్వాత ప్రపంచం అతని పాదాలకు మొక్కిందనే సంగతి తెలిసిందే.

కనుక పెద్దలంతా ఈ ఇంటర్ పరీక్షల ఫలితాల సమయంలో మీ పిల్లలకు అండగా నిలబడాలని కోరుతున్నాను.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News