Big Stories

Political Heat in Venkatagiri: వైసీపీ సిద్దం.. టీడీపీ సంసిద్ధం.. వెంకటగిరిలో గెలుపెవరిది..?

- Advertisement -

తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఇటీవల కాలం వరకు నెల్లూరు జిల్లాలో కొనసాగిన ఆ సెగ్మెంట్ జిల్లాల పునర్విభజనలో తిరుపతి జిల్లాలో కలిసింది. చారిత్రక నేపధ్యంఉన్న ప్రాంతం వెంకటగిరి  వెలుగోటి రాజులు ఏలిన ఈ గడ్డ చేనేత రంగానికి పెట్టింది పేరు … అక్కడి నేత కార్మికులు రూపొందించే వెంకటగిరి చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే ఈ ప్రాంతం భక్తజనంతో పోటెత్తిపోతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న వెంకటగిరిలో ఈ సారి ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి.

- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. టీడీపీకి బలమైన పట్టున్న ఇక్కడ నుంచి ఆ పార్టీ అభ్యర్ధిగా కురుగొండ్ల రామకృష్ణ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కురుగొండ్ల రామకృష్ణపై గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విజయం సాధించారు. ఆనం వైసీపీతో విభేదించి బయటకు రావడంతో ఆయన స్థానంలో నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ సీఎం తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించిన వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించి ఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: ఆయన కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు: చంద్రబాబు

నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి టికెట్ ఫైనల్ అవ్వగానే వైసీపీలో వర్గ పోరు ఎక్కువైంది. నాలుగు వర్గాలు గా పార్టీ నాయకులు చీలిపోయారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉంటూ వైసీపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కలిమిలి రాంప్రసాద్‌రెడ్డికి, రామ్‌కుమార్‌రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది . నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో జూనియర్ నేదురుమల్లి విఫలమయ్యారని కార్యకర్తలకు విలువ లేకుండా చేస్తున్నారని మీడియా సమావేశాలు పెట్టి వ్యతిరేక స్వరం వినిపించారు.

దాంతో రాంప్రసాద్‌రెడ్డిపై రామ్‌కుమార్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కలిమిలి రాంప్రసాద్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసే వరకు వచ్చింది పరిస్థితి నేదురుమల్లికి పార్టీ టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని వెంకటగిరి వైసీపీలోని ఇతర గ్రూపుల నేతలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అల్టిమేటం ఇచ్చారు. దాంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో అందరూ ఒకటైనట్లు కనిపిస్తున్నారు. అయితే ఆయా వర్గాలు గ్రౌండ్ లెవల్లో సహకరించుకోవడం లేదంట.

Also Read: దేవినేని గద్దె నెక్కుతారా? తూర్పులో తోపెవరు?

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించింది. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మిప్రియకు తొలుత పార్టీ టికెట్ కేటాయించినట్లు ప్రకటించింది. దాంతో కురుగొండ్ల లక్ష్మీప్రియ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే వైసీపీలో జరుగుతున్న మార్పులు , కొన్ని రకాల సర్వేల ఆధారంగా టీడీపీ అధిష్టానం కూతుర్తి పక్కనపెట్టి కురుగొండ్ల రామకృష్ణకే పార్టీ బి ఫామ్ అందించింది. ఇంతకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం టీడీపీలో చేరడంతో వైసీపీలో ఉన్న ఆయన వర్గీయులు అనేక మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రామకృష్ణ కు బాగా కలిసి వచ్చిందంటున్నారు.

మొత్తానికి పోలింగ్ గడువు దగ్గరపడుతుండటంతో.. రెండుపార్టీల అభ్యర్ధులు విమర్శలు, ప్రతి విమర్శలను పక్కనపెట్టి ప్రచారంపై ఫోకస్ పెడుతున్నారు.. ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చొరవ చూపిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. నేదురుమల్లి ప్రత్యక్ష ఎన్నికలకు కొత్తే అయినా ప్రచారంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి వెంకటగిరి ఓటర్లు ఈ సారి ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News