Microplastics and heart attack: ఈ మధ్యకాలంలో వయసుతో.. సంబంధం లేకుండా 20, 30 ఏళ్ల యువకులు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి బ్యాడ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే! మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ మన గుండెని సైలెంట్ గా ముంచేస్తోందని సైంటిస్టులు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. మనం తాగే వాటర్ బాటిల్స్ నుంచి తినే ప్లేట్ల వరకు.. ప్లాస్టిక్ వాడకం గుండెపోటు ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో, మెడికల్ హిస్టరీలో జరిగిన ఆ పెద్ద పరిశోధన ఏంటో ఇప్పుడు చూద్దాం.
మన రక్తనాళాల్లో ప్లాస్టిక్ చేరితే ఏం జరుగుతుంది?
ఈ రోజుల్లో ప్లాస్టిక్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ ని వాడుతూనే ఉంటాం. అయితే, ఈ ప్లాస్టిక్ కేవలం పర్యావరణానికే కాదు, మన గుండెకి కూడా పెను ముప్పుగా మారిందని అంతర్జాతీయ వైద్య నిపుణుల పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ మన శరీరంలోకి చేరి గుండెపోటు ముప్పును విపరీతంగా పెంచేస్తున్నాయట.
1. మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి?
ప్లాస్టిక్ వస్తువులు కాలక్రమేణా నలిగిపోయి, విరిగిపోయి కంటికి కనిపించనంత చిన్న చిన్న రేణువులుగా మారతాయి. వీటినే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. మనం ప్లాస్టిక్ బాటిల్స్ లో తాగే నీళ్లు, ప్లాస్టిక్ బాక్సుల్లో వేడి వేడిగా పెట్టుకుని తినే ఫుడ్, చివరకు మైక్రోప్లాస్టిక్స్ తో కలుషితమైన గాలి ద్వారా ఇవి మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. ఒక అంచనా ప్రకారం.. సగటు మనిషి వారానికి ఒక క్రెడిట్ కార్డ్ సైజు అంత ప్లాస్టిక్ ని తెలియకుండానే తింటున్నాడు.
2. రక్తనాళాల్లో ప్లాస్టిక్ ప్లేక్స్:
ఇటీవల గుండె జబ్బులతో బాధపడుతున్న రోగుల రక్తనాళాలపై జరిగిన ఒక పెద్ద స్టడీలో మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలిశాయి. మెడలోని ప్రధాన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్న రోగులను పరీక్షించగా, వారిలో సగానికి పైగా ప్రజల రక్తనాళాల్లో పాలిథిన్, పీవీసీ వంటి ప్లాస్టిక్ రేణువులు పేరుకుపోయి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
3. గుండెపోటు ప్రమాదం:
రక్తనాళాల్లో ఈ మైక్రోప్లాస్టిక్స్ చేరడం వల్ల అక్కడ ఇన్ ఫ్లమేషన్ (వాపు లేదా ఇన్ఫెక్షన్) పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణకు ఆటంకం.. కలిగిస్తుంది. ఎవరి రక్తనాళాల్లో అయితే.. ప్లాస్టిక్ రేణువులు ఎక్కువగా ఉన్నాయో, వారికి రాబోయే కాలంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం లేదా మరణించే ప్రమాదం.. సాధారణ వ్యక్తుల కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
4. ప్లాస్టిక్ కెమికల్స్ లోని డేంజర్ ఏంటి?
ప్లాస్టిక్ తయారీలో వాడే ‘థాలేట్స్’, ‘బిస్ఫినాల్-ఎ’ వంటి హానికరమైన కెమికల్స్ మన హార్మోన్ల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచేసి, బీపీని కంట్రోల్ తప్పేలా చేస్తాయి. దీని వల్ల గుండెపై విపరీతమైన ఒత్తిడి పడి, సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి.
5. ఈ ముప్పు నుంచి గుండెను ఎలా కాపాడుకోవాలి?
ప్లాస్టిక్ ని వంద శాతం దూరం పెట్టడం కష్టమే అయినా, కొన్ని చిన్న మార్పులతో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
గ్లాస్ లేదా స్టీల్ వాడండి: ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని పక్కన పెట్టి రాగి, స్టీల్ లేదా గాజు సీసాలను వాడటం అలవాటు చేసుకోండి.
ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ హీట్ చేయొద్దు: మైక్రోవేవ్ ఓవెన్ లలో ప్లాస్టిక్ బాక్సులను పెట్టి వేడి చేయడం వల్ల కోట్లాది మైక్రోప్లాస్టిక్స్ ఆహారంలో కలుస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ లో వేడి వస్తువులు తినకండి.
ప్యాక్డ్ ఫుడ్స్ తగ్గించండి: ప్లాస్టిక్ కవర్లలో రోజులు, నెలల తరబడి నిల్వ ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ ని వీలైనంత వరకు వాడకండి.