Skincare Supplements: చర్మ సౌందర్యం కోసం వాడే సప్లిమెంట్స్ ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కొల్లాజెన్, విటమిన్-C, బయోటిన్ వంటివి చర్మాన్ని మెరిసేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే.. ఈ సప్లిమెంట్లను ఏ సమయంలో తీసుకోవాలి ? అనే అవగాహన ఉంటేనే అవి శరీరానికి పూర్తిగా అందుతాయి. సప్లిమెంట్ల రకాన్ని బట్టి వాటిని తీసుకునే సరైన సమయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొల్లాజెన్ సప్లిమెంట్స్:
కొల్లాజెన్ చర్మంపై ముడతలు తగ్గించి.. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
సరైన సమయం: చాలా మంది నిపుణులు కొల్లాజెన్‌ను ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలని సూచిస్తారు. దీని వల్ల కడుపులోని ఆమ్లాలు కొల్లాజెన్‌ను త్వరగా విచ్ఛిన్నం చేసి, రక్తంలోకి పంపిస్తాయి.
మరో మార్గం: రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. శరీరం నిద్రలో ఉన్నప్పుడు కణాల పునరుద్ధరణ వేగంగా జరుగుతుంది కాబట్టి, ఆ సమయంలో కొల్లాజెన్ బాగా ఉపయోగపడుతుంది.
2. విటమిన్-C:
ఇది చర్మానికి మెరుపును ఇవ్వడంతో పాటు సూర్యరశ్మి నుంచి రక్షణ కలిగిస్తుంది.
సరైన సమయం: విటమిన్-C ని ఉదయం పూట తీసుకోవడం ఉత్తమం. ఇది రోజంతా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని కాలుష్యం నుంచి కాపాడుతుంది. అయితే.. దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే కొంతమందికి కడుపులో మంట రావచ్చు. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ తర్వాత తీసుకోవడం మంచిది.
3. విటమిన్-E,ఒమేగా-3 :
ఇవి చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయ పడతాయి.
సరైన సమయం: ఇవి కొవ్వులో కరిగే విటమిన్లు. కాబట్టి వీటిని ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత (కొద్దిగా నూనె లేదా కొవ్వు ఉన్న ఆహారంతో కలిపి) తీసుకుంటేనే ఇవి శరీరానికి సరిగ్గా శోషించబడతాయి.
4. బయోటిన్ , విటమిన్-B:
జుట్టు, చర్మం ఆరోగ్యానికి ఇవి అవసరం.
సరైన సమయం: విటమిన్-B కాంప్లెక్స్ శరీరానికి శక్తిని ఇస్తుంది. అందుకే వీటిని ఉదయం పూట తీసుకోవాలి. రాత్రిపూట తీసుకుంటే మెదడు చురుగ్గా మారి నిద్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
Also Read: చేపలు తింటే బోలెడు ప్రయోజనాలు.. వీటి గురించి మీకు అస్సలు తెలియదు
మరికొన్ని ముఖ్యమైన నియమాలు:
క్రమబద్ధత : సప్లిమెంట్లను ఒక రోజు ఒక సమయంలో.. మరో రోజు మరో సమయంలో కాకుండా.. ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగాలి: సప్లిమెంట్లు తీసుకున్నప్పుడు కిడ్నీలపై భారం పడకుండా ఉండాలంటే రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
కాఫీ/టీలకు దూరం: సప్లిమెంట్లు తీసుకున్న వెంటనే కాఫీ లేదా టీ తాగకూడదు. ఇందులోని కెఫీన్ పోషకాల శోషణను అడ్డుకుంటుంది. కనీసం గంట విరామం ఉండాలి.
సప్లిమెంట్లు అనేవి కేవలం అదనపు పోషణ మాత్రమే. సమతుల్య ఆహారం, మంచి నిద్ర, సరైన జీవనశైలితో పాటు వీటిని వాడితేనే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా.. ఏదైనా సప్లిమెంట్ ప్రారంభించే ముందు డెర్మటాలజిస్టును సంప్రదించడం చాలా ముఖ్యం.