Dhurandhar 2:ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh)ప్రధాన పాత్రలో గూఢచారిగా నటించిన చిత్రం ధురంధర్ 2 : ది రివేంజ్. ఆదిత్యధర్ (Adityadhar) దర్శకత్వంలో సారా అర్జున్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది . సాధారణంగా వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం వసూళ్లు ఘననీయంగా తగ్గడం సహజమే. కానీ ఈ చిత్రం మాత్రం ఆ ట్రెండ్ తిరగరాసి తన దూకుడును కొనసాగిస్తోంది. ముఖ్యంగా విడుదలైన ఐదు రోజుల్లోనే ఊహించని కలెక్షన్లు వసూలు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, KGF 2, పుష్ప2 రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లోనే రూ. 829.76 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఒక్క ఇండియాలో మాత్రమే ఐదు రోజుల్లో 519.12 కోట్ల నెట్ (619.76 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం. అంటే మొదటి సోమవారమైన ఐదవ రోజు ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇక మొత్తానికి అయితే బాక్స్ ఆఫీస్ పై ధురంధర్ 2 దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లో రూ.430 కోట్ల నెట్ వసూలు చేసి పుష్ప 2 హిందీ వర్షన్ రికార్డును బ్రేక్ చేసింది. గతంలో పుష్ప 2 చిత్రం హిందీ వర్షన్ లో నాలుగు రోజుల్లో రూ.425.10 కోట్లు రాబట్టగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది ధురంధర్. ఇక ఐదు రోజుల్లోనే ఈ సినిమా ఇప్పుడు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఒకవేళ ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే కచ్చితంగా ఈ సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం..
ALSO READ:Dhurandhar 2: ధురంధర్2కి తమిళనాడులో భారీ షాక్.. కోర్టులో కేసు!
ఈ సినిమా దేశీయంగానే కాకుండా అటు విదేశాలలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే 210 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అటు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 829.76 కోట్లకు చేరుకోవడం ఈ సినిమాను గ్లోబల్ హిట్గా నిలబెడుతోంది అని చెప్పవచ్చు. ఈ దూకుడుతో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ , యష్ నటించిన కేజిఎఫ్ చాప్టర్ 3 అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాల బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది. కరాచీలోని నేర సామ్రాజ్యం, రాజకీయ వ్యవస్థలోకి చొరబడే భారతీయ గూడచారి ఆపరేషన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. 2008లో ముంబై అటాక్స్ తర్వాత జరిగిన పరిణామాలను కథలో ప్రతిబింబిస్తూ దేశ భద్రత కోసం హీరో చేసే పోరాటాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు ఆదిత్యధర్.