Wi-Fi Signals Tracking: మనం ఇంట్లో ఇంటర్నెట్ వాడుకోవడానికి వైఫై రూటర్‌ను ఒక సాధనంగా మాత్రమే చూస్తాం. కానీ, భవిష్యత్తులో ఈ వైఫై సిగ్నల్స్ మనల్ని నిరంతరం గమనించే నిఘా నేత్రాలుగా మారే ప్రమాదం ఉందని జర్మనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనం చేతిలో ఫోన్ గానీ, ఎలాంటి స్మార్ట్ డివైజ్ గానీ పట్టుకోకపోయినా, ఇంట్లో మనం ఎక్కడున్నామో కనిపెట్టే సరికొత్త సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
జర్మనీలోని కార్ల్స్‌రూహే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు BFId (బీమ్‌ఫార్మింగ్ ఫీడ్‌బ్యాక్ ఇన్ఫర్మేషన్) అనే సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇది సాధారణ వైఫై సిగ్నల్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా మెషిన్ లెర్నింగ్‌ను జోడించి పనిచేస్తుంది. మన ఇంట్లో తిరిగే వ్యక్తులను, వారి కదలికలను బట్టి వారు ఎవరనేది ఇది ఖచ్చితంగా గుర్తించగలదు.
మనం రూమ్‌లో నడుస్తున్నప్పుడు మన శరీరం వల్ల వైఫై రేడియో తరంగాలలో కొన్ని మార్పులు వస్తాయి. ప్రతి మనిషి శారీరక ఆకృతి, ఎత్తు, నడిచే శైలి వేర్వేరుగా ఉంటాయి. ఈ మార్పులను BFId టెక్నాలజీ ఒక సిగ్నేచర్‌లా రికార్డ్ చేసుకుంటుంది. దీని ఆధారంగా ఇంట్లో ఉన్నది ఎవరో పక్కాగా ఈ సిస్టమ్ చెప్పగలదని పరిశోధకులు నిరూపించారు.
Also Read: ఫోల్డబుల్ ఫోన్ల రికార్డ్ బ్రేక్.. ఏకంగా 7000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వస్తోన్న Vivo X Fold 6!
సాధారణంగా సీసీటీవీ కెమెరాలు ఉంటే అవి ఉన్న దిశలోనే రికార్డ్ చేయగలవు. పైగా వాటిని మనం చూసి గుర్తుపట్టవచ్చు. కానీ వైఫై తరంగాలు గోడలను దాటుకుని కూడా ప్రసరిస్తాయి. దీనివల్ల కెమెరాలు లేని బెడ్‌రూమ్స్, బాత్‌రూమ్స్ వంటి అత్యంత వ్యక్తిగత ప్రదేశాలలో కూడా మన కదలికలను ఇతరులు పసిగట్టే ప్రమాదం ఉంది. హాకర్ల చేతికి ఈ టెక్నాలజీ చిక్కితే మన ప్రైవసీ పూర్తిగా ప్రమాదంలో పడుతుంది.
ప్రస్తుతానికి మనమంతా వాడుతున్న వైఫై రూటర్‌ల వలన ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే.. ఇది ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. అయితే, రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఇప్పుడే కఠినమైన నిబంధనలు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతికత పెరగడం మంచిదే కానీ, అది మన వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉండకూడదు కదా.
Also Read: కనీ వినీ ఎరుగని ఆఫర్.. 70 రోజుల పాటు రోజూ 3GB డేటా.. BSNL కొత్త ప్లాన్ చూశారా?