Revanth Reddy : రేవంత్ రెడ్డి పనైపోయిందన్నారు. పీసీసీ చీఫ్ పోస్టు ఫసక్ అంటూ ప్రచారం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతుందని ఊదరగొట్టారు. సీనియర్లు హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణ. వెంకట్ రెడ్డి వెన్నుపోటు పొడిచారనే విమర్శ. అంతా సహాయ నిరాకరణ, రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం.. దీంతో మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి ఓడిపోయింది. ఇక, రేవంత్ పని ఖతం అనుకున్నారు కొందరు. కానీ, సీన్ రివర్స్. మునుగోడులో కాంగ్రెస్ ఓడినా రేవంత్ ప్రాధాన్యం అసలేమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. డౌట్ ఉంటే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ఓ లుక్ వేయండని చెబుతున్నారు.
ఆరో తేదీన మునుగోడు ఫలితం వచ్చింది. అదే రోజు రాహుల్ గాంధీ వెంటే ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కూడా భారత్ జోడో యాత్రలో యధావిధిగా పాల్గొన్నారు. రేవంత్ ముఖంలో ఏమాత్రం నిరుత్సాహం కనిపించలేదు. రాహుల్ తో ఆయన సాన్నిహిత్యం తగ్గినట్టు లేదు. అదే జోరు.. అదే హోరు.
ఏం జరిగి ఉంటుంది? మునుగోడులో కాంగ్రెస్ ఓడినా రాహుల్ దగ్గర రేవంత్ ప్రయారిటీ ఎందుకు తగ్గలేదు.. అంటూ తెగ ఇదైపోతున్నారట కొందరు సీనియర్లు. ఫలితాలపై రాహుల్ గాంధీకి ఫూర్తి స్థాయిలో అవగాహన కల్పించారట పీసీసీ చీఫ్. అధికార పార్టీ ఆగడాలు, బీజేపీ ధన ప్రవాహంతో పాటు కాంగ్రెస్ లో జరిగిన కుట్రలన్నీ రాహుల్ గాంధీకి వివరించారట రేవంత్ రెడ్డి. తాను ఆర్థికంగా బలమైన కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరితే.. సీనియర్లు రంగంలోకి దిగి స్రవంతికి టికెట్ ఇప్పించిన విధానం.. తీరా ప్రచార సమయంలో ముఖం చాటేసిన వైనం.. వెంకట్ రెడ్డి ఫోన్ కాల్.. ఇలా మునుగోడు రాజకీయం మొత్తాన్ని రాహుల్ ముందుంచారట రేవంత్ రెడ్డి. అన్నీ విన్న రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి వివరణతో సంతృప్తి చెందారని.. గో అహెడ్ అంటూ ప్రోత్సహించారని.. అందుకే మునుగోడులో ఓడినా రేవంత్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి పీసీసీ ఛీఫ్ అయ్యాక.. హుజురాబాద్ బైపోల్ లో కాంగ్రెస్ ఓడిపోయింది. మునుగోడులో సిట్టింగ్ సీటు కోల్పోయింది. హుజురాబాద్ లో కాంగ్రెస్ ఓడి, టీఆర్ఎస్ ను ఓడించిందన్నారు. మునుగోడు ఓటమి మాత్రం హస్తం పార్టీకి చేదు అనుభవమే అయినా.. అక్కడున్న ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల, పార్టీ అంతర్గత కారణాల వల్ల ఓడిపోయామనే భావన వ్యక్తమవుతోంది. అందుకే, ఓడినా రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర పెద్దగా డ్యామేజీ జరగలేదని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.