Big Stories

Ambati Rambabu: అంబటి తో అల్లుడు ఫైట్.! ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Son-In-law Gautam Fight With Ambati(AP latest news): పోలింగ్ గడువు ముంచుకొస్తున్న టైంలో సత్తెనపల్లి వైసీపీ అభ్యర్ధి, మంత్రి అంబటి రాంబాబుపై బాంబు పేల్చారు ఆయన అల్లుడు. పార్టీలో తీవ్రస్థాయికి చేరిన అసంతృప్తికి తోడు టీడీపీ నుంచి బలమైన అభ్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణను ఢీకొనడానికి ఆపసోపాలు పడుతున్న అంబటికి  కూతురి భర్తే షాక్ ఇచ్చారు. అంబటిలాంటి వ్యక్తికి అల్లుడు కావడం తన దురదృష్టమని అని వ్యాఖ్యానించారు డాక్టర్ గౌతమ్ .. అంబటి వంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఉండడని  అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన అంబటి ఇదంతా పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్రని ఆరోపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నీచుడు, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఓటేయవద్దని మంత్రి రెండో అల్లుడు, డాక్టర్‌ జి.గౌతమ్‌ ఓటర్లకు పిలపునిచ్చారు. ఆ మేరకు ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి అల్లుడు కావడం తన దురదృష్టమని గౌతమ్‌ అందులో పేర్కొన్నారు. రోజూ తాను దేవుడికి దండం పెట్టుకునే సమయంలో ఇలాంటి వ్యక్తిని మళ్లీ తన జీవితంలోకి తీసుకురావద్దని వేడుకుంటున్నానని, అంతటి భయంకరమైన వ్యక్తి అంబటి రాంబాబు అని ఆందోళన వ్యక్తం చేశారు. అంబటి లాంటి వ్యక్తికి ఓటేస్తే ఇదే సమాజం తలరాతగా మారి.. రేపటి సమాజం దిగజారి పోయే ప్రమాదముందని హెచ్చరించారు.

- Advertisement -

Also Read: కాపు రాజకీయం.. ముద్రగడ vs మెగా ఫ్యామలీ

సత్తెనపల్లిలో మరోసారి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని ప్రకటించిన వైసీపీ స్థానికసంస్థల ప్రతినిధులు పలువురు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. పేదలకు వచ్చిన ఎక్స్‌గ్రేషియా చెక్కులు కమీషన్ల కోసం తొక్కిపట్టడం. మహిళలను వేధించిన ఫోన్ కాల్స్ లీక్ అవ్వడం వంటి వివాదాల్లో ఇప్పటికే కూరుకుపోయి ఉన్నారు అంబటి. దాంతో అంబటికి ఈ సారి టికెట్ దక్కదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

అయితే విపక్షాలను టార్గెట్ చేయడంలో ముందుండే అంబటికి.. అదే ప్లస్ అయింది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం కార్డుని అడ్డం పెట్టుకుని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై పదేపదే ధ్వజమెత్తుతుంటారు అంబటి ఆ క్రమంలో సత్తెనపల్లిలో అంబటిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు జనసేనాని ఆ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా అంబటి అల్లుడు గౌతమ్ రిలీజ్ చేసిన వీడియోపై స్పందించిన పవన్ .. సొంత అల్లుడే ఓటు వేయవద్దని చెప్పాడంటే అంబటి ఎలాంటి వ్యక్తో అర్థమవుతుందని విమర్శించారు. అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి పోటీ చేస్తున్న పొన్నూరులో మాట్లాడిన పవన్ .. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన అల్లుడి వీడియో రిలీజ్ అయినప్పుడు స్పందించడానికి నిరాకరించిన అంబటి .. పవన్ దాని గురించి ప్రస్తావించగానే మీడియా ముందుకొచ్చేశారు. మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్విందని వెనకటికెవరో ఫీలయ్యారంట. అలా అసలు తన అల్లుడ్ని రెచ్చకొట్టిందే పవన్ అని విరుచుకుపడుతున్నారు అంబంటి .. గౌతమ్‌ను రెచ్చగొట్టి వీడియో రికార్డు చేయించారని ఎన్నికల సమయంలో ఫోకస్‌ను మార్చేందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ కలిసికట్టుగా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.. తన రెండో కుమార్తె డాక్టర్‌ మనోజ్ఞ, అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ మధ్య విభేదాలు ఉన్నాయంటున్న ఆయన .. గౌతమ్‌ వ్యాఖ్యలపై స్పందించే వాడిని కాదని. కానీ పొన్నూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో స్పందించాల్సి వచ్చిందని పేర్కొనడం గమనార్హం.

Also Read: సొంత బంధువులే శత్రువులు.. డిప్యూటీలా ఫ్రస్టేషన్

డాక్టర్ అల్లుడు అంత ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇస్తే అదంతా విపక్షాల కుట్ర అంటున్న రాంబాబు కుటుంబ వివాదాలను రాజకీయం చేయడం కరెక్ట్ కాదంటున్నారు. అంతటితో ఆగకుండా ఎవరి కుటుంబంలో వివాదాలు లేవంటూ మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబుల కుమార్తెల గురించి ప్రస్తావించారు.

తన కూతురు, అల్లుడు ఇప్పుడుకాకపోయినా రెండేళ్ల తర్వాతైనా కలిసిపోతారంటున్న అంబటి ఫ్యామిలీ ఇష్యూస్‌పై పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదని హితోపదేశం చేశారు. మరంటాయన అసలు ఈ ఇష్యూతో సంబంధం లేని చిరంజీవి ఫ్యామిలీ గురించి మాట్లాడం ఏంటని జనసైనికులు, మెగా ఫ్యాన్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే అల్లుడి వీడియోతో ట్రోల్ అవుతున్న అంబటి.. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్‌కి ఒక రేంజ్లో టార్గెట్ అవుతున్నారు. మొత్తానికి పోలింగ్‌కి ముందు అమాత్యుడికి పెద్ద కష్టమే వచ్చినట్లు కనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News