Big Stories

Ponnur Assembly constituency: పొన్నూరు లో పవర్ దక్కించుకునేదేవరు..?

Ponnur Assembly constituency(AP news today telugu): ఆ నియోజకవర్గంలో ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి అయిదు సార్లు వరుస విజయాలు సాధించారు. అక్కడ ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే.. మూడు దశాబ్దాలుగా అక్కడ సొంత పార్టీలో ఎలాంటి వ్యతిరేకతా లేకుండాఆయన మాటే చెల్లుబాటవుతూ వస్తుంది. చిత్రమేంటంటే ఆయనపై పోటీ చేసే అభ్యర్ధులు మాత్రం ప్రతిఎన్నికలకీ మారిపోతుంటారు. ఇన్నేళ్లలో ఆయన్ని ఒక్కసారి ఓడించగలిగిన సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చేసింది ప్రత్యర్ధి పార్టీ.. ఇంతకీ ఎవరా లీడర్?

- Advertisement -

పొన్నూరు నియోజకవర్గం.. గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. బాపట్ల, తెనాలి, గుంటూరు నియోజకవర్గాల మధ్యలో ఉడే పొన్నూరు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ.. ఈ నియోజకవర్గంలో 1994 నుంచి టీడీపీ అభ్యర్ధిగా సంగం డెయిరీ చైర్మన్ ధూళ్లిపాళ్ల నరేంద్రే పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏడో సారి పోటీలో ఉన్న నరేంద్ర  గత ఎన్నికల్లో ఒక్కసారే పరాజయం పాలయ్యారు. 1994 నుంచి వరుసగా అయిదు సార్లు గెలుస్తూ వచ్చిన ఆయన డబుల్ హ్యాట్రిక్ విజయానికి 2019లో బ్రేక్ పడింది.

- Advertisement -

నాలుగు సార్లు కాంగ్రెస్‌పై, ఒకసారి వైసీపీపై విజయం సాధించిన ధూళ్లిపాళ్ల నరేంద్రపై ప్రతిసారి ప్రత్యర్ధి మారుతూనే ఉన్నారు. ప్రత్యర్ధి పార్టీలు నరేంద్ర స్థాయి బలమైన నేత దొరక్క ప్రతి ఎన్నికల్లో కొత్త ముఖంతో ప్రయోగం చేస్తున్నాయి. పొన్నూరులో అంత బలమైన పునాదులు ఏర్పరుచుకుంది ధూళ్లిపాళ్ల కుటుంబం. టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలోకి వచ్చిన నరేంద్ర తండ్రి ధూళ్లిపాళ్ల వీరయ్యచౌదరి 1983, 85 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 1989లో పరాజయం పాలైన ఆయన తర్వాత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

Also Read: అంబటి తో అల్లుడు ఫైట్.! ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

1994 ఎన్నికల నాటికి నరేంద్ర తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన టి. వెంకటరామయ్యపై దాదాపు 20 వేల మెజార్టీతో గెలుపొందారు. 1999 నాటికి ప్రత్యర్ధి మారిపోయారు .. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన చిట్టినేని ప్రతాప్‌బాబుని ధూళిపాళ్ల 15 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. 2004లో కాంగ్రెస్ నుంచి మన్నవ రాజకిషోర్, 2009లో మారుపూడి లీలాధరరావు, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన రావి వెంకట రమణలు నరేంద్ర చేతిలో పరాజయం మూటగట్టుకున్నారు.

గత ఎన్నికల్లో మొట్టమొదటి సారి నరేంద్రకు ఓటమి ఎదురైంది. వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ కేంద్రమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి వెంకట రోశయ్య అనూహ్య విజయం సాధించారు. ఏడు వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన రోశయ్యకు పొన్నూరులో సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు జగన్.. రోశయ్య ఈ సారి గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా షిఫ్ట్ అయ్యారు. రోశయ్య స్థానంలో మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీని పొన్నూరుకు ఇంపోర్ట్ చేసింది వైసీపీ ..వరుసగా అయిదో సారి విజయం సాధించిన ధూళిపాళ్ల నరేంద్రకు 2014లో కూడా కేబినెట్ బెర్త్ దక్కలేదు. కమ్మ సామాజికవర్గం ఈక్వేషన్లు ఆయనకు అడ్డం పడుతూ వచ్చాయి .. అయితే ఈసారి ఆ లోటు కూడా తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నారాయన.. పొన్నూరు నుంచి ఆరో సారి గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మరి చూడాలి ఈ సారి ధూళిపాళ్ల లక్ ఎలా ఉంటుందో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News