Dasara Festival: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చివరి రోజు జగన్మాత కనక దుర్గమ్మ.. శ్రీరాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల ముగింపు వేడుకల నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. చివరి రోజు కనక దుర్గమ్మ అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్సవాలు ముగింపు వేళ వేడుకలకు ఇంద్రకీలాద్రిపై భారీ ఏర్పాటు చేశారు అధికారులు.
నవరాత్రుల సందర్భంగా ఉదయం 10.30 గంటలకు జరిగే మహా పూర్ణాహుతితో ముగియనుంది. వేద పండితులు అమ్మవారికి మహా నివేదన సమర్పిస్తారు. ఇంద్రకీలాద్రిపై సంప్రదాయబద్దంగా పంచహఆరతుల నిర్వహణ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
సాయంత్రం 3.45 గంటలకు ఆది దంపతుల నగర ఉత్సవం ప్రారంభమై కృష్ణానది తీరానికి చేరుకోనుంది. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య కృష్ణానదిలో విద్యుద్దీపాలతో అలంకరించిన హంసవాహనంపై అమ్మవారు దివ్య తెప్పోత్సవం కనుల పండువగా జరగనుంది. తెప్పోత్సవం తర్వాత ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు తర్వాత తిరిగి కొండపైకి తీసుకు వస్తారు. అక్కడితో బెజవాడ దసరా నవరాత్రుల ఉత్సవాలు ముగుస్తాయి.
ALSO READ: రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
శరన్నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించిన తర్వాత వచ్చే పవిత్ర పర్వదినం విజయదశమి. చెడుపై మంచి విజయం సాధించిన ప్రతీకగా భావించే రోజు. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ.. శ్రీ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఇహపర సౌఖ్యాలు, సిరిసంపదలు, విజయాలు కలుగుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.