Petrol Pump: వాహనదారులు చాలా మంది పెట్రోల్ బంకు కేవలం పెట్రోల్, డీజిల్ ఇవ్వడానికి మాత్రమే ఉన్నాయని భావిస్తుంటారు. కానీ వాహనదారులకు పెట్రోల్ బంకుల వద్ద కొన్ని ప్రత్యేకమైన హక్కులను కేంద్రం కల్పించింది. ముఖ్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిబంధనల ప్రకారం.. ప్రతీ పెట్రోల్ పంప్‌లో 6 సేవలను ఉచితంగా అందించాలి. ఒకవేళ వీటి కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు సైతం చేసే అవకాశాన్ని కల్పించారు. ఇంతకీ ఆ సేవలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వాహనాల టైర్లలో గాలి నింపే సదుపాయం ప్రతి బంకులోనూ ఉచితంగా అందించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని సైతం పెట్రోల్ బంకులు కేటాయించాల్సి ఉంటుంది. గాలి కొట్టిన తర్వాత బంక్ సిబ్బంది డబ్బు అడిగితే అది చట్ట విరుద్దం.
పెట్రోల్ బంకుకు వచ్చే వాహనదారుల కోసం శుద్ధి చేసిన, స్వచ్ఛమైన తాగునీటి అందుబాటులో ఉంచాలి. లేదంటే ఆయిల్ కంపెనీ నిబంధనలను ఉల్లఘించినట్లు అవుతుంది. కాబట్టి దారి మధ్యలో దాహం వేసినప్పుడు పెట్రోల్ బంకులో తాగునీటిని పొందొచ్చు. .
వాహనదారులు.. అత్యవసర సమయాల్లో బంకుల్లోని టాయిలెట్లను ఉచితంగా వాడుకోవచ్చు. ఇందుకు వీలుగా పెట్రోల్ బంకు నిర్వాహకులు శుభ్రంగా వాష్ రూమ్ లను మెయిన్ టెన్ చేయాల్సి ఉంటుంది. మీరు పెట్రోల్ బంకులో ఇంధనం కొనకపోయినా.. ఈ టాయిలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
ప్రయాణాల్లో ప్రమాదాలు లేదా గాయాలైనప్పుడు ప్రథమ చికిత్స కోసం ప్రతి బంకులో మెడిసిన్స్, పట్టీలతో కూడిన అప్‌డేటెడ్ ‘ఫస్ట్ ఎయిడ్ కిట్’ సిద్ధంగా ఉండాలి.
మీ ఫోన్ పనిచేయనప్పుడు లేదా ప్రమాద సమయాల్లో బంకులోని ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ ద్వారా ఒక ఉచిత కాల్ చేసుకునే హక్కు మీకు ఉంటుంది.
మీరు కొనే పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యతపై అనుమానం ఉంటే ఉచితంగా ‘ఫిల్టర్ పేపర్ టెస్ట్’ చేయమని అడగవచ్చు. అలాగే పరిమాణాన్ని చెక్ చేయడానికి 5 లీటర్ల సర్టిఫైడ్ జార్‌ను ఇవ్వాలని మీరు డిమాండ్ చేయవచ్చు. ఇందుకు పెట్రోల్ బంక్ సిబ్బంది నిరాకరిస్తే చట్టరిత్యా నేరంగా భావించి వారిపై ఫిర్యాదు సైతం చేయవచ్చు.
Also Read: ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 5 రంగులు వేస్తే.. ఇల్లు ఊటీ అయిపోద్ది!
పైన పేర్కొన్న 6 ఉచిత సేవలను బంక్ సిబ్బంది నిరాకరించినా, డబ్బు డిమాండ్ చేసినా సదరు ఆయిల్ కంపెనీ (IOCL, HPCL, BPCL) టోల్ ఫ్రీ నంబర్లకు లేదా కేంద్ర ప్రభుత్వ ‘PGPortal’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు పెట్రోల్ బంక్ లైసెన్స్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది.
Also Read: హోటల్స్‌లో బస చేస్తున్నారా? సీక్రెట్ కెమెరాలను కనిపెట్టే.. 5 సులువైన ట్రిక్స్!