Free Android Auto Apps: ఇప్పటివరకు కారు నడుపుతున్నప్పుడు ఏదైనా లొకేషన్/మ్యాప్ కోసం పదే పదే ఫోన్ వైపు చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు Android Auto రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న మ్యాప్స్, మ్యూజిక్, కాల్స్, వాయిస్ అసిస్టెంట్ లాంటి ఫీచర్లు నేరుగా కార్ ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. ఫోన్ చేతిలో పట్టుకోకుండానే అవసరమైన పనులన్నీ చేసుకునే అవకాశం కల్పించడం, డ్రైవింగ్ సమయంలో దృష్టి మరలకుండా చూడటమే Android Auto ప్రధాన ఉద్దేశం.
ఇప్పటికే Google Assistantతో చాలా పనులు వాయిస్ ద్వారా చేయగలుగుతున్నాం. ఇక Gemini AI చేరడంతో ఈ అనుభవం మరింత ఇంటెలిజెంట్‌గా మారింది. అయితే ఆండ్రాయిడ్ ఆటో ఎంత ఉపయోగకరంగా ఉంటుందన్నది.. మనం కారులో ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మీ కారులో తప్పక ఉండాల్సిన కొన్ని బెస్ట్ యాప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
డ్రైవ్ చేస్తూ పాడ్‌కాస్ట్‌లు వినడానికి ఇష్టపడే వారి కోసం AntennaPod ఒక అద్భుతమైన యాప్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఉచిత, ప్రీమియం పాడ్‌కాస్ట్‌లను ఒకే చోట అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో స్క్రీన్‌పై సింపుల్ డిజైన్‌తో ప్లే, పాజ్, క్యూ వంటి ఆప్షన్లు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా యాడ్స్ లేకుండా, ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చే ఈ ఓపెన్ సోర్స్ యాప్ లాంగ్ డ్రైవ్‌లను బోర్ లేకుండా చేస్తుంది.
మీ వాహనం ఎంత ఇంధనం ఖర్చు చేస్తోంది, మైలేజ్ ఎలా ఉంది, ట్రిప్‌కు ఎంత ఖర్చయ్యింది అన్న వివరాలన్నీ తెలుసుకోవాలంటే Fuelio చక్కటి ఎంపిక. ఇది పెట్రోల్, డీజిల్ వాహనాలకే కాదు, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా సపోర్ట్ ఇస్తుంది. దగ్గర్లో ఉన్న ఫ్యూయల్ స్టేషన్లు, రిఫ్యూయలింగ్ లాగ్స్ వంటి వివరాలు కార్ స్క్రీన్‌పైనే చూపిస్తుంది.
ఎలక్ట్రిక్ కార్ వాడేవారికి PlugShare నిజంగా లైఫ్‌సేవర్. ప్రయాణంలో బ్యాటరీ తగ్గితే సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్లను వెంటనే చూపిస్తుంది. ట్రిప్ ప్లానింగ్, ఇతర యూజర్ల రివ్యూస్, ఫోటోల ద్వారా ఛార్జర్ పనిచేస్తుందా లేదా అన్నది ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
పెద్ద నగరాల్లో డ్రైవింగ్ కంటే.. పార్కింగే ప్రధాన సమస్య. SpotHero యాప్ ఈ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. అందుబాటులో ఉన్న పార్కింగ్ స్పేస్‌లను చూపించి, మీరు రిజర్వ్ చేసుకున్న పార్కింగ్‌కు సులభంగా నావిగేట్ చేయడంలో ఆండ్రాయిడ్ ఆటో ఎంతగానో సహాయపడుతుంది.
లైవ్ రేడియో, న్యూస్, పాడ్‌కాస్ట్‌లు అన్నీ ఒకే యాప్‌లో కావాలంటే.. TuneIn Radio బెస్ట్ ఆప్షన్. సింపుల్ మెనూలు, వాయిస్ కంట్రోల్స్‌తో డ్రైవ్ చేస్తూనే ఎంటర్‌టైన్‌మెంట్, అప్డేట్స్ రెండింటినీ అందిస్తుంది. మొత్తానికి ఈ యాప్స్ ఆండ్రాయిడ్ ఆటో అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, స్మార్ట్‌గా మార్చుకోవాలంటే ఇవి మీ కారులో తప్పకుండా ఉండాల్సిందే.