Hindupur Crime: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, బిడ్డ గంటల వ్యవధిలోనే అనంతలోకాలకు వెళ్లడం స్థానికులను కలచివేసింది. మృత్యువులోనూ ఆ తల్లిబిడ్డలను విడదీయలేని బంధం వెంటాడినట్లుగా జరిగింది ఈ విషాద ఘటన.
హిందూపురంలోని బసనపల్లి ఆటోనగర్‌కు చెందిన ఖలీమ్, నజ్మా దంపతులు తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నందుకు ఎంతో ఆశగా ఎదురుచూశారు. గర్భిణీ అయిన నజ్మా ప్రసవం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆమె ఒక అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ప్రసవం తర్వాత నజ్మా ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆమెను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాణాలతో పోరాడుతూ నజ్మా నిన్న కన్నుమూశారు.
తల్లి మరణంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. కనీసం పుట్టిన బిడ్డనైనా చూసుకోకుండానే నజ్మా వెళ్లిపోవడం అందరినీ కన్నీరు పెట్టించింది. నజ్మా మృతదేహాన్ని, ఆమె పసికందును తీసుకుని కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తిరిగి హిందూపురానికి బయలుదేరారు. కానీ.. విధి మరో రూపంలో వారిని వెంటాడింది. నేడు ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా రహదారిపై అలుముకున్న చీకటిలో అంబులెన్స్ డ్రైవర్‌కు ముందు వెళ్తున్న వాహనాలు సరిగ్గా కనిపించలేదు.
వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో.. నిన్ననే పుట్టిన ఆ పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లి మరణించిన 24 గంటలు గడవక ముందే.. అక్కున చేర్చుకోవాల్సిన తల్లి చెంతకే ఆ చిన్నారి కూడా చేరిపోయింది. గంటల వ్యవధిలో తల్లిని, బిడ్డను కోల్పోయిన ఖలీమ్ కుటుంబం పడుతున్న వేదన వర్ణనాతీతం. ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు ఉండటంతో బసనపల్లి ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృత్యువులోనూ విడిపోని ఆ తల్లిబిడ్డల బంధం చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ALSO READ: NTR District: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన దోమల కాయిల్