Honda Unveils 10 New Two-Wheelers: ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌పై హోండా ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో ఆగంగానే తాజాగా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఒకేసారి 10 కొత్త టూ వీలర్స్ ను పరిచయం చేసింది. ఈ కొత్త లైనప్ లో పెట్రోల్, ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన మోడళ్లు ఉన్నాయి. భారత మార్కెట్ లో భిన్న అవసరాలు ఉన్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
హోండా తీసుకొచ్చిన ఈ కొత్త శ్రేణిలో అడ్వెంచర్ బైక్‌లు, ప్రీమియం మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని ప్రముఖ మోడళ్లకు అప్ డేటెడ్ వెర్షన్లు కూడా ఉన్నాయి. కొత్తగా ప్రకటించిన మోడళ్లలో XR300L, XR300 Rally, CB500, Rebel 300 e-Clutch, Rebel 500 e-Clutch, ADV160, QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు అప్‌డేటెడ్ CB350, CB350RS, CB350C మోడల్స్ ఉన్నాయి. ముఖ్యంగా CB350C మోడల్ ను కొత్త రంగులతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు హోండా వెల్లడించింది.
ఈ లైనప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ADV160 స్కూటర్. ఇండియాలో E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ కు అనుకూలంగా రూపొందించిన తొలి 160 సీసీ స్కూటర్ గా కంపెనీ ప్రకటించింది. ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మోడల్‌ను తీసుకొస్తోంది. అంతేకాదు, పర్యావరణహిత రవాణాకు ప్రాధాన్యం ఇస్తూ QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా పరిచయం చేసింది.
ఇక మోటార్ సైకిళ్లలో Rebel 300 e-Clutch, Rebel 500 e-Clutch మోడళ్లు ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయి. ఈ బైక్ లలో క్లచ్ వినియోగాన్ని మరింత సులభతరం చేసే ఆధునిక e-Clutch సాంకేతికతను అందిస్తున్నారు. దీని ద్వారా సిటీ ట్రాఫిక్ లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.
ఈ కొత్త మోడల్స్ ద్వారా ప్రీమియం బైక్స్ సెగ్మెంట్ లో మరింత సత్తా చాటడమే లక్ష్యంగా హోండా కంపెనీ ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీల్లో కూడా తన ప్రాధాన్యాన్ని పెంచాలని భావిస్తోంది. రాబోయే రోజుల్లో భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అత్యాధునిక టూ వీలర్స్ ను కూడా తీసుకురానున్నట్లు కంపెనీ సంకేతాలు ఇచ్చింది. తాజాగా 10 మోడళ్లను మాత్రమే అధికారికంగా ప్రకటించారు. వీటి ధరలు, పూర్తి ఫీచర్లు, బుకింగ్ ప్రారంభ తేదీలు, మార్కెట్లో విడుదల చేసే సమయంపై హోండా ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దశలవారీగా అన్ని వివరాలను వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది.
Read Also: హోండా మాస్టర్ స్ట్రోక్.. భారత్ లో తొలి E85 మ్యాక్సీ స్కూటర్ లాంచ్!