E-Paper
Advertisement

Greenland War: గ్రీన్‌లాండ్ జోలికొస్తే కాల్చిపడేస్తాం.. డెన్మార్క్ Vs ట్రంప్

Greenland War: గ్రీన్‌లాండ్ జోలికొస్తే కాల్చిపడేస్తాం.. డెన్మార్క్ Vs ట్రంప్

Greenland War: గ్రీన్‌లాండ్ మాదే.. అక్కడ అడుగుపెడితే అమెరికా అయినా సరే.. కాల్చిపడేస్తాం! తర్వాత సంగతి తర్వాత అంటోంది డెన్మార్క్. అసలు.. అవతల ఉన్నది అగ్రరాజ్యమని తెలిసినా.. డెన్మార్క్ ఇంత మాస్ వార్నింగ్ ఎలా ఇవ్వగలిగింది. యూఎస్ అంటే.. అస్సలు లెక్క లేదా? హెచ్చరించడం దాకా ఓకే.. అమెరికాని ఎదుర్కొనేదెలా? గ్రీన్‌లాండ్ విషయంలో డెన్మార్క్ ధైర్యమేంటి?

గ్రీన్‌లాండ్ పైన కన్నేస్తే యుద్ధం తప్పదు.. డెన్మార్క్

అమెరికా గనక గ్రీన్‌లాండ్‌ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే.. ముందుగా కాల్పులు జరుపుతామని డెన్మార్క్ హెచ్చరిస్తోంది. కానీ.. దేనితో? ఇదే.. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మెదులుతున్న ప్రశ్న. 1950ల తర్వాత తొలిసారిగా గ్రీన్‌లాండ్‌పై అమెరికా దాడి చేస్తే.. ముందుగా కాల్చి.. ఆ తర్వాత ప్రశ్నలు అడగాలనే స్టాండింగ్ ఆర్డర్స్.. డెన్మార్క్ దళాలకు ఉన్నాయ్. అయితే.. నిజంగా సైనిక దండయాత్ర గానీ, వెనిజుయెలా లాంటి మిలటరీ ఆపరేషన్ గానీ జరిగినప్పుడు.. డానిష్ ఆర్మీ.. అమెరికా శక్తిని ఎదుర్కోగలదా? అనే వాదన కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్‌.. గ్రీన్‌లాండ్‌ని ఏదో రకంగా తమ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రమో.. తంత్రమో.. కుతంత్రమో.. ఏదో రకంగా గ్రీన్‌లాండ్‌పై అమెరికా జెండా ఎగరేయాలనే ఆలోచనతో ఉన్నారు. మరోవైపు.. అమెరికా పరిమాణంలో.. ఒక శాతం కంటే తక్కువే ఉన్న గ్రీన్‌లాండ్‌ని నియంత్రించే డెన్మార్క్.. ఇటు వైపు కన్నేస్తే.. యుద్ధం తప్పదని హెచ్చరిస్తోంది. ఇప్పటికే.. 1952 కోల్డ్ వార్ యుగంలో.. తన దళాలకు జారీ చేసిన ఆదేశాలను కూడా వెనక్కి తీసుకుంది. ముందు కాల్చండి.. తర్వాత ప్రశ్నలు అడగండి అని క్లియర్ డైరెక్షన్ ఇచ్చేసింది. దాంతో.. ట్రంప్ కూడా శరవేకంగా పావులు కదుపుతున్నారు.

డెన్మార్క్ గ్రీన్‌ల్యాండ్‌ను రక్షించగలదా?

ట్రంప్ దూకుడు.. యూరప్, నాటో కూటమి దేశాల్లో ఉద్రిక్తతలను పెంచింది. అయితే.. అమెరికా గనక సీరియస్‌గా మిలటరీ ఆపరేషన్ చేపడితే డానిష్ సైన్యం యూఎస్ వార్ పవర్‌‌ని తట్టుకోలగదా? అనే ప్రశ్నకు ఆన్సర్ వెరీ సింపుల్. అమెరికాని ఎదుర్కోవడం డెన్మార్క్ వల్ల కానే కాదు. నిజానికి.. గ్రీన్‌లాండ్‌ని సైనికపరంగా స్వాధీనం చేసుకోకుండా అమెరికాని నిరోధించేది ఏదీ లేదు. 1951 కోల్డ్ వార్ అగ్రిమెంట్ ప్రకారం.. గ్రీన్‌లాండ్‌లో ఇప్పటికే అమెరికాకు విస్తృతమైన మిలటరీ యాక్సెస్ ఉంది. డెన్మార్క్, గ్రీన్‌లాండ్ అంగీకారంతోనే.. అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడానికి.. అమెరికాకు హక్కులున్నాయ్. ఆర్కిటిక్ ద్వీపంలోని పిటుఫిక్ స్థావరంలో ఇప్పటికే వంద మందికి పైగా సైనిక సిబ్బందిని అమెరికా మోహరించింది. అందువల్ల.. డెన్మార్క్‌తో ఒప్పందం ప్రకారం.. ద్వీపంలోని సిబ్బంది సంఖ్యని పెంచి.. క్రమంగా ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. అయితే.. డెన్మార్క్ గ్రీన్‌ల్యాండ్‌ను రక్షించగలదా? అనేదే బిగ్ డౌట్. అయితే.. ట్రంప్ సైనిక చర్య బెదిరింపును.. డెన్మార్క్ తీవ్రంగా పరిగణిస్తోంది. గ్రీన్‌లాండ్‌పై.. అమెరికా దాడి చేస్తే ముందుగా కాల్చులు జరిపి.. ఆ తర్వాత ప్రశ్నించండి అనే స్టాండింగ్ ఆర్డర్స్ కింద తమ ఆర్మీ ఉందని.. డానిష్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇది.. 1952 సైనిక ఆదేశంలో భాగం. ఇది.. ఇది ఇప్పటికీ అమలులో ఉంది. దాని ప్రకారం.. కమాండర్లు, ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాల వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన పనిలేదు. దాడి చేసే దళాలపై.. ప్రతిదాడి చేసే స్వేచ్ఛ డానిష్ బలగాలకు ఉంది. అంతేకాదు.. గ్రీన్‌లాండ్‌ని తిరిగి ఆయుధీకరణ చేయడానికి డెన్మార్క్ దాదాపు 14 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని.. డానిష్ డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పారు.

యుద్ధ విమానాల సంఖ్యలోనూ వెనుకబాటు

డెన్మార్క్ ఎంత ధైర్యంగా కనిపిస్తున్నా.. ఆ దేశం దగ్గరున్న పరిమితమైన సైనిక బలం వాస్తవాలను కాదనలేవు. అమెరికా మిలటరీ మ్యాన్ పవర్.. ఇతర నాటో సభ్య దేశాల కంటే చాలా ఎక్కువగా ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ ప్రకారం.. సైనిక బలం పరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది. డెన్మార్క్ 45వ స్థానంలో ఉంది. నాటో కూటమిలోని మిగిలిన 21 లక్షల మంది సిబ్బందితో పోలిస్తే.. ఒక్క అమెరికా దగ్గరే 13 లక్షల మంది సైనిక సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి.. నాటోలో డెన్మార్క్ అత్యల్ప సంఖ్యలో 20 వేల మంది సాయుధ దళాలను కలిగి ఉంది. ఇది.. ఇండియా కోస్ట్ గార్డ్ మ్యాన్ పవర్ కంటే తక్కువ. రాయల్ డానిష్ నేవీలో 3500 మంది సిబ్బంది ఉన్నారు. ఇది.. ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మోహరించిన మొత్తం సిబ్బందికి సమానం. డెన్మార్క్ దాదాపు 9 యుద్ధ నౌకలను నిర్వహిస్తోంది. ఒక్క సబ్‌మెరైన్ కూడా లేదు. డానిష్ ఎయిర్‌ఫోర్స్ కూడా చాలా తక్కువ. ఇది.. అమెరికా బలానికి సరిపోలడం లేదు. డానిష్ వాయుసేనలో 3 వేల మంది సిబ్బంది ఉన్నారు. కేవలం.. 118 యుద్ధ విమానాలు మాత్రమే ఆపరేషనల్‌గా ఉన్నాయ్. అయితే.. వెనిజుయెలా ఆపరేషన్‌‌లో.. అమెరికా పెద్ద సంఖ్యలో 150 వరకు యుద్ధ విమానాలను మోహరించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అదుపులోకి తీసుకుంది. డెన్మార్క్ దగ్గరున్న యుద్ధ విమానాల్లో.. 26 పాతబడిన F-16A యుద్ధ విమానాలు, 21 F-35 లైట్నింగ్ 2 విమానాలు ఉన్నాయి. హాస్యాస్పదంగా.. మరిన్ని ఎఫ్-35 ఫైటర్ జెట్స్‌ని.. డెన్మార్క్ అమెరికా నుంచే కొనుగోలు చేస్తోంది.

ఒక్క రోజులో ముగిసే యుద్ధమా?

డెన్మార్క్ ముందున్న మరో సవాల్ ఏమిటంటే.. తక్కువ సమయంలోనే దళాలను మొబిలైజ్ చేయడం. ఎందుకంటే.. గ్రీన్‌లాండ్ డెన్మార్క్ నుంచి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ.. రెండు దేశాల మధ్య వివాదం తలెత్తి, అమెరికా గనక గ్రీన్‌లాండ్‌పై దండయాత్రకు దిగితే.. ఏం జరుగుతుందని సరదాగా ఊహిస్తే.. డానిష్ సైన్యంతో పాటు ఇతర మిత్రదేశాలు జోక్యం చేసుకుంటే.. పోరాటం ఒక్క రోజులోనే ముగిసిపోతుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఒక్కటే గంటల్లోనే ఆకాశంలో ఆధిపత్యం చెలాయించగలదు. ఒక నిమిట్జ్ క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నుంచి పనిచేసే ఎఫ్-35 లైటింగ్ 2, F/A-18 ఫైటర్ జెట్స్.. పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు సరిపోతాయంటున్నారు. అందువల్ల.. డెన్మార్క్ దగ్గరున్న పరిమిత రక్షణ సామర్థ్యాలు.. అమెరికాని ఎదుర్కోవడం ఏ రకంగానూ సరిపోవని క్లియర్‌గా అర్థమవుతోంది. అవతల ట్రంప్ లాంటి మోనార్క్ ఉన్నా.. డెన్మార్క్ తన ధైర్యాన్ని కోల్పోవట్లేదు.

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను ఎందుకు పడింది?

అమెరికా గ్రీన్‌లాండ్ కావాలంటోంది.. డెన్మార్క్ వదులుకునే ప్రసక్తే లేదని చెబుతోంది.. అసలు.. ప్రెసిడెంట్ ట్రంప్‌కి గ్రీన్‌లాండ్ ఎందుకు కావాలి? దేనికోసం.. ఇంతలా పట్టుదలతో ఉన్నారు? అక్కడి ప్రజలకు డాలర్లను ఎరగా ఎందుకేస్తున్నారు? గట్టిగా 60 వేల మంది జనాభా కూడా లేని ద్వీపం కోసం.. ట్రంప్ ఇంతలా ఎందుకు తహతహలాడుతున్నారు? అసలు.. గ్రీన్‌లాండ్‌ నుంచి ట్రంప్ ఏం ఆశిస్తున్నారు?

గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ ఆరాటం… వెనుక దాగిన గ్లోబల్ గేమ్

గ్రీన్‌లాండ్ అంశం ప్రపంచ రాజకీయాల్లో హాట్ డిబేట్‌గా మారింది. 60 వేల లోపు జనాభా ఉన్న ఓ మంచు ద్వీపం కోసం.. అగ్రరాజ్యం అమెరికా ఎందుకు ఇంత ఆరాటపడుతోంది? డెన్మార్క్ ససేమిరా అంటున్నా.. ట్రంప్ పట్టువదలని విక్రమార్కుడిలా ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఇందుకు.. భౌగోళిక రాజకీయ, వ్యూహాత్మక కారణాలున్నాయ్. అందుకే.. కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచి.. గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఆ ద్వీపం.. అమెరికా జాతీయ భద్రతకు చాలా ముఖ్యమైందంటున్నారు. అంతేకాదు.. ఎలాగైనా సరే గ్రీన్‌లాండ్ అమెరికా ఆధీనంలోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే.. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయాలనే ఆలోచనని అమెరికా ముందుకు తెచ్చింది. ఇది వర్కవుట్ కాకపోతే.. బలవంతంగా స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదనలున్నాయ్. ట్రంప్ తన గ్రీన్‌లాండ్ కుట్రని సమర్థించుకోవడానికి.. కొన్నిరోజులుగా ఆర్కిటిక్ ప్రాంతం రష్యా, చైనా నౌకలతో నిండి ఉందని.. కచ్చితమైన ఆధారాలేవీ లేకుండానే చెబుతున్నారు. అయితే.. ట్రంప్ మాటల వెనుక ఓ స్పష్టమైన వాస్తవం దాగి ఉంది. ఇది.. గ్రీన్‌లాండ్ వ్యూహాత్మక స్థానం. యూరప్, ఉత్తర అమెరికా మధ్య ఉన్న గ్రీన్‌లాండ్.. అమెరికా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌కి, ఈ ప్రాంతంలోని నౌకల పర్యవేక్షణకు కీలకమైన ప్రదేశం. అయితే.. ఇదొక్కటే ట్రంప్‌ని ఆకర్షించలేదు. చైనా ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా.. గ్రీన్‌లాండ్‌లోని విస్తారమైన కీలక ఖనిజ నిక్షేపాలపై డొనాల్డ్ ట్రంప్ దృష్టిసారించినట్లు చెబుతున్నారు.

మంచు ద్వీపం కింద మహా సంపద

గ్రీన్‌లాండ్ ద్వీపం.. ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మధ్య ఉంటుంది. ఇది.. భౌగోలికంగా ఉత్తర అమెరికాకు వ్యూహాత్మక స్థానంగా కనిపిస్తోంది. రష్యా నుంచి అమెరికాకు ఏదైనా ముప్పు పొంచి ఉంటే.. అది ఆర్కిటిక్ మీదుగానే వచ్చే అవకాశం ఉంది. గ్రీన్‌లాండ్‌లో అమెరికాకు ఇప్పటికే తులే ఎయిర్ బేస్ ఉంది. ఈ ద్వీపం అమెరికా ఆధీనంలో ఉంటే.. రష్యా కదలికలను మరింత నిశితంగా గమనించొచ్చు. ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించాలంటే గ్రీన్‌లాండ్ అత్యంత కీలకమైన స్థావరం. అంతేకాదు.. ఈ మంచు ద్వీపం కింద అపారమైన సహజ సంపద దాగుంది. వాతావరణ మార్పుల వల్ల మంచు కరుగుతుండటంతో.. ఖనిజ సంపద వెలికితీయడం ఇప్పుడిప్పుడే సులభతరమవుతోంది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, శాటిలైట్లు, అత్యాధునిక ఆయుధాల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. గ్రీన్‌లాండ్ అమెరికాకు దక్కితే.. చైనాపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. వీటితో పాటు అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఆర్కిటిక్‌పై కన్నేసిన డ్రాగన్.. అడ్డుకునేందుకు ట్రంప్ డీల్ ప్లాన్

గ్రీన్‌లాండ్‌పై తన ప్రభావాన్ని పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. అక్కడ ఎయిర్‌పోర్టులు నిర్మించడం, మైనింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్కిటిక్ రీజియన్‌లోకి ప్రవేశించాలని డ్రాగన్ చూస్తోంది. గ్రీన్‌లాండ్ డెన్మార్క్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారితే, దాన్ని తమ వైపు తిప్పుకోవాలనేది చైనా ప్లాన్. దీన్ని అడ్డుకోవాలంటే గ్రీన్‌లాండ్‌ను తామే దక్కించుకోవాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ మంచు వేగంగా కరుగుతోంది. దీనివల్ల ఆసియా, యూరప్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించే.. కొత్త సముద్ర మార్గాలు ఏర్పడుతున్నాయి. ఈ మార్గాలపై గ్రీన్‌లాండ్ పట్టు సాధిస్తే.. భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యం అమెరికా నియంత్రణలోకి వెళ్తుంది. ఇదిలా ఉంటే.. గ్రీన్‌లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ ఇచ్చే వార్షిక రాయితీ మీద ఆధారపడి నడుస్తోంది. దీనిని ఆసరాగా చేసుకొని.. డెన్మార్క్ మీద ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తాం, గ్రీన్‌లాండ్‌ను అభివృద్ధి చేస్తామని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. అక్కడున్న 60 వేల మంది ప్రజలకు మెరుగైన ఉపాధి, పెట్టుబడులు ఆశ చూపి రియల్ ఎస్టేట్ డీల్ తరహాలో దీన్ని ముగించాలనేది ట్రంప్ ప్లాన్. అయితే.. డెన్మార్క్ మాత్రం అమెరికా ప్రతిపాదనని తిరస్కరిస్తోంది.

గ్రీన్‌లాండ్ ప్రజలకు భారీ ఆఫర్.. ట్రంప్ ప్లాన్‌కు బ్రేక్

గ్రీన్‌లాండ్‌ని దక్కించకోవడానికి ఎన్ని సునాయాస ప్రయత్నాలు ఉన్నాయో.. అవన్నీ ట్రై చేద్దామనే ధోరణిలో ఉన్నారు ట్రంప్. అవేవీ వర్కవుట్ కాని పక్షంలో.. అమెరికా పవరేంటో చూపించి.. దాన్ని సొంతం చేసుకోవాలనే ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే.. డెన్మార్క్ ప్రజలపై డబ్బుని వెదజల్లడానికి సిద్ధమయ్యారు. ఈసారి.. డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కనపెట్టి.. గ్రీన్‌లాండ్ ప్రజలకు భారీ ఆఫర్ కూడా ఇచ్చారు. అక్కడుండే ప్రతి వ్యక్తికి.. 10 వేల నుంచి లక్ష డాలర్ల దాకా ఇచ్చి.. తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. కానీ గ్రీన్‌లాండ్ ప్రజలు ఇందుకు ఒప్పుకోవట్లేదు. 1867లో రష్యా నుంచి అమెరికా అలాస్కాను కొన్నప్పుడు కూడా అనేక విమర్శలు వచ్చాయి. కానీ.. ఇప్పుడదే అమెరికాకు అతిపెద్ద ఆర్థిక, రక్షణ కవచం. అదే హిస్టరీని.. గ్రీన్‌లాండ్ ద్వారా రిపీట్ చేయాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. అయితే.. డెన్మార్క్ ప్రధాని ఇది అసాధ్యమని కొట్టిపారేయడం, గ్రీన్‌లాండ్ ప్రజలు తమ భూభాగం అమ్మకానికి లేదని స్పష్టం చేయడంతో.. ఈ వివాదం దౌత్యపరమైన చిక్కుముడిగా మారింది. అయితే.. ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ.. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×