Bitcoin Market: క్రిప్టో మార్కెట్లో అల్లకల్లోలం మొదలైంది. ఏకంగా మూడు వారాల్లో 1 ట్రిలియన్ డాలర్లు సంపద ఆవిరైంది. రోజు రోజుకూ బిట్ కాయిన్ విలువ పతనమవుతోంది. ఒకే రోజులో 12 శాతం పతనమైందంటే మార్కెట్లో క్రిప్టో పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. నాలుగేళ్ల తర్వాత ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడం ఇప్పుడే. అసలు బిట్ కాయిన్ మార్కెట్లో ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
క్రిప్టో మార్కెట్లో అల్లకల్లోలం
బిట్‌కాయిన్‌లో పెద్ద నష్టాలు వస్తే, పెట్టుబడిదారులు నగదు కోసం ఇతర ఆస్తులను అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. శుక్రవారం క్రిప్టో మార్కెట్లలో అమ్మకాలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఫ్లాగ్ షిప్ టోకెన్ బిట్‌కాయిన్ 60,074 డాలర్లకు పడిపోయింది. 2024 అక్టోబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయిగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Ethereum 1,800 డాలర్ల మార్కు కంటే దిగువకు పడిపోయింది. XRP, Solana, BNB 13 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. రెండేళ్ల కిందట బిట్‌కాయిన్ గరిష్ట స్థాయిని చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా క్షీణించడం మొదలైంది. ఒడిదుడుకులు సహజమేనని భావించిన మదుపరులు, తొలుత లైటుగా తీసుకున్నారు.
పతనం కంటిన్యూ అవుతూ వస్తోంది. దీని ఫలితంగా కేవలం మూడు వారాల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లు సంపద ఆవిరైపోయింది. రానున్న రోజుల్లో మరింత దిగజారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూడు వారాల్లో 1 ట్రిలియన్ డాలర్లు ఆవిరి
చాలా దేశాల్లో క్రిప్టో మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారుతోంది. పెద్ద కంపెనీలు తమ ట్రెజరీలో బిట్‌కాయిన్‌ను నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో జరిగే మార్పులు, మిగతా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. స్పాట్ బిట్‌కాయిన్ ETFల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తే ఆ ఫండ్స్ వద్ద బిట్‌కాయిన్‌ను అమ్మకాలు తప్పవు.
దీనివల్ల బిట్ కాయిన్ విలువ మరింత పడుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా ప్రకారం.. ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $126,198 కంటే 48 శాతం కంటే తక్కువగా ఉంది.బిట్‌కాయిన్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ $1.29 ట్రిలియన్లుగా ఉంది. క్రిప్టోకరెన్సీలలో అతిపెద్దది.
ALSO READ: ఉద్యోగులకు 100 శాతం బోనస్.. గుడ్ న్యూస్ చెప్పిన కాగ్నిజెంట్
పెరుగుతున్న కృత్రిమ మేధస్సు ఖర్చులు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి వంటి ఆందోళనల మధ్య పెట్టుబడిదారులు మార్కెట్ల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు మార్కెట్ నిపుణుల మాట. ఈ ఏడాది జనవరి 14 నుండి డిజిటల్ ఆస్తి మార్కెట్ విలువ 1 ట్రిలియన్ల డాలర్లకు పైగా తగ్గింది. ఈ వేగం రోజుకు సగటున 45 బిలియన్ల డాలర్ల నష్టాలకు సమానం. ఈ విషయాన్ని ది కోబీస్సీ లెటర్ డేటా చెబుతోంది.
ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర 50,000 డాలర్ల పడితే కొంతమంది దివాలా తీయవచ్చని అంటున్నాయి. డిజిటల్ గోల్డ్, సిల్వర్ మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోతారని అంచనా వేస్తున్నారు. గతంలో క్రిప్టో మార్కెట్ భారీ పతనం అయ్యిందని, ఆ తర్వాత వేగంగా కోలుకున్న సందర్భాలు ఉన్నాయని చెబుతున్నాయి.