RBI Bank Holidays: 2026 జనవరి నెలకు సంబంధించిన సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం, దేశంలో వివిధ నగరాల్లోని బ్యాంకులు జనవరి 2026లో రెండో, నాల్గో శనివారాలు కాకుండా 10 రోజులు పనిచేయవని పేర్కొంది. కాబట్టి వినియోగదారులు బ్యాంకులకు వెళ్లే ముందు ఆయా తేదీలను తనిఖీ చేసుకోవాలని సూచించింది. మొత్తంగా జనవరిలో బ్యాంకుల భారీగా సెలవులు ఉన్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు రెండూ ఆర్బీఐ.. బ్యాంకు హాలీడేస్ షెడ్యూల్‌ను అనుసరిస్తాయి. జనవరి నెల బ్యాంకు సెలవుల్లో.. చాలా వరకు నూతన సంవత్సరం, స్వామి వివేకానంద జయంతి, బిహు, మకర సంక్రాంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, గణతంత్ర దినోత్సవం వంటి ప్రధాన పండుగలు ఉన్నాయి. అలాగే అనేక ప్రాంతాలకు సంబంధించిన పండుగలు కూడా ఉన్నాయి.
ఆర్బీఐ బ్యాంక్ సెలవులు 2026 నోటిఫికేషన్ ప్రకారం.. స్థానిక పండుగలను బట్టి నగరాల వారీగా బ్యాంక్ హాలీడేస్ మారుతుంటాయి. ఆ రోజుల్లో బ్రాంచ్‌లలో రెగ్యులర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. అయితే డిజిటల్ లావాదేవీలు పనిచేస్తున్నాయి. జనవరి నెలలో 10 సెలవులు.. 1, 2, 3, 12, 14, 15, 16, 17, 23, 26 తేదీలలో ఉన్నాయి. ఈ తేదీలు ఆయా నగరాలకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి RBI బ్యాంక్ సెలవులు 2026 జాబితాను ఈ వివరాల కోసం చెక్ చేయవచ్చు.
2026 ఆర్బీఐ బ్యాంకు సెలవుల షెడ్యూల్ ప్రకారం.. జనవరి 1న ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టాక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, షిల్లాంగ్‌లలో నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటిస్తారు. ఆ మరుసటి రోజు జనవరి 2న ఐజ్వాల్, కొచ్చి, తిరువనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు, మన్నం జయంతి కోసం శాఖలు మూసివేస్తారు.
జనవరి 3న లక్నోలో హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా బ్యాంకులను మూసివేస్తారు. కోల్‌కతాలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న సెలవు దినంగా పాటిస్తారు. నెల రెండో భాగంలో మరిన్ని సెలవులు ఉన్నాయి. జనవరి 14న అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి, ఇటానగర్‌లలో మకర సంక్రాంతి, బిహు పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జనవరి 15న బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టాక్, హైదరాబాద్, విజయవాడ నగరాలకు సంక్రాంతి, పొంగల్, సెలవులు ఉంటాయి.
చెన్నైలో వరుసగా మూడు సింగిల్ సిటీ సెలవులు ఉన్నాయి. జనవరి 15న ఇతర నగరాలతో పాటు చెన్నైలో బ్యాంకులకు హాలీడే ప్రకటించారు. జనవరి 16న తిరువల్లూరు దినోత్సవం సందర్భంగా సెలవు కాగా, ఉళవర్ తిరునాల్ సందర్భంగా జనవరి 17నే బ్యాంకులు క్లోజ్ చేస్తారు. దీంతో అక్కడ మూడు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి.
జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు, సరస్వతి పూజ, వీర సురేంద్రసాయి జయంతి, వసంత పంచమి కోసం అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవులు ఇస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూదిల్లీ, ముంబై, చెన్నై, ఇతర లిస్టెడ్ నగరాలతో సహా ప్రధాన కేంద్రాలలో దేశవ్యాప్తంగా సెలవు ప్రకటిస్తారు.