
Seema Chinthakaya : సీమచింత లేదా పులిచింత.. అధిక బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. ఇది ఎక్కువగా దక్షిణ భారత్‌లో మనకు కనిపిస్తుంది. హిందీ భాషలో జంగిల్ జలేబీ, తమిళ్‌లో కొడుక్క పులి అని కన్నడలో సిహీ హుణిసె అంటారు. పిథీసెలోబియం డల్సె అనే శాస్త్రీయనామం ఉన్న సీమచింత ముళ్ల చెట్టుకు కాస్తుంది. మధ్య అమెరికా, మెక్సికో దేశాలకు ఇది స్థానికం.. సీమచింతను ఇంగ్లిష్‌లో మనీలా టామరిండ్, మద్రాస్ థార్న్, మంకీ పాడ్ అనే రకరకాల పేర్లతో పిలుస్తారు. మన దేశంలో సీమచింతకాయలు ముఖ్యంగా ఏప్రిల్, జూన్ నెలల మధ్యకాలంలో లభిస్తాయి. సలాడ్స్, పచ్చళ్లు, జామ్‌ల రూపంలో వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఎండాకాలం శీతల పానీయాల్లో కూడా వీటిని కలుపుకోవచ్చు.
సీమచింత ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఫైబర్‌కు మంచి వనరుగా పనిచేస్తుంది. విటమిన్- సి, ఎ, పొటాషియం, ఐరన్‌వంటి అనేక విటమిన్లు, మినరల్స్ ఇందులో లభిస్తాయి. ఇందులోని డైటరీ ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువశాతం ఉండటం వలన బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను అంత త్వరగా పెంచదు. డయాబెటిస్ ఉన్నవారికీ ఈ సీమచింతకాయ మంచి ఆహారం అని చెప్పవచ్చు. విటమిన్-సి సమృద్ధిగా ఉండటం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది.
అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ సీమచింతకాయలో విటమిన్-ఎ సంవృద్ధిగా ఉంటుంది. ఇది కంటిచూపు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ కాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి సీమచింతకాయ మంచి ప్రత్యామ్నాయం అని వైద్యులు చెబుతున్నారు. సీమచింతకాయ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా కిడ్నీ రోగులు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మూత్రపిండ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. సీమచింతలో ఉండే ఆగ్జాలిక్ ఆమ్లం మన శరీరం ఐరన్, కాల్షియంను తీసుకోవడానికి అడ్డుగా ఉంటుంది. కాబట్టి తగినంత మోతాదులోనే దీన్ని వాడాలని నిపుణులు అంటున్నారు.