Big Stories

PM Modi on Reservation: మేము న్యాయం చేస్తాం! రిజర్వేషన్ గేమ్.

PM Modi Comments on Reservations: రిజర్వేషన్స్.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నేతల నోటి నుంచి వినిపిస్తున్న మాట. ఈసారి ఎన్నికలు రిజర్వేషన్ల చుట్టే తిరుగుతున్నాయి. అందరి నోట ఇదే మాట.. ఇదే నామజపం. ఇంతకీ రిజర్వేషన్‌ రాజకీయం ఎందుకు తెరపైకి వచ్చింది? పార్టీల రిజర్వేషన్‌ హామీల వెనకున్న అసలు రాజకీయమేంటి? రిజర్వేషన్.. సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన విధానం. వెనకబడిన వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు సహకరిస్తాయి. కానీ రోజురోజుకు ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. ఓట్లను రాల్చే వస్తువుగా మార్చేశాయి పార్టీలు. ప్రతి ఎన్నికల ముంగిట హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ రావడంతో ఈసారి కూడా రిజర్వేషన్స్ అంశం తెరపైకి వచ్చింది. అయితే గతంలో కంటే ఈసారి డోస్‌ చాలా ఎక్కువైంది.

- Advertisement -

రిజర్వేషన్ అంశాన్ని మొదట బలంగా బయటికి తీసుకొచ్చింది కాంగ్రెస్. ఎప్పటి నుంచో ఇదే అంశాన్ని రాహుల్‌ గాంధీ చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ ఉంది. తాము అధికారంలోకి రాగానే ఈ సీలింగ్‌ను ఎత్తేస్తామంటున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. దానిని అమలు చేసి చూపిస్తామంటోంది కాంగ్రెస్.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ.. ఇలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్. ఇప్పుడీ హామీలు నేషన్ వైడ్‌గా ఓ సెన్సెషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్ల పరిమితిని పెంచాలనే డిమాండ్ ఇప్పటిది కాదు.. ఏనాటిదో. దేశంలోని గిరిజనులు, దళితులు, బీసీలు ఈ డిమాండ్ చేస్తున్నారు. బీసీలైతే తమ కోటా రిజర్వేషన్ పెంచాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇప్పుడీ వర్గాలన్నింటికి కాంగ్రెస్ హామీ ఓ వరం.

- Advertisement -

Also Read: ఎన్నికలు వాయిదా.. ఎందుకంటే? 

ఎప్పుడైతే కాంగ్రెస్‌ మేనిఫెస్టో రిలీజైందో.. బీజేపీ నేతలు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఎందుకంటే బీజేపీ ఆయువు పట్టుపై కాంగ్రెస్‌ వేసిన పెద్ద దెబ్బ ఇది. అందుకే ఇందులోకి మతం రంగుని తీసుకొచ్చారు. రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలలో ఇతరులకు రిజర్వేషన్లను తగ్గించి.. వాటిని ముస్లింలకు కట్టబెడతారంటూ ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు చేశారు. మత ప్రాతిపదికన కాంగ్రెస్ రిజర్వేషన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని.. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్‌కి వెన్నుపోటు పొడవడమే అంటున్నారు మోడీ.. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల 15 శాతం కోటాని తగ్గించి.. మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందనేది ప్రధాని మోడీ చేసిన పెద్ద ఆరోపణ.

ఓ వైపు ఈ రిజర్వేషన్ రాజకీయం కొనసాగుతుండగానే.. దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్త చర్చకు తెర లేసింది. అదేంటంటే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అసలు రిజర్వేషన్ సిస్టమ్‌నే తొలగిస్తుందనేది ఆ ప్రచారం. దీనిని కాంగ్రెస్‌ నేతలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికలు రిజర్వేషన్ల విషయంలో అటో ఇటో తేల్చే ఎన్నికలన్నారు. విన్నారుగా ఈ ఎన్నికలను ఆయన రెఫరెండంగా పిలుస్తున్నారు. మీరే నిర్ణయించుకోండి ఇక.. అన్నట్టుగా ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అసలు RSS భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే అనేది రేవంత్‌తో పాటు చాలామంది కాంగ్రెస్‌ నేతల వాదన. అంతేకాదు 400 సీట్లు దక్కితే రిజర్వేషన్లు తీసేయడం సులభమంటూ కొత్త వాదనను కూడా తెరపైకి తీసుకొచ్చారు. రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయదంటున్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తమ ప్రయత్నమంతా దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలవారికి న్యాయం చేయడం కోసమే అంటున్నారు.

సో.. ఒకరేమో తొలగించాలి.. మరోకరేమో పెంచాలని.. మరొకరేమో మత ప్రాతిపదికన రిజర్వేషన్లనీ.. ఇలా ఒక్కో పార్టీ ఒక్కో స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నాయి రిజర్వేషన్లపై.. మరి ఈ మాటలన్ని వింటున్న ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారు? పార్లమెంట్‌లో ఎంత మంది సభ్యులు కూర్చునేలా కోటా కేటాయిస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News