Big Stories

Kiliveti Sanjeevaiah: కిలివేటికి సొంత సెగ.. డోంట్ కేర్

Sullurpet Constituency Kiliveti Sanjeevaiah Latest Political News: ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో చిత్ర‌మైన రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గం. అక్క‌డ ఉన్న వైసీపీ నేత‌లంతా త‌మ‌కు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వ‌ద్దంటున్నా అధిష్టానం ప‌ట్టించుకోలేదు. సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా జగన్ మాత్రం కిలివేటికే టికెట్ ఇచ్చారు. ఎలాగైనా కిలివేటికి హ్యాట్రిక్ విజయం అందించి, అంద‌ల‌మెక్కిస్తామంటున్నారు. అయితే గ్రౌండ్ లెవల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదంట. కిలివేటి ప్రచారంలోనే పార్టీ వర్గాల మధ్య విభేదాలు బయటపడుతూ ఆయనకు నిద్రలేకుండా చేస్తున్నాయంట.

- Advertisement -

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున కిలివేటి సంజీవయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో భారీ మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో సులూరుపేట నియోజకవర్గం కూడా ఒకటి. అయితే ఆయనకు పార్టీలో చాప కింద నీరులా అసమ్మతి పెరిగిపోయింది. ఇప్పుడు ఆ అసమ్మతిని చల్లార్చే పరిస్థితి కనిపించడం లేదు. టికెట్ల కేటాయింపు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు టికెట్ ఇవ్వవద్దని ఆ పార్టీలోని ఒక వర్గం పట్టు పట్టింది. ఈసారి సిట్టింగుకు సీటు కేటాయిస్తే తాము ఎన్నికల్లో సహకరించే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది.

- Advertisement -

ఆ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలు జోక్యం చేసుకుని రాజీ ప్రయత్నాలు చేసినా అసమ్మతి చల్లారలేదు. రేణిగుంట నుంచి నెల్లూరుకు రోడ్డు మార్గంలో వెళుతున్న ఎంపీ విజయసాయిరెడ్డిని గూడూరులో ఓ వర్గం ఆపి కిలివేటికి టికెట్ ఇవ్వాలని, మరో వర్గం టికెట్ ఇవ్వకూడదని పట్టుబడ్డాయి. అయినా అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్యకు టికెట్ కేటాయించింది.

Also Read: అంబటి మాట.. వైసీపీ రాచరికం.. అందుకే..

సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పనిచేసే నాయకులను కాదని తన అనుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని రగిలిపోతున్నారు అసంతృప్తి నేతలు  ఆ క్రమంలోతాజాగా నామినేషన్ దాఖలు వేసే సమయంలో నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. చేతల వరకు వెళ్లే సమయంలో అందరికీ నచ్చజెప్పడానికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు తలప్రాణం తోక కొచ్చింది. వాహనం పైన ఉన్న ఓ నేతను కిందకి దిగాలని మరో నేత సూచించడంతో వివాదం చెలరేగింది. ఆ మాట చెప్పేందుకు నువ్వెవరు అంటూ ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరికి చెప్పులు చూపించుకునే వరకు పరిస్థితి వెళ్లింది.

బయటకు కనిపిస్తున్న ఘటన ఇదే అయినా అలాంటివి ఇప్పటివరకు అంతర్గతంగా ఎన్నో కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం బాహటంగా బాహా బాహీకి దిగారు. నామినేషన్ టైంలో చోటు చేసుకున్న ఆ ఘటనతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు అవాక్కవుతున్నారు. వైసీపీలో నెలకొన్న ఈ వర్గ విభేదాలు ఎమ్మెల్యేని ఏ ఒడ్డుకి చేరుస్తాయో అన్న చర్చ జరుగుతుంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు తర్వాత సుళ్లూరుపేట నియోజకవర్గంలో గత ఎన్నికలో ఓటర్లు అత్యధిక మెజారిటీని కిలివేటి సంజీవయ్యకు ఇచ్చారు. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన మరోసారి కూడా విజయాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతున్నారు .. అయితే పార్టీలోని అసమ్మతి వర్గం ఆయనకు నిద్రలేకుండా చేస్తుందంటున్నారు. వైసీపీలో పరిణామాలను తెలుగుదేశం పార్టీ నిశితంగా పరిశీలిస్తుంది.

ఎమ్మెల్యే వ్యతిరేకులను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. పార్టీలోకి నేరుగా ఆహ్వానం పలకపోయినా సైలెంట్‌గా తమకు పనిచేయాలని మంతనాలు సాగిస్తున్నారంట.టీడీపీ ప్రయత్నాలు వర్కౌట్ అయితే వైసీపీ అభ్యర్ధికి కష్టాలు తప్పవంటున్నారు. అందుకే కిలివేటి సంజీవయ్య కూడా ముందస్తు జాగ్రత్త పడుతున్నారట. అన్ని వర్గాలను బుజ్జగించడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారంట. మరి చూడాలి ఆయన హ్యాట్రిక్ ఆశలు ఎంతవరకు నేరవేరతాయో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News