Big Stories

Botsa Satyanarayana: చీపురుపల్లిలో సూపర్ ఫైట్.. బొత్స కి కష్టమేనా?

- Advertisement -

చీపురుపల్లి .. ఈ పేరు వినపడగానే గుర్తొచ్చేది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  ఈ నియోజకవర్గం నుండి ఇప్పటికే మూడు సార్లు గెలిచిన బొత్స, మూడుసార్లూ మంత్రి కావడం విశేషం.  1999లో తొలిసారి కాంగ్రెస్ నుంచి బొబ్బిలి ఎంపీగా గెలిచిన బొత్స తర్వాత చీపురుపల్లికి మారి దాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. విభజన ఎఫెక్ట్‌తో 2014 లో ఆయన ఫస్ట్‌ టైం ఓడిపోయారు. అప్పుడు బొత్సపై గెలిచిన కిమిడి మృణాళిని కూడా మంత్రి అయ్యారు. బొత్స ఎఫెక్ట్‌తో అంత ప్రాధాన్యత సంపాదించుకుంది చీపురుపల్లి.

- Advertisement -

బొత్స మొదటిసారి 2004 లో కాంగ్రెస్ నుండి గెలిచి మంత్రి అయ్యాక ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ తరువాత 2009 , 2019 లో బొత్స అక్కడి నుంచే గెలిచారు. 2014లో ఓడిపోయిన అ తరువాత వైసీపీ గూటికి చేరి గత ఎన్నికల్లో తిరిగి గెలుపొంది జగన్ కేబినెట్లో కీలకంగా మారారు. ఆ ఎన్నికల్లో బొత్స చేతిలో ఓడిపోయిన కిమిడి నాగార్జున చీపురుపల్లి టీడీపీ ఇన్చార్జ్‌గా పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఈ సారి కూడా నాగార్జునే బొత్సతో తలపడతారని అంతా భావించారు.

Also Read: కిలివేటికి సొంత సెగ.. డోంట్ కేర్

అయితే ఈసారి ఎలా అయినా బొత్సను ఓడించాలని పట్టుదలతో ఉన్న టీడీపీ.. చీపురుపల్లి బరిలో మాజీ మంత్రి , ఇంతవరకు ఓటమి ఎరుగడి గంటా శ్రీనివాసరావుని దించడానికి ప్రయత్నించింది. అయితే ప్రతి ఎన్నికల్లో సెగ్మెంట్ మారుస్తూ సేఫ్‌సైడ్ చూసుకునే గంటా పార్టీ ప్రతిపాదనకు ససేమిరా అన్నారు. తాను ఆశించిన భీమిలీ టికెట్టే దక్కించుకున్నారు.  తర్వాత సీనియర్టీ లెక్కలతో  మాజీ మంత్రి , సీనియర్ నేత, నాగార్జున పెద్దనాన్న అయిన కిమిడి కళా వెంకటరావును బరిలోకి దింపింది. కిమిడి నాగార్జున నియోజకవర్గ ఇంచార్జ్ అయినప్పటికీ , కళా అయితేనే బొత్సను డీ కొట్టగలరన్న భావనతో చంద్రబాబు పావులు కదిపారు.

దానిపై కిమిడి నాగార్జున పార్టీపై, కళా వెంకటరావుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఆ తరువాత కళా నియోజకవర్గంలో ఎంటరైనా  నాగార్జున కనీసం స్పందించలేదు. అధిష్టానం బుజ్జగింపులకు దిగడంతో సైలెంట్ అయిన నాగార్జున  ఎక్కడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. దాంతో చీపురుపల్లిలో కళా కి కష్టమే అనుకున్నారంతా  నాగార్జున సపోర్ట్ లేకపోతే మరోసారి బొత్స అవలీలగా గెలుస్తారనే అంచనాలు వెలువడ్డాయి. కళాకి టికెట్ ఇచ్చి చంద్రబాబు తప్పు చేశారనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. కానీ ఇటీవల గజపతినగరంలో జరిగిన ప్రజగళం సభతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. విమర్శలకు పుల్‌స్టాప్ పడింది .

చంద్రబాబు స్వయంగా కిమిడి నాగార్జునతో మంతనాలు జరపడం తన కొడుకులాంటి వాడివంటూ.. పొలిటికల్ ఫ్యూచర్‌పై గ్యారెంటీ ఇవ్వడంతో  అప్పటివరకు అలకపాన్పు ఎక్కిన నాగార్జున గజపతినగరం ప్రజాగళం సభకు అధ్యక్షత వహించడంతో టీడీపీ శ్రేణుల్లో సమరోత్సాహం పెరిగిపోయింది. కళా, కిమిడి కలిస్తే బొత్సకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.. అంతేకాదు కళా నామినేషన్‌ ర్యాలీకి నాగార్జున అటెండ్ అవ్వడంతో చీపురుపల్లి తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ కనిపిస్తుంది. నాగార్జున తన పెదనాన్నకు మద్దతు ప్రకటించడంతో ఆయన కేడర్‌ కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటుంది. చీపురుపల్లితో పాటు జిల్లా వ్యాప్తంగా అభ్యర్ధుల విజయానికి నాగార్జున ప్రచారం మొదలుపెట్టారు. విజయనగరం వెళ్లి అక్కడ టీడీపీ అభ్యర్ధులతో వేదిక పంచుకున్నారు.

కిమిడి ఫ్యామిలీ ఏకమవ్వడంతో వైసీపీ అసంతృప్తి నాయకులు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. బొత్సకి కంచుకోటలైన మెరకముడిదాం, గరివిడి మండలాల నుండి కూడా కీలకనాయకులు ఇప్పటికే టీడీపీ గూటికి చేరుతున్నారు. ఒకటైన నాగార్జున, కళావెంకట్రావులు కలిసి ప్రచారంకి వెళ్తే బొత్సకి కళ్ళెం వేయొచ్చానే అంచనాలు వెలువడుతున్నాయి. రాజకీయ సమీకరణలు మరింత జోరుగా మారుతాయనే టాక్ నడుస్తోంది.

Also Read: భారతి Vs షర్మిళ.. అందరిచూపు కడపపై.. అంతఃపురం లోగుట్టు..

మరోవైపు ఈ ఎన్నికల్లో బొత్సను ఓడించడం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యూచర్ లెక్కలు వేసుకున్నారంట .. ఈ సారి బొత్సని ఓడిస్తే తర్వాత నాగార్జునకి చీపురుపల్లి పార్టీ పగ్గాలు అప్పచెప్పి ఆ సెగ్మెంట్‌ని తిరిగి టీడీపీ కంచుకోటలా మార్చుకోవాలని టీడీపీ అధినేత చూస్తున్నరాంట. ఇప్పటికే నాగార్జున గత అయిదేళ్ళ నుండి గ్రౌండ్ లెవెల్ లో బలపడడం , మరో అయిదేళ్లు పని చేస్తే ప్రజల్లో కూడా సానుకూలత రావడం పార్టీకి , నాగార్జునకు ఇద్దరికీ ప్లస్ గా మారతాయన్న అంచనాలు ఉన్నాయి.

మరోవైపు విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన బొత్స 2029 ఎన్నికల నాటికి తన తనయుడు బొత్స సందీప్‌ని ఎలక్షన్స్‌లో ఫోకస్ చేయాలని చూస్తున్నారంట .. ఇంతకాలం బొత్స పెంచిపోషించిన మేనల్లుడు మజ్జి శ్రీను ఇప్పుడు సొంత పార్టీలోనే ఆయనకు ప్రత్యర్ధిగా మారారు. దాంతో మజ్జిశ్రీనుకి ఈ ఎన్నికల్లో టికెట్ లేకుండా చేసిన బొత్స  కొడుకుని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారంట. ఇప్పటికే బొత్స సందీప్‌కి చీపురుపల్లిలో షాడో ఎమ్మెల్యే అన్న టాగ్‌లైన్ తగిలించేశారు. మరోవైపు బొత్స తమ్ముడు అప్పలనరసయ్య గజపతినగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి పోటీలో ఉన్నారు. మాజీ ఎంపీ అయిన బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు

ఆ క్రమంలో ఉత్తరాంధ్రలో బొత్స పెత్తనానికి చెక్ పెట్టాలన్న పట్టదలతో ఉన్నారంట చంద్రబాబు. చీపురుపల్లిలో కిమిడి నాగార్జున , కళా వెంకట్రావులు కలిసి నడిస్తే.. బొత్స ఆ నియోజకవర్గానికే పరిమితమవుతారని  తన భార్య విజయం కోసం విశాఖ ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనే పరిస్థితి ఉండదన్నది టీడీపీ బాస్ స్కెచ్‌గా కనిపిస్తుంది. మరి పోల్ మేనేజ్‌మెంట్‌కు పెట్టింది పేరైన బొత్సాకి కిమిడి పెదనాన్న, అబ్బాయ్‌లు ఎలా చెక్ పెడతారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News