Late Marriage: సాధారణంగా ఎవరైనా ముప్పై పదుల వయసు దాటారంటే చాలు.. ‘నీకింకా పెళ్లి కాలేదా? అనే ప్రశ్న తప్పనిసరిగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇంట్లో పెద్దలు అయితే ‘పెళ్లి అనేది జరగాల్సిన వయసులోనే జరగాలి’ అంటూ పదే పదే గుర్తు చేస్తుంటారు. కానీ కాలం మారింది.. ఆలోచనలు కూడా మారాయి. ఈ రోజుల్లో ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం కూడా ఒక మంచి నిర్ణయమే అని చాలామంది నమ్ముతున్నారు. నిజానికి లేట్ మ్యారేజ్‌తో కలిగే లాభాల గురించి చాలామందికి స్పష్టమైన అవగాహన లేదు. పెళ్లికాని వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి.
ఇప్పుడు పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయంగా మారింది. చదువు, కెరీర్, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరికి చిన్న వయసులో ప్రేమలు, అవి విఫలమవడం వంటి అనుభవాల వల్ల పెళ్లి మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఈ కారణాలన్నింటితో చాలామంది పెళ్లిని కొంచెం ఆలస్యంగా చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే, ఇలా ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు పొందచ్చు అంటున్నారు నిపుణులు.
చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే.. ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే స్థాయి కొంచెం తక్కువగా ఉంటుంది. అత్తింటి వారు, పెద్దలు, బంధాలు.. ఇవన్నీ బ్యాలన్స్ చేసుకోవడం కష్టంగా మారొచ్చు. అదే కొంచెం వయసు పెరిగాక పెళ్లి చేసుకుంటే, సహనం, అవగాహన పెరుగుతాయి. దాంతో సంబంధాన్ని మరింత బలంగా నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది.
ఈ రోజుల్లో డబ్బు విలువ చాలా ఎక్కువ. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే సంపాదన, పొదుపు, ఖర్చు చేసే విధానం మీద స్పష్టత వస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఖర్చు పెట్టాలో తెలిసి ఉంటుంది. దీని వల్ల కుటుంబ జీవితాన్ని ఆర్థికంగా సాఫీగా నడిపించగలుగుతారు.
తొందరపడి పెళ్లి చేసుకుంటే బాధ్యతలు ఒక్కసారిగా వచ్చి మీద పడుతుంటాయి. దాంతో కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టడం కష్టమవుతుంది. అదే ముందుగా కెరీర్‌లో స్థిరపడి, మనకు కావలసిన స్థాయికి చేరుకున్నాక పెళ్లి చేసుకుంటే, భవిష్యత్‌పై భయం లేకుండా జీవించవచ్చు.
ఆలస్యంగా పెళ్లి చేసుకునే వారు స్నేహితులతో గడపడానికి, ట్రావెల్ చేయడానికి, కొత్త ప్రదేశాలు చూడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ బాధ్యతల ఒత్తిడి లేకుండా, మనకు నచ్చిన విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ అనుభవాలు మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే.. సరైన ఉద్యోగం లేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అదే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే.. మనకు నచ్చిన ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. అలా కెరీర్‌లో సంతృప్తిగా ఉంటే, కుటుంబ జీవితాన్ని కూడా ఆనందంగా గడపవచ్చు.
పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అన్నది సమాజం నిర్ణయించాల్సిన విషయం కాదు. మన జీవితం, మన లక్ష్యాలు, మన పరిస్థితుల ఆధారంగా తీసుకునే వ్యక్తిగత నిర్ణయం అది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. సరైన సమయంలో, సరైన ఆలోచనతో తీసుకున్న నిర్ణయం అయితే, అది జీవితాన్ని మరింత సంతోషంగా మార్చగలదు.