ఇటీవలి కాలంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య చాలామందిలో కనిపిస్తోంది. ఈ సమస్య ఉన్నప్పుడు శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి క్రమంగా పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో షుగర్ వ్యాధికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మందులతో పాటు ఆహార అలవాట్లలో మార్పులు చాలా అవసరం. సరైన ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంటుంది. శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?
ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది శరీరంలో ఏర్పడే ఒక సమస్య. మన శరీరం ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆ చక్కెరను శక్తిగా మారుస్తేందుకు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ ఇన్సులిన్ రక్తంలోని చక్కెరను కణాల్లోకి పంపించే పని చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు శరీరంలోని కణాలు ఇన్సులిన్ మాట వినవు. ఇన్సులిన్ ఉన్నా కూడా చక్కెర కణాల్లోకి సరిగా ప్రవేశించదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండిపోతుంది. ఈ పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు.
ఏం తినాలి?
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు రోజువారీ భోజనంలో కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా పిండి పదార్థాలు తక్కువగా ఉండే కూరగాయలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఆకుకూరలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలి, బెండకాయ, దోసకాయ, క్యారెట్ లాంటి కూరగాయలు జీర్ణక్రియ నెమ్మదిగా జరగేలా సహాయపడతాయి. ఇవి తిన్నప్పుడు రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.ప్రోటీన్ ఉన్న ఆహారం కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, కందిపప్పు, శెనగలు, పాలు, పెరుగు, పన్నీర్ లాంటి పదార్థాలు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఇవి జీర్ణమయ్యే వేగం తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. ప్రతి భోజనంలో కొద్దిగా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది.
తెల్ల అన్నానికి బదులు ఇవి
కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే వేగంగా జీర్ణమయ్యే పదార్థాల స్థానంలో నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారం ఎంచుకోవాలి. ఓట్స్, జొన్నలు, సజ్జలు, బ్రౌన్ రైస్, సంపూర్ణ గోధుమలు, బార్లీ లాంటి ధాన్యాలు మంచి ఎంపిక. ఇవి తిన్నప్పుడు శక్తి నెమ్మదిగా విడుదల అవుతుంది. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. పప్పులు, కాయగూరలతో చేసిన వంటకాలు మరింత మేలు చేస్తాయి.
పండ్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అన్ని పండ్లు ఒకేలా ఉండవు. చక్కెర శాతం తక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిది. యాపిల్, జామ, నారింజ, బెర్రీలు, పియర్ లాంటి పండ్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి అనుకూలం. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తిన్న తర్వాత రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది. జ్యూస్ రూపంలో కాకుండా పండును నేరుగా తినడం ఉత్తమం.
ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్, వేరుశెనగలు, బాదం, వాల్నట్, అవిసె గింజలు, చియా గింజలు, అవకాడో లాంటి పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీంతో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అంతేకాదు గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు కొన్ని ఆహారాలను తగ్గించడం చాలా అవసరం. తీపి పానీయాలు, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ స్నాక్స్, బేకరీ పదార్థాలు, తెల్ల బియ్యం, మైదాతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ఇలాంటి ఆహారం అలవాటు చేస్తే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంతవరకు సహజ ఆహారాలపైనే ఆధారపడాలి.
రోజువారీ ఆహారంతో పాటు జీవనశైలి కూడా ముఖ్యం. సమయానికి భోజనం చేయడం, ఎక్కువసేపు ఆకలిగా ఉండకపోవడం, రోజూ కొంత నడక చేయడం, శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవడం లాంటి అలవాట్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో సహాయపడతాయి. సరైన ఆహారం తీసుకుంటే మందుల అవసరం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
మొత్తంగా చూసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యను నియంత్రించడం పూర్తిగా సాధ్యం. ఇందుకు సరైన ఆహార ఎంపిక చాలా కీలకం. కూరగాయలు, ప్రోటీన్ ఆహారం, నెమ్మదిగా జీర్ణమయ్యే ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి దీర్ఘకాలం సమతుల్యంగా ఉంటుంది. ఈ విధమైన ఆహార అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనానికి బలమైన పునాది అవుతాయి.