Fertility Issues: భారత్.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం. అయినా.. మన దేశంలో అధిక సంఖ్యలో సంతాన సాఫల్య కేంద్రాలు దన్శనం ఇస్తుంటాయి. చాలామంది దంపతులు పిల్లలు లేరని ఆసుపత్రుల చుట్టూ తిరగటం చూస్తుంటాం. దీనికి కారణం.. ప్రస్తుతం చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా కెరీర్ ధ్యాసలో పడి, అప్పుడే పిల్లలెందుకు అని ఆలస్యం చేస్తుంటారు. పురుషులు కూడా ఇదే ధోరణిలో ఉంటూ.. లైఫ్‌లో సెటిల్ అయ్యాక పిల్లల్ని కనొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొనే తీవ్రమైన ఒత్తిడే సంతాన సాఫల్యతను దెబ్బతీస్తుదంటున్నారు నిపుణులు.
సాధారణంగా ఒత్తిడి అనగానే.. దానినొక మానసిక, భావోద్వేగ స్థితిగా మాత్రమే చూస్తున్నాం. కానీ, ఇది అంతకు మించి మన శరీరంలోని జీవక్రియలను అస్తవ్యస్తం చేసే ఒక ప్రధాన భాగం అని గైనకాలజీ నిపుణులు చెబుతున్నారు. యువతపై ఒత్తిడి ప్రభావం అధికంగా ఉండటం వలనే సంతానోత్పత్తి వ్యవస్థ క్షీణించిపోతుందని చెబుతున్నారు.
స్త్రీలలో సంతాన సాఫల్యతపైన ఒత్తిడి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. సంతానోత్పత్తిని, అండాశయ నిల్వలను ఒత్తిడి నేరుగా దెబ్బతీస్తున్నట్టు తెలిసింది. చైనాలోని జియాన్ జియావోటాంగ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ అంశంపై పరిశోధన చేయగా.. కొన్ని ఆడ ఎలుకలను భారీ శబ్దాలకు గురిచేసి, అవి ఒత్తిడికి గురయ్యేలా చేశారు. తర్వాత వాటికి పరీక్షలు నిర్వహించగా.. సంతానోత్పత్తికి అవసరమైన ఈస్ట్రోజన్, యాంటీ-ములెరియన్ హార్మోన్ల స్థాయులతో పాటు గుడ్ల సంఖ్య, వాటి నాణ్యత కూడా గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. స్త్రీల సంతానోత్పత్తి అంశంలోనూ ఒత్తిడి ఇలాంటి ప్రభావాలే చూపిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
ఒత్తిడికి గురైన ఎలుకల్లో అండాశయ నిల్వలు తగ్గిపోయాయని, ఫలితంగా వాటి సహజ సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోయిందని పరిశోధకులు తెలిపారు. ఈ ఒత్తిడి నేరుగా అండం విడుదల స్త్రీలల్లో నెలసరి చక్రంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా.. పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో, పని ఒత్తిడి, శరీరానికి తగిన విశ్రాంతి లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉందట. పీసీఓఎస్, నెలసరి క్రమం తప్పడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో ఒత్తిడే ముఖ్య కారణంగా ఉంటోందని పరిశోధకులు తేల్చారు.
ఈ సమస్యలను అధిగమించడానికి జీవనశైలిలో మార్పులు చేసుకుని, ఒత్తిడిని తగ్గించుకోవడమే మార్గమని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. దీనికోసం వ్యాయామం, యోగా, ధ్యానం, సంపూర్ణమైన నిద్ర, సమతుల్య ఆహారం వంటి నియమాలు పాటించాలని చెబుతున్నారు. ఈ విధానమే ఒత్తిడిని తగ్గించి, హార్మోన్ల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి సహాయపడతాయి.ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఏమాత్రం వైద్యులను సంప్రదించాలి.