Prevent dandruff before monsoon: వేసవి ఎండల నుంచి వర్షాకాలం ఇచ్చే చల్లదనం హాయిగానే ఉంటుంది కానీ.. మన జుట్టుకు మాత్రం ఈ సీజన్ ఒక శాపంగా మారుతుంది. వర్షాకాలంలో గాల్లో తేమ శాతం పెరగడం వల్ల తల చర్మంపై చెమట, జిడ్డు ఎక్కువగా పేరుకుపోతాయి. ఇది చుండ్రును కలిగించే ‘మలాసెసియా’ అనే ఫంగస్ పెరగడానికి పర్ఫెక్ట్ వాతావరణాన్ని ఇస్తుంది. అందుకే వర్షాలు పడకముందే మనం అలర్ట్ అవ్వాలి. లేకపోతే చుండ్రు పెరిగిపోయి, తల చర్మ సమస్యలతో పాటు జుట్టు విపరీతంగా రాలడం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలానికి ముందే చుండ్రును ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం.
వర్షాకాలానికి ముందే చుండ్రును అడ్డుకునే 5 అద్భుతమైన మార్గాలు:
1. అలోవెరా, నిమ్మరసం థెరపీ:
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ స్కాల్ప్ పై ఉన్న చుండ్రును , ఫంగస్‌ను ఇన్‌స్టంట్‌గా క్లీన్ చేస్తుంది. అయితే డైరెక్ట్ నిమ్మరసం పెడితే చర్మం మండుతుంది కాబట్టి, దానిని కలబంద జెల్‌తో కలిపి వాడాలి.రెండు చెంచాల ఫ్రెష్ అలోవెరా జెల్‌లో ఒక చెంచా నిమ్మరసం కలిపి తలకు బాగా పట్టించాలి. ఒక 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.అలోవెరా స్కాల్ప్‌ను చల్లబరిస్తే.. నిమ్మరసం చుండ్రును వదిలిస్తుంది. వర్షాకాలం రాకముందే వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్యే ఉండదు.
2. వేప నూనె లేదా వేప ఆకుల ప్యాక్ :
వేపలో ఉండే యాంటీ-ఫంగల్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రుపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. గుప్పెడు వేప ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పెరుగు కలిపి తలకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెరుగు తలకు మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తే.. వేప ఆకులు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.మీ దగ్గర ఆకులు లేకపోతే, మీరు రోజూ వాడే కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల వేప నూనె లేదా టీ ట్రీ ఆయిల్ కలిపి కూడా మసాజ్ చేసుకోవచ్చు.
3. ఆయిల్ పెట్టే పద్ధతి మార్చుకోవాలి :
చాలామందికి వారమంతా తలకు నూనె రాసి అలాగే ఉంచే అలవాటు ఉంటుంది. ఎండాకాలంలో ఇది నడిచినా.. వర్షాకాలం ముందు, వర్షాకాలంలో ఈ తప్పు అస్సలు చేయకూడదు. ఎందుకంటే గాల్లో ఉండే తేమకు, తలలోని నూనె తోడైతే దుమ్ము, ధూళి ఎక్కువగా పేరుకుపోయి చుండ్రు డబుల్ అవుతుంది. అందుకే నూనెను తలస్నానం చేయడానికి ఒక గంట లేదా రెండు గంటల ముందు మాత్రమే పెట్టుకోవాలి. లైట్ వెయిట్ ఆయిల్స్ అంటే కొబ్బరి నూనె లేదా బాదం నూనెను గోరువెచ్చగా చేసి మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగుంటుంది.
4. యాంటీ-డాండ్రఫ్ షాంపూ, స్కాల్ప్ ఎక్స్‌ఫోలియేషన్ :
ఈ సీజన్‌లో మీ రెగ్యులర్ షాంపూ పక్కన పెట్టి.. వారానికి కనీసం ఒక్కసారైనా జింక్ పైరిథియోన్ లేదా కీటోకానజోల్ ఉన్న ఒక మంచి యాంటీ-డాండ్రఫ్ షాంపూను వాడటం స్టార్ట్ చేయండి. షాంపూ పెట్టేటప్పుడు గోళ్లతో గిచ్చకుండా, వేలి కొనలతో సాఫ్ట్‌గా మసాజ్ చేయాలి. అలాగే తలస్నానం చేసిన ప్రతిసారీ కండిషనర్‌ను కేవలం జుట్టు జుట్టుకు మాత్రమే రాయాలి, తల చర్మానికి అస్సలు తగలనివ్వకూడదు. దీని వల్ల స్కాల్ప్ జిడ్డుగా మారకుండా ఉంటుంది.
5. జుట్టును ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం:
వర్షాకాలం ముందస్తు జాగ్రత్తల్లో.. అతి ముఖ్యమైనది జుట్టును తడిగా ఉంచకపోవడం. చెమట వల్ల లేదా పొరపాటున వర్షంలో తడవడం వల్ల జుట్టు తడిగా ఉంటే.. ఫంగస్ చాలా వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి తలస్నానం చేసినా లేదా చెమట పట్టినా వెంటనే మెత్తటి టవల్‌తో తలను పూర్తిగా ఆరబెట్టుకోవాలి.అలాగే తడి జుట్టుతో ఉన్నప్పుడు ముడి వేయడం లేదా దువ్వడం అస్సలు చేయకూడదు.ఇతరుల దువ్వెనలు, టవల్స్ అస్సలు వాడకపోవడం మంచిది.
వర్షాకాలం తెచ్చే చుండ్రు సమస్యల నుంచి మీ జుట్టును కాపాడుకోవడం ఎంత ఈజీనో.. వర్షాలు పడకముందే ఈ 5 సింపుల్ హోమ్ టిప్స్ ఫాలో అయితే.. మీ తల చర్మం క్లీన్‌గా, హెల్తీగా ఉంటుంది. ఫలితంగా చుండ్రు, తల దురద వంటి తిప్పలు లేకుండా జుట్టును కాపాడుకోండి.