Summer makeup: ఎండకాలం వచ్చిందంటే చాలు.. చెమటలు, జిడ్డుతో చర్మం కాంతివిహీనంగా మారుతుంది. దీనికి తోడు ఎంత కష్టపడి మేకప్ వేసుకున్నా, బయటికి వెళ్లిన కాసేపటికే చెమట వల్ల అది కారిపోవడం లేదా ప్యాచీగా మారిపోవడం పెద్ద సమస్య. మరి ఈ వేసవిలోనూ మీ ముఖం రోజంతా తాజాగా.. అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి? హెవీగా కాకుండా లైట్‌గా ఉంటూనే.. ఎక్కువ సేపు నిలిచే మేకప్ కోసం కొన్ని సులభమైన చిట్కాలు మీకోసం. వీటిని పాటిస్తే ఎండ ఎంత ఉన్నా మీ గ్లో అస్సలు తగ్గదు.
వేసవి మేకప్ చిట్కాలు:
సమ్మర్‌లో మేకప్ వేసుకునేటప్పుడు కొన్ని సింపుల్ విషయాలు గుర్తుంచుకుంటే మేకప్ పాడవకుండా చూసుకోవచ్చు. కొన్ని బెస్ట్ బ్యూటీ హ్యాక్స్ ..
1. ఐస్ క్యూబ్ థెరపీతో స్టార్ట్ చేయండి:
మేకప్ వేసుకోవడానికి 10 నిమిషాల ముందు ఒక ఐస్ క్యూబ్‌ను పల్చటి కాటన్ క్లాత్‌లో చుట్టి మొహంపై మెల్లగా రుద్దండి. ఇది మీ చర్మ రంధ్రాలను తాత్కాలికంగా మూసివేస్తుంది. దీని వల్ల చెమట, జిడ్డు ఉత్పత్తి తగ్గి, మేకప్ ఎక్కువ సేపు చర్మంపై నిలుస్తుంది.
2. ప్రైమర్‌ను అస్సలు స్కిప్ చేయొద్దు:
వేసవిలో మేకప్ ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉండాలంటే ‘ప్రైమర్’ వాడటం చాలా ముఖ్యం. ఇది చర్మానికి, మేకప్‌కు మధ్య ఒక లేయర్‌లా పనిచేస్తుంది. సమ్మర్‌లో ఆయిల్-ఫ్రీ లేదా మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చే జెల్ బేస్డ్ ప్రైమర్‌ను ఎంచుకోండి. ఇది చెమటను నియంత్రిస్తుంది.
3. హెవీ ఫౌండేషన్‌కు గుడ్‌బై చెప్పండి:
ఎండకాలంలో హెవీ క్రీమ్ ఫౌండేషన్స్ వాడితే ముఖం కేకీగా (పగుళ్లు వచ్చినట్లు) మారుతుంది. అందుకే ఫౌండేషన్‌కు బదులుగా తేలికపాటి BB క్రీమ్, CC క్రీమ్ లేదా టింటెడ్ మాయిశ్చరైజర్ వాడటం మంచిది. ఇవి చర్మానికి సహజమైన లుక్‌ను ఇస్తాయి. ఒకవేళ ఫౌండేషన్ వాడాల్సి వస్తే, వాటర్ బేస్డ్ లేదా మ్యాట్ ఫౌండేషన్ వాడండి.
4. లూజ్ పౌడర్‌తో సెట్ చేయండి:
క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత, వాటిని లాక్ చేయడం ముఖ్యం. ముఖ్యంగా కళ్ల కింద, ముక్కు భాగంలో చెమట ఎక్కువగా వస్తుంది. కాబట్టి మేకప్ వేసాక ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ లేదా లూజ్ పౌడర్‌తో కాస్త టచ్ అప్ చేయండి. ఇది అదనపు జిడ్డును పీల్చేస్తుంది.
5. వాటర్‌ప్రూఫ్ ప్రొడక్ట్స్‌కే ఓటు వేయండి:
సమ్మర్‌లో ఐ లైనర్, మస్కారా, కాటుక కరిగిపోయి కళ్ల చుట్టూ నల్లగా మారడం సాధారణం. అందుకే ఈ కాలంలో కచ్చితంగా వాటర్‌ప్రూఫ్, స్మడ్జ్‌ప్రూఫ్ ఐ మేకప్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. పెదవుల కోసం హెవీ గ్లోస్ కాకుండా లాంగ్ లాస్టింగ్ మ్యాట్ లిప్‌స్టిక్స్ బెటర్.
6. సెట్టింగ్ స్ప్రే తప్పనిసరి:
మేకప్ అంతా పూర్తయిన తర్వాత చివరగా మేకప్ సెట్టింగ్ స్ప్రే వాడటం మర్చిపోవద్దు. ఇది మీ మేకప్‌ను గంటల తరబడి కదలకుండా ఒకేలా ఉంచుతుంది.మధ్యమధ్యలో ముఖం జిడ్డుగా అనిపిస్తే బ్లాటింగ్ పేపర్స్ ఉపయోగించి నూనెను అద్దుకోండి. అంతే కానీ పదే పదే పౌడర్ రుద్దకండి.