Mango Storage Tips: వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది మామిడి. తీపి, పులుపు కలయికతో ఉండే మామిడి పండ్లను ఇష్టపడని వారుండరు. సమ్మర్ లో ఎక్కువగా దొరికే మార్కెట్ నుంచి తెచ్చిన మామిడి పండ్లు త్వరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలని చాలా మంది వాటిని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. అయితే.. మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొచ్చా? లేదా బయటే ఉంచాలా? అనే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. తప్పుడు పద్ధతుల్లో నిల్వ చేయడం వల్ల మామిడి పండ్లు వాటి సహజమైన రుచిని, సువాసనను కోల్పోతాయి. మామిడి పండ్లను ఎక్కువ రోజులు తాజాగా, పోషకాలు తగ్గకుండా ఎలా నిల్వ చేయాలో కొన్ని అద్భుతమైన చిట్కాల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి మామిడి కాయలను ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?
మీరు మార్కెట్ నుంచి తెచ్చిన మామిడి కాయలు ఇంకా పూర్తిగా పండకుండా గట్టిగా ఉంటే.. వాటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లో ఉండే చల్లటి ఉష్ణోగ్రత మామిడి కాయలు పండే ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తుంది. దీని వల్ల కాయలు లోపల గట్టిగా ఉండిపోయి, కాలక్రమేణా కుళ్ళిపోతాయి తప్ప అస్సలు పండవు. అంతే కాకుండా వాటి సహజమైన తీపిదనం కూడా తగ్గిపోతుంది. కాబట్టి పచ్చిగా ఉన్న కాయలను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి.
పచ్చి మామిడి కాయలను త్వరగా పండించడం ఎలా?
పచ్చి మామిడి కాయలు త్వరగా, సహజంగా పండాలంటే వాటిని ఒక పేపర్ బ్యాగ్‌లో లేదా న్యూస్ పేపర్‌లో చుట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఇలా చేయడం వల్ల మామిడి కాయల నుండి ‘ఇథిలీన్’ అనే సహజ వాయువు విడుదలవుతుంది. ఈ వాయువు పేపర్ బ్యాగ్ లోపలే ఉండిపోవడం వల్ల పండ్లు త్వరగా, సమానంగా పండుతాయి. ఒకవేళ మీ దగ్గర పేపర్ బ్యాగ్ లేకపోతే.. బియ్యం ఉన్న డబ్బాలో మామిడి కాయలను ఉంచినా కూడా అవి రెండు రోజుల్లోనే చక్కగా పండుతాయి.
బాగా పండిన మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?
మామిడి పండ్లు పూర్తిగా పండిన తర్వాత, అవి మెత్తగా మారి మంచి సువాసన వస్తున్నప్పుడు వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. పండిన మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఉంటాయి. అయితే.. వాటిని నేరుగా ఫ్రిజ్ షెల్ఫ్‌లపై పెట్టకుండా, ఒక ప్లాస్టిక్ కవర్ లేదా జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టి, ఫ్రిజ్‌లో కింద ఉండే వెజిటబుల్ బాక్స్‌లో ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ లోని చల్లటి పొడి గాలి నేరుగా పండ్లపై పడకుండా ఉంటుంది. తద్వారా పండ్ల పై చర్మం నల్లగా మారకుండా తాజాగా ఉంటుంది. పండిన మామిడి పండ్లను ఫ్రిజ్‌లో సుమారు 4 నుంచి 5 రోజుల పాటు సురక్షితంగా నిల్వ ఉంచవచ్చు.
Also Read: ఇవి తింటే.. నీరసం, అలసట రమ్మన్నా రావు తెలుసా ?
కట్ చేసిన మామిడి ముక్కలను నిల్వ చేసే పద్ధతి:
చాలా మంది మామిడి పండ్లను ముక్కలుగా కోసి, మిగిలిపోయిన వాటిని అలాగే ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కట్ చేసిన మామిడి ముక్కలను గాలి చొరబడని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి.ఇలా చేయడం వల్ల ముక్కలు గాలికి ఎండిపోకుండా.. ఫ్రిజ్‌లోని ఇతర వస్తువుల వాసన వీటికి అంటుకోకుండా ఉంటుంది. ఈ ముక్కలను 1 లేదా 2 రోజుల్లోగా తినేయడం మంచిది. ఒకవేళ మీరు మామిడి ముక్కలను కొన్ని నెలల పాటు నిల్వ చేయాలనుకుంటే.. వాటిని డీప్ ఫ్రిజ్ లో పెట్టి ఐస్ లా మార్చవచ్చు. వీటిని తర్వాత మాంగో షేక్స్ లేదా స్మూతీల తయారీలో వాడుకోవచ్చు.
మామిడి పండ్ల విషయంలో చేయకూడని తప్పులు:
మార్కెట్ నుంచి తెచ్చిన మామిడి పండ్లను తినడానికి ముందే కడగాలి. నిల్వ చేసే ముందే కడిగి, తడి ఆరకుండా అలాగే పెడితే తేమ కారణంగా.. పండ్లపై బూజు పట్టి త్వరగా కుళ్ళిపోతాయి. అలాగే మామిడి పండ్లను అరటిపండ్లు లేదా ఆపిల్ పండ్ల పక్కన ఉంచకూడదు. ఎందుకంటే ఆ పండ్ల నుంచి కూడా ఇథిలీన్ గ్యాస్ ఎక్కువగా విడుదలవుతుంది. దీనివల్ల మామిడి పండ్లు అతి త్వరగా పండిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది.