టీ లేదా కాఫీ లేకుండా చాలామందికి ఉదయం మొదలవదు. నిద్రలేవగానే ఈ రెండు పానీయాల్లో ఏదో ఒకటి తాగితేనే శరీరం చురుకుగా అనిపిస్తుందని చాలామంది భావిస్తారు. అయితే రోజూ తాగే ఈ అలవాటు ఎముకల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తోంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకల బలం తగ్గే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే నిపుణులు టీ, కాఫీ రెండింటి ప్రభావం గురించి అధ్యయనం చేసి ఏది మంచిదో వివరాలు వెల్లడిస్తున్నారు.
టీతో ఎముకల ఆరోగ్యం
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ ఎముకల ఆరోగ్యానికి కొంత మేలు చేసే అవకాశం ఉంది. గ్రీన్ టీ అయినా, బ్లాక్ టీ అయినా అందులో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో వచ్చే వాపు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ వాపు తగ్గితే ఎముకలు క్రమంగా బలంగా ఉండే అవకాశం పెరుగుతుంది. కొన్ని పరిశోధనల్లో రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల టీ తాగే వ్యక్తుల్లో ఎముకల సాంద్రత మెరుగ్గా ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. టీ తాగడం వల్ల ఎముకల కరుగుదల వేగం కొంత తగ్గవచ్చని కూడా వారు భావిస్తున్నారు.
కాఫీలో కెఫీన్ ఎక్కువ
ఇక కాఫీ విషయానికి వస్తే, దీనిపై అభిప్రాయాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. కాఫీలో కేఫిన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఈ కేఫిన్ శరీరంలో కాల్షియం శోషణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎక్కువగా కాఫీ తాగితే మూత్రం ద్వారా కాల్షియం బయటకు వెళ్లే అవకాశం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు నాలుగు లేదా ఐదు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగేవారిలో ఎముకల బలం కొద్దిగా తగ్గినట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వయస్సు ఎక్కువగా ఉన్నవారు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే కాఫీ పూర్తిగా హానికరం అని చెప్పలేం. పరిమితంగా తీసుకుంటే పెద్దగా సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగే వ్యక్తుల్లో ఎముకల ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని పరిశోధనలు వెల్లడించాయి. కాఫీలో కూడా కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి కొంత మేలు చేస్తాయి. కాబట్టి కాఫీ తాగాలనుకునేవారు పరిమితి పాటిస్తే ఎముకలకు పెద్దగా నష్టం ఉండదు. కాఫీ తాగే సమయంలో పాలతో తీసుకుంటే కాల్షియం లోపం కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది.
మొత్తంగా చూస్తే ఎముకల ఆరోగ్యానికి టీ కొంచెం మెరుగైన ఎంపికగా నిపుణులు భావిస్తున్నారు. అయితే టీ అయినా, కాఫీ అయినా ఒక్కటే ఎముకల బలాన్ని నిర్ణయించవు. రోజూ తినే ఆహారం, శరీరానికి తగిన వ్యాయామం, సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి లభ్యత వంటి అంశాలు కూడా చాలా ముఖ్యం. పాల పదార్థాలు, ఆకుకూరలు, గింజలు వంటి కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా నడక, యోగా వంటి వ్యాయామాలు చేస్తే ఎముకలు బలంగా ఉంటాయి. టీ లేదా కాఫీని మితంగా తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే ఎముకల సమస్యల నుంచి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.