Chicken Harmful: ప్రపంచవ్యాప్తంగా మాంసాహారులందరూ చికెన్ అంటే ఇష్టంగా తింటారు. చికెన్ అత్యంత పాపులర్ ప్రొటీన్ సోర్స్. కండరాలు పెరగడానికి, ఎనర్జీ కోసం చాలా మంది రోజూ తింటారు. అయితే చికెన్‌లోని కొన్ని భాగాలు తింటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ వండే, తినే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. దీనికి కారణం ఈ భాగాల్లో ఉండే అధిక కొవ్వు, బ్యాక్టీరియా, కలుషితాలు ఉండడం.
చాలా మందికి కోడి చర్మం క్రిస్పీగా, రుచికరంగా అనిపిస్తుంది. కానీ ఇందులో సాచురేటెడ్ కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రై చేస్తే క్యాలరీలు మరింత పెరుగుతాయి. తరచూ తింటే బరువు పెరగడం, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణులు చర్మం తీసేసి వంట చేయాలని సూచిస్తారు. చర్మం లేని కోడిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ స్కిన్ లెస్ చికెన్ తినడం బెస్ట్.
కోడి ఊపిరితిత్తులలో ధూళి, బ్యాక్టీరియా, హానికరమైన కణాలను సులభంగా అంటుకొని ఉంటాయి. వీటిని పూర్తిగా శుభ్రం చేయడం కష్టం. వేడిగా వండినా కొన్ని కలుషితాలు మిగిలే ఉంటాయి. కాబట్టి డాక్టర్లు ఈ భాగం ఎక్కువగా తినకూడదని చెబుతారు.
చికెన్ థై పీస్ అంటే కోడి తొడలు వండిన తర్వాత జ్యూసీగా, మెత్తగా, అత్యంత రుచికరంగా ఉంటాయి. కానీ ఈ భాగంలో రొమ్ము మాంసం కంటే ఎక్కువ కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు లీన్ కట్స్ అయిన కోడి రొమ్ము మాంసాన్ని ఎక్కువగా తినాలి. చికెన్ లెగ్స్, థై పీస్ తింటే బరువు త్వరగా పెరుగుతారు. గ్రిల్ చేసి లేదా ఉడికించి తినడం ఆరోగ్యానికి మంచిది. ఫ్రై చేసి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు.
కొంత మంది వంటల్లో కోడి పేగులు ఉపయోగిస్తారు. కానీ వీటిలో సాల్మొనెల్లా వంటి హానికర బ్యాక్టీరియా ఉండవచ్చు. సరిగా శుభ్రం చేయకపోతే ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది. అధిక వేడితో బాగా వండితే బ్యాక్టీరియా చనిపోతుంది.
కోడి తల చాలా పారవేస్తారు. కానీ కొంత మంది ఇది కూడా తింటారు. అయితే ఇందులో తినదగిన మాంసం తక్కువగా ఉంటుంది. సరిగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా ప్రమాదం ఎక్కువ. తోకలో సహజంగా ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఫ్రై చేస్తే క్యాలరీలు ఎక్కువగా పెరుగుతాయి.
కోడి కాళ్లు సూప్ చేసుకొని తాగుతారు లేదా స్ట్రీట్ ఫుడ్‌లో ఉపయోగిస్తారు. వీటిలో కొలాజెన్ ఎక్కువగా ఉంటుంది. కానీ వీటిలో మురికి అధికంగా ఉండడం వల్ల బ్యాక్టీరియా సులభంగా వస్తాయి. బాగా కడిగి, వండితే మాత్రమే సురక్షితం.
కోడిని బాగా వండకపోతే హానికర బ్యాక్టీరియా వ్యాపిస్తాయి. ముక్కలు కట్ చేసే బోర్డు, కత్తులు శుభ్రంగా ఉంచాలి. ముక్కలు వండేటప్పుడు అంతర్గత ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉండాలి.
చికెన్ బ్రెస్ట్ అంటే కోడి రొమ్ము మాంసం, చర్మం లేని గ్రిల్ లేదా బాయిల్డ్ కోడి మంచివి. కూరగాయలు, సలాడ్లతో కలిపి తినండి. చికెన్ షాపులో పరిశుభ్రత కూడా గమనించండి. శుభ్రమైన దుకాణం నుంచి తాజా కోడి మాత్రమే కొనండి.
కోడి మాంసంలో శరీరంలో మంచి ప్రోటీన్ అందిస్తుంది. కానీ అన్ని భాగాలు ఆరోగ్యానికి మంచివి కావు. అధిక కొవ్వు, సరిగా శుభ్రం కాని భాగాలను తినకూడదు. సరైన శుభ్రత, వంట పద్ధతులు పాటిస్తే మాత్రమే సురక్షితం.