Vitamin B12 deficiency: ప్రస్తుత కాలంలో ఆర్థికంగా ఎంత ప్రగతి సాధిస్తున్నా.. చాలా మందిలో పోషకాహార లోపం అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలా మారుతోంది. ముఖ్యంగా మన దేశ జనాభాలో విటమిన్ బి12 , ఫోలేట్ అంటే విటమిన్ బి9 లోపాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఇటీవల జరిగిన జాతీయ స్థాయి సర్వేలు , పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నిత్యం మనం పడే అలసట, నీరసం వెనక ఈ విటమిన్ల కొరత దాగి ఉంటోంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, మెదడు చురుకుదనానికి, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఈ రెండు విటమిన్లు అత్యంత అవసరం. మరి పురుషులు, మహిళలపై ఈ లోపాలు ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయో తెలుసుకుందాం.
భారత్‌లో ఈ లోపాలు పెరగడానికి ప్రధాన కారణాలు:
మన దేశంలో విటమిన్ బి12 లోపం ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం మన ఆహార అలవాట్లు. విటమిన్ బి12 సహజంగా కేవలం మాంసం, చేపలు, గుడ్లు ,డైరీ ఉత్పత్తులలో మాత్రమే లభిస్తుంది. దాదాపు నలభై శాతం మంది శాఖాహారులు కావడం, మాంసాహారం తినేవారు కూడా రోజువారీ డైట్‌లో తగినంతగా తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తోంది. మరోవైపు ఫోలేట్ అనేది ఆకుకూరలు, పప్పుధాన్యాలలో ఉన్నప్పటికీ.. వాటిని ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఆ పోషకాలు నశించిపోతున్నాయి. దీనికి తోడు నేటి లైఫ్ స్టైల్, గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువగా వాడటం వల్ల కూడా శరీరం ఈ విటమిన్లను సరిగ్గా గ్రహించలేకపోతోంది.
మహిళల ఆరోగ్యంపై చూపే తీవ్ర ప్రభావాలు:
విటమిన్ బి12 , ఫోలేట్ లోపాల వల్ల మహిళలు అత్యధికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మహిళల్లో ఫోలేట్ లోపం ఉంటే.. అది పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గర్భస్థ శిశువుల్లో వెన్నుపూస, మెదడుకు సంబంధించిన తీవ్రమైన లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల గర్భస్రావాలు జరగడం లేదా తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఈ విటమిన్ల లోపం వల్ల మహిళల్లో తీవ్రమైన రక్తహీనత అంటే మెగాలోబ్లాస్టిక్ అనీమియా ఏర్పడుతుంది. దీని వల్ల పీరియడ్స్ సమయంలో విపరీతమైన నీరసం, ఊపిరి అందకపోవడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం, చర్మం పాలిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
పురుషుల ఆరోగ్యంపై చూపే ప్రభావాలు:
పురుషులలో కూడా ఈ విటమిన్ల లోపం వల్ల తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు వస్తున్నాయి. విటమిన్ బి12 తగ్గడం వల్ల శరీరంలో హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లం స్థాయిలు పెరిగిపోతాయి. ఇది గుండె ధమనులను దెబ్బతీసి, వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే గుండెపోటు ,స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఆఫీస్ పనుల్లో విపరీతమైన ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తరచూ మూడ్ స్వింగ్స్ రావడం, తీవ్రమైన డిప్రెషన్‌కు గురికావడం వెనుక బి12 లోపం ఉంటుంది. నరాల బలహీనత ఏర్పడటం వల్ల నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం, కాళ్లలో సూదులతో గుచ్చినట్లు అనిపించడం వంటి నరాల వ్యాధులు పురుషులలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నివారణ మార్గాలు:
ఈ సమస్యను కేవలం మెడిసిన్స్ ద్వారానే కాకుండా సరైన అవగాహనతో ముందే అడ్డుకోవచ్చు. శాఖాహారులు తమ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, పనీర్ వంటి డైరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను వాడటం మంచిది. ప్రభుత్వం కూడా ఈ పోషకాహార లోపాన్ని అరికట్టడానికి రేషన్ బియ్యం , పాలల్లో ఫోర్టిఫికేషన్ ద్వారా ఈ విటమిన్లను అందిస్తోంది. సంవత్సరానికి ఒకసారైనా విటమిన్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మన శరీరంలో వీటి స్థాయిలను తెలుసుకోవచ్చు.
పోషకాహార లోపం అనేది మనల్ని లోపల నుండే బలహీనపరుస్తుంది. విటమిన్ బి12 , ఫోలేట్ లోపాలను కేవలం సాధారణ నీరసంగా భావించి అశ్రద్ధ చేస్తే, అది భవిష్యత్తులో గుండె , నరాల వ్యవస్థకు సంబంధించిన శాశ్వత నష్టానికి దారితీస్తుంది. అందుకే పురుషులైనా, మహిళలైనా తమ ఆహారంలో సమతుల్యతను పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ విశ్శబ్ద ఆరోగ్య సంక్షోభం నుంచి సులభంగా బయటపడవచ్చు.