Chadalavada Support: ప్రముఖ నిర్మాత, దర్శకుడు మరియు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) బోర్డు ఆఫ్ డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావు సినీ కార్మికుల సంక్షేమం కోసం మరో అద్భుతమైన హామీని ఇచ్చారు. గతంలో చిత్రపురి కాలనీ బ్యాంక్ వేలానికి వెళ్లకుండా కోట్లాది రూపాయల రుణం అందించి, వందలాది కార్మికుల సొంతింటి కలను కాపాడిన ఆయన, ఇప్పుడు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు సొంత భవనాన్ని నిర్మించి ఇస్తానని ప్రకటించారు.
ఇటీవల ఏపీఎఫ్‌డీసీ డైరెక్టర్‌గా నియమితులైన చదలవాడను ఫెడరేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమకు శాశ్వత భవనం లేదనే విషయాన్ని, రెండు రాష్ట్రాల సినీ కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి ఉపాధి కల్పించాల్సిన అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చదలవాడ, ప్రభుత్వం నుంచి స్థలం సేకరిస్తే.. ఎవరి నుంచి రూపాయి విరాళం ఆశించకుండా, దేశంలోనే మరే ఫెడరేషన్‌కు లేని విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన భవనాన్ని మహానటుడు ఎన్టీఆర్ పేరు మీద నిర్మించి ఇస్తానని అభయమిచ్చారు.
Read also-Gundeninda Gudigantalu Vidya : ‘గుండెనిండా గుడిగంటలు ‘ విద్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
చదలవాడ శ్రీనివాసరావు తీసుకున్న ఈ నిర్ణయంపై ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన దాతృత్వాన్ని కొనియాడుతూ, తెలుగు సినీ కార్మికులంతా ఆయనకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకులు కె. అజయ్ కుమార్, వీఎన్ ఆదిత్య, రామ్ ప్రసాద్, సముద్రలతో పాటు డీఓపీ, ప్రొడక్షన్, లైట్‌మెన్, జూనియర్ ఆర్టిస్ట్, మహిళా వర్కర్స్ మరియు రైటర్స్ అసోసియేషన్లకు చెందిన భీముడు, వెంకటకృష్ణ, ప్రసాద్ బాబు, శ్రీనివాస్, ఈశ్వరరెడ్డి, స్వామిగౌడ్, రవీందర్, లలిత, ఉమర్జీ కుమరన్, పి.యస్.యన్. దొర తదితర ముఖ్య నాయకులు పాల్గొని చదలవాడకు కృతజ్ఞతలు తెలిపారు.