don 3 controversy: బాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా ప్రచారం పొందిన ‘డాన్ 3’ చిత్రం చుట్టూ ఉన్న వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. ఈ సినిమా నుండి హీరో రణవీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో, దర్శకుడు-నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మక సినీ కార్మిక సమాఖ్య అయిన ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) దృష్టికి తీసుకెళ్లారు. రణవీర్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందంటూ ఫర్హాన్ అఖ్తర్ ఎఫ్‌డబ్ల్యుఐసిఈకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై సోమవారం (మే 25న) సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిర్వహించే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎఫ్‌డబ్ల్యుఐసిఈ తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది.
Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి మాస్ ధమాకా.. ‘హెల్లాళ్లాల్లో’ సాంగ్ విడుదల!
అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు నటించిన ‘డాన్’ ఫ్రాంచైజీకి బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. షారూఖ్ స్థానంలో కొత్త ‘డాన్’గా రణవీర్ సింగ్‌ను ప్రకటిస్తూ గతేడాది మేకర్స్ భారీ అంచనాలతో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే, స్క్రిప్ట్ మార్పులు, మేకింగ్ శైలి విషయంలో రణవీర్ సింగ్‌కు, చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్’కు మధ్య తీవ్రమైన సృజనాత్మక విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత, ఆయన తన తదుపరి చిత్రాల ఎంపికపై పునరాలోచనలో పడ్డారని, ఆ క్రమంలోనే ‘డాన్ 3’ నుండి హఠాత్తుగా తప్పుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
రణవీర్ సింగ్ స్క్రిప్ట్‌కు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఆయన నమ్మకంతోనే తాము దాదాపు రూ. 40 కోట్లు ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ఖర్చు చేశామని నిర్మాతలు ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిధ్వానీ వాదిస్తున్నారు. రణవీర్ తప్పుకోవడం వల్ల తాము తీవ్ర ఆర్థిక నష్టాన్ని, సమయాన్ని కోల్పోయామని, అందుకే రూ. 40 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫర్హాన్ ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా పంపినట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించినప్పటికీ, సమస్య సద్దుమణగకపోవడంతో ఫర్హాన్ అఖ్తర్ ఈ విషయాన్ని ‘ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్’ ద్వారా ఎఫ్‌డబ్ల్యుఐసిఈ (FWICE)కి చేరవేశారు.
Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి మాస్ ధమాకా.. ‘హెల్లాళ్లాల్లో’ సాంగ్ విడుదల!
ఈ వివాదంపై ఫర్హాన్ అఖ్తర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కెమెరా ముందుకు వచ్చి సీన్ ఓకే అయ్యే వరకు దేన్నీ ఖచ్చితంగా నమ్మలేం. ఇలాంటి అడ్డంకులు ఎదురైనప్పుడు, ఇవన్నీ వదిలేసి మళ్లీ కేవలం నటనపైనే దృష్టి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది” అంటూ కాస్త నిరాశను వ్యక్తపరిచారు.
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఎఫ్‌డబ్ల్యుఐసిఈ తీసుకోబోయే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వివాదం కారణంగా ‘డాన్ 3’ భవితవ్యం మళ్లీ అయోమయంలో పడింది. రణవీర్ స్థానంలో మరో హీరోని తీసుకుంటారా లేదా ఫర్హాన్ స్వయంగా ఈ పాత్ర చేస్తారా అనేది సోమవారం నాటి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.